YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

అంటు రోగాల డాక్టర్లే లేరు..

అంటు రోగాల డాక్టర్లే లేరు..

అంటు రోగాల డాక్టర్లే లేరు...
న్యూఢిల్లీ, ఏప్రిల్ 22
 భారత్‌లో ప్రాణాంతకమైన కరోనా వైరస్‌ వేగంగా వ్యాపిస్తూ భయాందోళనలు సృష్టిస్తోన్న నేపథ్యంలో మరో ఆందోళనకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, హర్యానా, చత్తీస్‌గఢ్, అస్సాం సహా దేశంలోని 11 రాష్ట్రాల్లో రాష్ట్రస్థాయి అంటురోగాల వైద్య నిపుణులు (ఎపిడిమాలోజిస్ట్స్‌), దేశవ్యాప్తంగా 736 జిల్లాల్లో జిల్లా స్థాయి అంటు రోగాల వైద్య నిపుణులు లేరు. కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలకు రాసిన ఓ లేఖ ద్వారా ఈ విషయం వెల్లడయింది. కరోనా వైరస్‌ లాంటి మహమ్మారీలు దాడి చేసినప్పుడు ముందుగానే హెచ్చరించే వాడే అంటు రోగాల వైద్య నిపుణుడని ‘భారత ప్రజారోగ్య సంస్థ’ ప్రొఫెసర్‌ దీపక్‌ సక్సేనా చెప్పారు. దాడి చేయబోతున్న వైరస్‌ మహమ్మారి ఎంతటి ప్రమాదకరమైనదో, ఎక్కడ, ఎలా విస్తరిస్తుందో ? అంటురోగాల నిపుణులు ముందుగానే గ్రహించి సంబంధిత అధికారులను హెచ్చరించడంతోపాటు దానిని నిరోధించేందుకు అతి వేగంగా స్పందించి తగిన చర్యలు తీసుకుంటారని సక్సేనా వివరించారు. కరోనా వైరస్‌ను కట్టడి చేయడం కోసం ప్రస్తుతం ఎంత మంది అంటురోగాల నిపుణులు అవసరమో అంచనా వేసి, ఆమేరకు వారిని రప్పించుకోవాల్సిన అవసరం ఎంతైన ఉందని ‘భారత సమీకృత వ్యాధుల నిఘా కార్యక్రమం (ఐడీఎస్‌పీ)’ డైరెక్టర్‌ సుజీత్‌ కుమార్‌ సింగ్‌ తెలియజేస్తున్నారు. భారత్‌లో కరోనా వైరస్‌ బారిన పడి 124 మంది మరణించిన నేపథ్యంలో దేశంలో ఖాళీగా ఉన్న 736 అంటురోగాల నిపుణుల పోస్ట్‌లకు యుద్ధ ప్రాతిపదికన నియామకాలు జరపండని, ఈ విషయంలో ఇంతకుముందే ఓ లేఖను రాశాననే విషయం గుర్తుండే ఉంటుందని, తక్షణం స్పందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నానని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రీతి సుడాన్, ఏప్రిల్‌ ఏడవ తేదీతో రాష్ట్రాలకు ఓ లేఖ రాశారు. అంతకుముందు ఆమె రాష్ట్రాలకు రాసిన లేఖలో, అంటురోగాల నిపుణులను నియమించాలంటూ రాష్ట్ర ముఖ్యమంత్రులను ప్రధాని కోరారంటూ పేర్కొన్నారు. ఇప్పటి వరకు దేశంలో కరోనా వైరస్‌ నియంత్రణకు ప్రజాముఖంగా కేంద్ర ఆరోగ్య శాఖ, భారతీయ వైద్య పరిశోధనా మండలి చర్యలు తీసుకుంటూ వస్తోంది. ఐడీఎస్‌పీని నిర్వహించే ‘నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీస్‌ కంట్రోల్‌ (ఎన్‌సీడీసీ) పాత్ర ఎక్కడా కనిపించక పోవడం ఆశ్చర్యం వేస్తోంది. వాస్తవానికి ఎన్‌సీడీసీ ఆధ్వర్యంలోనే అంటురోగాల నిపుణులు వైరస్‌లపై నిఘా కొనసాగిస్తూ కేసులను వెతికి పట్టుకోవాల్సి ఉంటుందని సుజీత్‌ కుమార్‌ సింగ్‌ తెలిపారు. సార్స్‌ దాడితో ఈ సంస్థ బాధ్యతలు మరింత విస్తరించాయని, కోవిడ్‌–19 దాడితో వాటిని మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. మరి ప్రస్తుతం సంస్థ ఉనికి ఎందుకు ప్రశ్నార్థకంగా మారిందన్న ప్రశ్నకు ఆయన సమాధానం ఇవ్వకుండా మౌనం పాటిస్తున్నారు. దేశంలో నమోదైన అన్ని వైరస్‌ కేసులను వారానికోసారి ప్రకటించే బాధ్యత కూడా ఎన్‌సీడీసీదే. దేశంలో కోవిడ్‌ మొదటి కేసు జనవరి 30వ తేదీన బయటపడ్డాక ఫిబ్రవరి రెండవ తేదీన దేశంలో మొత్తం మూడు కేసులు నమోదయ్యాయంటూ సంస్థ వారంతపు డేటాను విడుదల చేసింది. అదే ఆఖరి నివేదిక. అప్పటి నుంచి నేటి వరకు వారం, వారం నివేదికలను విడుదల చేయడం లేదు. దేశంలో ఎక్కడ, ఎప్పుడు, ఎలా ? కరోనా వైరస్‌ విస్తరిస్తుందో అధ్యయనం చేయాలంటే హెచ్‌1ఎన్‌1, కోవిడ్‌–19పై ఐడీఎస్‌పీ విడుదల చేసే వారం, వారం నివేదికలు అవసరం. ఇదే విషయమై సింగ్‌ను మీడియా ప్రశ్నించగా ‘అవసరమైన సమాచారం పూర్తిగా సంస్థ వద్ద ఉంది. విడుదల చేయలేదంతే. ఇప్పుడందరూ బిజీ గదా?’ అని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలకుగాను 30 అంటురోగాల నిపుణుల పోస్ట్‌ల నియామకానికి అనుమతి మంజూరయింది. నాలుగు నెలల కోసం, నెలకు 50 వేల రూపాయల చొప్పున ఈ పోస్ట్‌లను అవుట్‌ సోర్సింగ్‌ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. అయితే ఎవరు ముందుకు రావడం లేదని తెల్సింది. ‘మెడిసిన్‌లో పోస్ట్‌ గ్రాడ్యువేషన్‌ చేసిన వారెవరైనా 50 వేల రూపాయలకు వస్తారా? అదీ నాలుగు నెలల కోసం? కరోనా వైరస్‌ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్న పదవిలోకి! ఎవరు రారు’ అని రోగాలపై నిఘా, వాటి ఆవిర్భావంపై ఎలా దర్యాప్తు జరపాలో రాష్ట్ర సిబ్బందికి కేంద్ర ప్రభుత్వంతో కలిసి శిక్షణ ఇచ్చిన డాక్టర్‌ శ్రీకాంత్‌ కళాస్కర్‌ వ్యాఖ్యానించారు. ఇతర రాష్ట్రాలు ఇంతకన్నా తక్కువగా ఆఫర్‌ చేసినట్లు తెల్సింది.

Related Posts