YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

108కి సుస్తీ

108కి సుస్తీ
అమరావతి : రాష్ట్రంలో 108ల పరిస్థితి దయనింగగా మారింది. వాహనాల్లో సరైన సౌకర్యాలు ఉండటం లేదు. అత్యవసర మందుల కొరత, సిబ్బంది సమస్య, ఉన్న వారికి జీతాల ఇబ్బందులు, ఆక్సిజన్‌ కొరత, అందుబాటులో ఉండని స్టెరైల్‌ దూది... చివరికి 108 చిహ్నంగా మోగే ‘సైరెన్‌’ కూడా మూగబోయింది. తీసేసిన ఆరోప్రాణంతో ఇప్పుడు 108 సేవలు మరణశయ్యపై ఉన్నాయి. ‘‘సంస్థ మారితే సేవలు అద్భుతంగా ఉంటాయి. 108 గతి, స్థితి మారిపోతుంది’’ అంటూ ప్రకటించిన ఆరోగ్యశాఖ ఇప్పుడు కనీస పర్యవేక్షణ బాధ్యతను కూడా గాలికి వదిలేసింది. 108 సేవలను పర్యవేక్షించాల్సిన నోడల్‌ అధికారి ఆఫీ్‌సకే పరిమితం. సర్వీస్‌ ప్రొవైడర్‌ ఏంచెబితే అదే నిజం. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది? అంబులెన్స్‌లో అత్యవసర మందులు ఉన్నాయా? ఆక్సిజన్‌ అందుబాటులో ఉంచుతున్నారా? నిబంధనల ప్రకారం వాహనాలు నడుస్తున్నాయా? అన్న విషయాన్ని పట్టించుకునేవారే ఆరోగ్యశాఖలో లేరు. డిసెంబరు నెల నుంచి ఇప్పటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 468 వాహనాలను పరిశీలిస్తే... ఒక్కొక్క 108లో 200 గ్రాముల దూది, 4 రోలర్‌ బ్యాండేజీలు, 5 డైకోఫినాక్‌ ఇంజెక్షన్లు, 5 సిరంజులు, 2 సెలైన్లు, 5 జతల గ్లౌజులు తప్ప అదనంగా ఒక్కటీ కనిపించదు. వాస్తవంగా ఒక్కో అంబులెన్సులో 108 రకాల మందులు అందుబాటులో ఉండాలి. కానీ నిర్వహణ సంస్థ మందుల సరఫరా పూర్తిగా నిలిపివేయడంతో ప్రాథమిక చికిత్స పూర్తిగా నిలిచిపోయింది. ఆక్సిజన్‌ లేని అంబులెన్స్‌కు అర్థమే లేదు. అంబులెన్స్‌లలో ఆక్సిజన్‌ను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వ నిబంధనలు కూడా ఉన్నాయి. సర్వీస్‌ ప్రొవైడర్లు, తినమరిగిన అధికారులు కలిసి దీనికి కూడా తూట్లు పొడిచేశారు. సుమారు 60, 70 వాహనాల్లో ఆక్సిజన్‌ అందుబాటు లేదని సమాచారం. అత్యవసర చికిత్స అందకపోవటంతో వాహనంలోనే మృత్యుఒడిలోకి జారుతున్న అభాగ్యులూ ఉంటున్నారు. ప్రాణాధార వాహనమైన 108.. ‘మహాప్రస్థానం’ వాహనాలుగా మారిపోతున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. బండెడు సమస్యల మధ్య తాము విధులు నిర్వహించలేమని 108 సిబ్బంది చేతులెత్తేస్తున్నారు. ఇప్పటికే నల్ల బ్యాడ్జీలతో నిరసనలు చేస్తున్న ఉద్యోగులు సమ్మె బాటవైపు సాగుతున్నారు. 108 పరిస్థితిని వివరిస్తూ ఉద్యోగులు అనేక సార్లు ఉన్నతాధికారులకు లేఖలు రాశారు. అన్నీ బుట్టదాఖలయ్యాయి. సమస్యలను పరిష్కరించటంతోపాటు 108 వ్యవస్థను కాపాడాలని కోరుతూ ఏప్రిల్‌ 5న విజయవాడలో 24గంటలు దీక్ష చేయాలని సిబ్బంది నిర్ణయించుకున్నారు.

Related Posts