తబ్లిగీ చీఫ్ సాద్ ఫామ్ హౌస్ లో పోలీసు సోదాలు
న్యూ ఢిల్లీ ఏప్రిల్ 23
పోలీసు కేసులకు కానీ పోలీసుల అభ్యర్ధనలకు కానీ ఏ మాత్రం స్పందించని తబ్లిగీ జమాత్ చీఫ్ మౌలానా సాద్ ఫామ్ హౌస్ పై నేడు పోలీసు బృందాలు దాడి చేశాయి. అతడిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు.లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా డిల్లీలోని మర్కజ్ మసీదులో తబ్లిగీ జమాత్ సదస్సును ఏర్పాటు చేయడంపై పోలీసులు కేసు నమోదు చేశారు. మౌలానా సాద్ తో బాటు మరో ఆరుగురు తబ్లిగీ బాధ్యులపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి అతనికి నోటీసులు పంపినా స్పందించలేదు.కరోనా వైరస్ విస్తరించి మరణిస్తారనే వాదనతో ఏకీభవించని సాద్ లాక్ డౌన్ నిబంధనలకు వ్యతిరేకంగా ఆడియో టేప్ లు విడుదల చేసిన విషయం కూడా తెలిసిందే. అల్లా అనుమతి లేకుండా ఏదీ జరగదని, మనం అనుకుంటే చనిపోము, వద్దంటే మరణం ఆగదు. అందువల్ల కరోనా నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదని సాద్ ఆడియో సందేశం ఇచ్చాడు.అతను ఎంతకు స్పందించకపోవడంతో పోలీసులు అరెస్టు వారంటు కూడా జారీ చేశారు. అతడు లొంగక పోవడంతో ఢిల్లీ శివారులోని అతడు తలదాచుకుంటున్న ఇంటి నుంచి అరెస్టు చేశారు. అయితే ఆ తర్వాత అతడు కరోనా టెస్టులు చేయించుకోవడానికి నిరాకరించాడు. కరోనా టెస్టు చేయించుకుంటే తప్ప విచారించలేమని పోలీసులు చెప్పినా అతడు పెడచెవిన పెట్టాడు. నేడు ఉత్తర్ ప్రదేశ్ లోని అతడి సొంత గ్రామమైన షామ్లీ లోని అతడి ఫాం హౌస్ పై పోలీసు బృందాలు దాడి చేశాయి. అవసరమైన రికార్డుల కోసం వారు అన్వేషిస్తున్నారు.