విజయనగరం : పంచాయతీ ఎన్నికల సమరానికి తొలి అడుగు పడింది. ఎన్నికల కమిషను ఆదేశాల నేపథ్యంలో ఓటర్ల జాబితాల రూపకల్పనకు పంచాయతీశాఖ ఉపక్రమించింది. పంచాయతీ అధికారులు ఈ విషయమై క్షేత్రస్థాయిలో స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. ఓటర్ల జాబితాల తయారీపై వారికి సూచనలు చేశారు.
క్షేత్రస్థాయిలో కసరత్తు: ఓటర్ల జాబితాలపై క్షేత్రస్థాయిలో కసరత్తుకు సన్నద్ధమయ్యారు. ఈ నెల 11 నుంచి జాబితాలను రూపొందించేందుకు చర్యలు తీసుకున్నారు. 20వ తేదీ నాటికి జాబితాలను సిద్ధం చేసేవిధంగా క్షేత్రస్థాయి అధికారులకు గడువును నిర్ధేశించారు. అనంతరం మే 15న తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. అసెంబ్లీ ఓటర్ల జాబితా ఆధారంగా పంచాయతీ ఓటర్లను గుర్తిస్తారు. పంచాయతీ, వార్డులు వారీగా ఓటరు జాబితాలను తయారుచేస్తారు. నియోజకవర్గంలో మండల తహసీల్దార్లు నుంచి అసెంబ్లీ ఓటర్ల జాబితాలను పొందేవిధంగా ఈవోపీఆర్డీలకు ఆదేశించారు. జిల్లాలో 920 పంచాయతీలున్నాయి. వీటి పరిధిలో ఎనిమిదివేల పైగా వార్డులున్నాయి. వీటి సంఖ్యమేరకు ఓటర్ల జాబితాలు రూపుదిద్దుకోనున్నాయి.ఎన్నికల కమిషను డేటాబేస్ ఆధారంగా ఎక్స్‌ఎల్ షీట్‌లో (ఏబీ సాఫ్ట్‌వేర్)ఓటర్ల వివరాలను నమోదుచేసి చెక్‌లిస్ట్‌లు తయారుచేస్తారు. ముందుగా మాన్యువల్ విధానంలో చేసిన తర్వాత ఆన్‌లైన్ చేయడం జరుగుతుంది. సాఫ్ట్‌వేర్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఎ, బి రెండు నమూనాల్లో ఉన్న సాఫ్ట్‌వేర్‌లో నమూనా ‘ఎ’ లో ఓటరు కులం, ‘బి’ నమూనాలో సీరియల్ నెంబర్లను నమోదుచేస్తారు. గతంలో ముఖపత్రం ఆధారంగా నమోదు చేయాలని అధికారులు ఇప్పటికే సూచించారు