వార్తలు రాజకీయం
అమరావతి : లోతట్టు ప్రాంతాల్లో చెక్ డ్యాముల నిర్మాణం ఫలితాలేమిటో కరువు పీడిత ప్రాంతాలకు బాగా తెలుసు. వర్షపు నీటిని ఒడిసిపట్టి నిల్వచేసి భూగర్భజలాలను పెంచుకోవడంలో వాటిపాత్ర ఎనలేనిది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ఈ క్రమంలోనే జలసంరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ.. రహదారుల నిర్మాణంలో కొత్త పద్ధతి అనుసరించాలని రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ(ఎంఓఆర్‌టీహెచ్) నిర్ణయించింది. కాలువలు, వాగులు, వంకలు ప్రవహించే ప్రాంతాల్లో వంతెనలకు బదులు బ్యారేజీలు నిర్మిస్తారు. దీనివల్ల ఆయా ప్రాంతాల్లో భూగర్భజలాలు పెరుగుతాయి. అవసరాలకు నీరు లభ్యమవుతుంది. ఇక కాలువలు, వాగులు, వంకలను పూడిక తీయడం ద్వారా రహదారుల నిర్మాణానికి అవసరమైన మట్టిని సేకరించాలని మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఫలితంగా కరువు పీడిత ప్రాంతాల్లో రూపాయి ఖర్చులేకుండానే పూడిక తీయవచ్చు. ఈ అంశాలను ప్రస్తావిస్తూ ఇటీవల ఎంఓఆర్‌టీహెచ్ రాష్ట్రాలకు లేఖలు రాసింది. ఈ మహత్తర ప్రక్రియలో పాలుపంచుకోవాలని, అనుమతులు, సహాకరించే విషయంలో కీలకపాత్ర పోషించాలని కోరింది. కరువు పీడిత ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం ఎలా ఉండాలి? నదులు, కాలువలు, వాగులు, వంకల మీదుగా రహదారుల నిర్మాణం చేస్తున్నప్పుడు ఎలాంటి విధివిధానాలు అనుసరించాలన్న దానిపై రెండు ప్రఖ్యాత సంస్థలతో ఎంఓఆర్‌టీహెచ్ అధ్యయనం చేయించి ఆ సిఫారసుల ఆధారంగా ఈ నిర్ణయాలు తీసుకుంది. చిన్నపాటి నదులు, పెద్ద, మధ్యతరహా కాలువలు, వాగులు ప్రవహించే ప్రాంతాల్లోనూ నీటి సంరక్షణ అవసరమని గుర్తించారు. రహదారుల నిర్మాణంలో భాగంగా వీటిపై భారీ వ్యయంతో వంతెనలు నిర్మిస్తుంటారు. సగటున ఒక్కో వంతెన వ్యయం రూ.30కోట్లపైనే ఉంటోంది. వాటికి మరికొంత జోడించి వంతెనల స్థానంలోనే అవసరాన్ని బట్టి జలసంరక్షణకు ఉపయోగపడే బ్యారేజీలు నిర్మించాలని ఎంఓఆర్‌టీహెచ్ నిర్ణయించింది. దీనివల్ల బహుళ ప్రయోజనాలు ఉంటాయని, టూరిజాన్ని కూడా అభివృద్ధి చేసుకోవచ్చని అంచనావేస్తోంది. ‘భారీ నదులపై భారీ బ్యారేజీల నిర్మాణం ఎంఓఆర్‌టీహెచ్ బాధ్యతకాదు. పైగా.. అవన్నీ నీటి హక్కుల వినియోగానికి సంబంధించిన అంశాలతో ముడిపడి ఉంటాయి. ఎలాంటి జల వివాదాలు లేని ప్రాంతాల్లోనే ఇది సాధ్యం. నదుల నీటి వినియోగం, నిల్వ.. జలవనరుల శాఖ పరిధిలోని అంశం. అయితే, ఆయా రాష్ట్రాల్లో చిన్నతరహా నీటిపారుదల వ్యవస్థలు.. అంటే కాలువలు, వాగులు, వంకలు, ఉపనదులున్న చోట ఈ విధానం సాధ్యమవుతుంది. రవాణాకోసం ఆ నీటి వనరులపై ఎలాగూ కోట్లాది రూపాయల వ్యయంతో వంతెనలు నిర్మించాలి. అలా కాకుండా...స్థానిక ప్రజల అవసరాలు, భూగర్భజలవనరుల పెంపుదలకు ఉపయోగపడేలా బ్యారేజీలను నిర్మించాలని నిర్ణయించాం’’ అని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. బ్రిడ్జి కమ్ బ్యారేజీలు ఎక్కడ నిర్మించాలన్నదానిపై ఆయా రాష్ట్రాల ఎన్‌హెచ్‌ఏ అధికారులు అధ్యయనం చేసి కేంద్రానికి ప్రతిపాదనలు ఇస్తారు. 2018-19 ఆర్థిక సంవత్సరం నుంచే ఈ విధానం అమలు చేయాలని ఎంఓఆర్‌టీహెచ్ పట్టుదలగా ఉంది. భారతమాల కింద చేపట్టే జాతీయ రహదారుల ప్రాజెక్టుల్లో ఈ మోడల్‌ను అమల్లోకి తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారు. భారతమాల కింద ఐదేళ్ల వ్యవధిలో 83 వేల కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టాలన్న ప్రతిపాదనలున్నాయి. వీటిల్లో 7,800 వంతెనలు కట్టాల్సి ఉంది. ఇందులో బ్రిడ్జి కమ్ బ్యారేజ్‌లా నిర్మించదగినవి 2,500పైనే ఉన్నట్లు తెలిసింది. ఈ విధమైన నిర్మాణాలవల్ల భారతమాల ప్రాజెక్టు బడ్జెట్ రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.5 లక్షల కోట్లకు పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. రహదారుల నిర్మాణానికి పెద్దఎత్తున మట్టి అవసరం. వాటిని రైతుల పొలాలు, గుట్టల నుంచి తవ్వి తీసుకొస్తున్నారు. ఈ మట్టిని కాంట్రాక్టర్లు కొనుగోలు చేయాల్సిందే. ఇది ఖరీదైన ప్రక్రియ. వెనుకబడిన ప్రాంతాల్లో కాలువలు, చెరువులు, బావులు, నీటి కుంటలు చాలా వరకు పూడిపోయాయి. వాటి పూడికతీత ఆయా రాష్ట్రాలకు ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఈ నేపథ్యంలో రహదారుల నిర్మాణం, గట్ల బలోపేతానికి కాల్వలు, బావులమట్టిని వాడుకోవచ్చని ఎంఓఆర్‌టీహెచ్ భావిస్తోంది. రహదారుల నిర్మాణం జరుగుతున్న ప్రాంతాల్లో.. స్థానిక ప్రభుత్వాల అనుమతితో పూడికతీసి ఆ మట్టిని తరలించుకోవాలి. అయితే, రోడ్డు నిర్మాణానికి ఆ మట్టి పనికివ స్తుందా..లేదా? అనే నాణ్యతా పరీక్ష లు చే యించాల్సింది ఆర్‌అండ్‌బీ అధికారులే. కరువు పీడిత ప్రాంతాల్లో కాలువలు, బావుల పూడిక తీయడంవల్ల వర్షాకాలంలో అవి రీఛార్జ్ అవుతాయి. భూగర్భజలాలు పెరిగి స్థానిక రైతాంగానికి మేలు జరుగుతుందని భావిస్తోంది
ప్లాన్ బీ