విదేశీ విద్య వద్దు..ఇండియా జాబే ముద్దు !
హైదరాబాద్ ఏప్రిల్ 23
కరోనా మహమ్మారి అందరి ఆలోచనలు తలక్రిందులు చేసింది. రోజు రోజుకి విజృంభిస్తున్న కరోనా వైరస్ ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. దీనితో చాలామంది ఇప్పటికే తమ వద్ద ఉన్న ఆప్షన్ తో ఈ ఏడాదిని గడిపేయాలి అని నిర్ణయించుకున్నారు.ముఖ్యంగా ఈ కరోనా మహమ్మారి బీటెక్ పూర్తి చేసి ఇ విదేశీ విద్య లక్ష్యంగా పెట్టుకున్న విద్యార్థుల ప్రణాళికలను పూర్తిగా మార్చేసింది. ఈ నేపథ్యంలో ప్రాంగణ నియామకాల్లో ఎంపికైనవారు ఈ ఏడాది విదేశీ విద్యకు దూరంగా ఉండి స్వదేశంలోనే ఉద్యోగాలు చేయాలనే నిర్ణయానికి వచ్చారు. కరోనా ప్రభావంతో అమెరికాతో పాటు దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాలు వణికి పోతున్నాయి. ఇప్పటికే అన్ని అంతర్జాతీయ విమానాలు రద్దయ్యాయి. ఒకవేళ ప్రారంభమైన అనవసరంగా కష్టాలను ఎందుకు కొని తెచ్చుకోవడం అనే అభి ప్రాయంతో చాలా మంది విద్యార్థులు ఈ ఏడాది విదేశీ విద్యకు దూరంగా ఉండాలనే నిర్ణయానికి వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా పదివేల మందికిపైగా ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్రాంగణ నియామకాల్లో వివిధ కంపెనీల్లో ఎంపికయ్యారు అమెరికా లండన్ ఆస్ట్రేలియా లాంటి దేశాలకు వెళ్లి ఎంఎస్ చదవాలనుకునే వారు కూడా ప్రాంగణ నియామకాల్లో పాల్గొని ఆఫర్ లెటర్లు అందుకున్నారు.అయితే ఊహించని విధంగా కరోనా వైరస్ విరుచుకుపడటంతో ఏడాదిపాటు విదేశీ విద్యకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. సాధారణంగా ప్రతి ఏడాది ఒక అమెరికాకి తెలంగాణ నుంచి కనీసం 15000 మంది వెళ్తుంటారు. మరోవైపు ప్రాంగణ నియామకాల్లో ఎంపికైన అపాయింట్మెంట్ లెటర్ ఇస్తారా? ఇవ్వరా? అన్నదానిపై విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే ఇప్పటివరకు ఏ ఒక్క కంపెనీ కూడా తాము ఇచ్చిన ఆఫర్ని రద్దు చేస్తున్నామని ప్రకటించలేదు. అలాగే ఇప్పటికే కొన్ని కంపెనీలు తాము ఇచ్చిన ఆఫర్లను రద్దు చేయము అని ప్రకటించాయి. కాకపోతే ఈ ప్రక్రియ కొంతమేర ఆలస్యం అవ్వచ్చు అని అంచనా వేస్తున్నారు.