YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

అధికార పార్టీ పేరు చెప్తే ఓకే...

అధికార పార్టీ పేరు చెప్తే ఓకే...
నిజామాబాద్ : వ్యవసాయశాఖలో సబ్సిడీ యంత్రాల పథకం చివరి దశకు వచ్చింది.. లబ్ధిదారుల జాబితా సిద్ధమైంది. అయితే అధికార పార్టీ నేతలు చెప్పిన వారికే జాబితాలో చోటు కల్పించినట్లు తెలుస్తోంది. ఇందులో సగానికి పైగా అనర్హులున్నట్లు తెలిసింది. మరోవైపు బినామీల పేర్లమీద తీసుకొనేందుకు పకడ్బందీ ప్రణాళిక రూపొందించారు. ఓ ముఖ్యనేత వ్యక్తిగత సహాయకుడు కమీషన్‌ పద్ధ్దతిన ట్రాక్టరుకు రూ.లక్ష కాజేసేందుకు యత్నిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. జిల్లా, నియోజకవర్గాల వారీగా యంత్రాలు ఇవ్వాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది.ఇందుకురాష్ట్రస్థాయి సాధారణ బడ్జెట్‌ నుంచీ యంత్రాలు మంజూరు కానున్నాయి. ప్రాథమిక సమాచారం మేరకు జిల్లా వ్యవసాయశాఖ నుంచి ఎమ్మెల్యేలు ప్రతిపాదించిన పేర్లతో (245 మందితో) కూడిన జాబితాను రూపొందించారు. రాష్ట్రస్థాయి ప్రణాళిక నుంచి మరో 550 వరకు ట్రాక్టర్లు రానున్నాయి. అదేవిధంగా రైతు సంఘాలకు వరి కోత యంత్రాలు ఇచ్చేందుకూ సర్కారు ముందుకొచ్చింది. ఇప్పటికే 12 సంఘాలకు అనుమతి వచ్చింది. మరో ఆరు సంఘాలకు ఆమోదం వచ్చినట్లు తెలుస్తోంది. ఈలెక్కన కనీసం రూ.30 కోట్లు ప్రభుత్వం రాయితీ రూపంలో వెచ్చించనుంది. పార్లమెంటు, శాసనసభ్యులు తమ అనుచరగణానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులతోపాటు పార్టీ ద్వితీయశ్రేణి నేతలు జాబితాలో స్థానం దక్కించుకొన్నారు. కొందరు నాయకులు తమ బంధువుల పేర్ల మీద తీసుకొనేందుకు పావులు కదుపుతున్నారు. జిల్లా ముఖ్యనేత వ్యక్తిగత సహాయకుడు, సమీప మనుషులు ఒకరిద్దరు కమీషన్‌ పద్ధతినా ముడుపులు మాట్లాడుకొని కట్టబెట్టేందుకు సిద్ధమైనట్లు ఆరోపణలొస్తున్నాయి. రాయితీలను దక్కించుకోవాలన్నా తాపత్రయం కొంతమంది నాయకులను యంత్రాల వెంట పరుగులు పెట్టిస్తోంది. నిబంధనల ప్రకారం ట్రాక్టర్‌ తీసుకోవాలంటే లబ్ధిదారుడికి కనీసం 5-8 ఎకరాల భూమి ఉండాలి. జాబితాలో ఉన్న వారిలో 50 మందికి భూమే లేదు. అయినా పేర్లను ప్రతిపాదించారు. ఇక సంఘాలుగా ఏర్పడితే వరి కోత యంత్రం దక్కుతుందనే భావనతో 18 యూనిట్లలో నాలుగైదు ప్రమాణాలు లేకుండానే కాగితాలు సృష్టించి రాయితీ దక్కించుకొనేందుకు సిద్ధపడుతున్నారు. ఇక ఎస్సీ, ఎస్టీలకు వందశాతం రాయితీతో అంటే పూర్తిగా ఉచితంగా అందించే ట్రాక్టర్‌, కోత మిషన్ల కోసం వారి పేర్లతో బినామీలు రంగప్రవేశం చేశారు. శాసనసభ్యులకు వందల సంఖ్యలో వినతులు రాగా, అందులో సగానికి సగం కుదిస్తూ ప్రాధాన్యతలను పరిగణనలోకి తీసుకొని ఎంపిక చేశారు. రెండు, మూడు రోజుల నుంచే ఎవరెవరిని లబ్ధి చేకూరుతుందనేది ఖరారైంది. వరుసగా బ్యాంకుకు సెలవుదినాలు రావడం, ముగింపు లెక్కల్లో సిబ్బంది తలమునకలు కావడంతో బ్యాంకుల్లో డీడీలు తీయడం, రుణమంజూరు ఇబ్బందిగా మారుతోంది. దీంతో ఆర్థికస్థోమత లేనివారు నగదు సర్దుకోవడానికి, బ్యాంకులను ఒప్పించడానికి తిప్పలుపడుతున్నారు.

Related Posts