YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు వాణిజ్యం తెలంగాణ

రంగారెడ్డిలో జోరుగా మద్యం దందా

రంగారెడ్డిలో జోరుగా మద్యం దందా
రంగారెడ్డిలో జోరుగా మద్యం దందా
హైద్రాబాద్, ఏప్రిల్ 23
ఓ వైపు లాక్‌డౌన్‌ కొనసాగుతున్నా శంషాబాద్‌లో మద్యం విక్రయాలు ఆగడం లేదు.   ఫోన్‌ల ద్వారా మద్యాన్ని కోరుకున్న వారికి చేరవేస్తున్నారు. కొందరు వ్యక్తులను మధ్యవర్తులుగా చేసుకుని అమ్మకాలు సాగిస్తున్నారు. మధ్యవర్తులు కూడా పట్టణంలోని కొన్ని దుకాణాల వద్ద అడ్డాగా చేసుకుని పనికానిచ్చేస్తున్నారు. ఈ తరహాలో అమ్మకాలు సాగిస్తున్న రాళ్లగూడ దొడ్డికి చెందిన మహేష్‌ అనే వ్యక్తిని నాలుగురోజుల కిందట ఎక్సైజ్‌ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్ట్‌ చేశారు. మద్యంప్రియుల బలహీనతలను కొందరు వ్యాపారులు, నేతలు భారీగానే సొమ్ము చేసుకుంటున్నారు. సాధారణ సమయాల్లో రూ.800 ఉన్న ఫుల్‌బాటిల్‌ ధర రూ.4వేలకు పెంచి విక్రయిస్తున్నారు. రెండు నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టడానికి కొందరు నేతలు భారీగానే మద్యం సేకరించారు. అయితే, ఆ నిల్వలు కొందరు నేతల వద్ద ఇంకా ఉన్నట్లు సమాచారం. సదరు నేతలు ప్రస్తుత పరిస్థితుల్లో తమకు తెలిసిన వారికి విక్రయిస్తున్నట్లు తెలిసింది. మద్యం ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున దిగుమతి అవుతున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కల్తీ కల్లు విక్రయాలు ఇదే తరహాలో జరుగుతున్నాయి. బుధవారం రాజేంద్రనగర్‌ సర్కిల్‌ పరిధిలోని గగన్‌పహాడ్‌లో పెద్ద ఎత్తు కల్తీ కల్లును ఎస్‌ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకుని ఆర్‌జీఐఏ పోలీసులకు అప్పగించారు. శంషాబాద్‌ పట్టణంలో అక్రమ మద్యం విక్రయాలపై ఎక్సైజ్‌ అధికారులు పూర్తి స్థాయిలో నిఘా పెట్టి నియంత్రించాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.శంషాబాద్‌ పట్టణంలో గుట్కాల దందా కూడా సాగుతోంది. ఆయా పాన్‌ డబ్బాల విక్రేతలు ద్విచక్రవాహనాలపై ఉదయం 6గంటల నుంచి 10గంటల వరకు ఫోన్‌ల ద్వారా ఆర్డర్‌ తీసుకుని గుట్కాలు విక్రయిస్తున్నారు. మరికొందరు తమ డబ్బాలకు సమీపంలోనే అడ్డాలు ఏర్పాటు చేసుకుని పెద్ద ఎత్తున గుట్కాలను విక్రయిస్తున్నారు.  ఉదయం తొండుపల్లి వద్ద సుమారు 15వేల విలువైన గుట్కా, పాన్‌ మసాలాను ఎస్‌ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
 

Related Posts