YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

*పుస్తక పఠనం*

*పుస్తక పఠనం*
*పుస్తక పఠనం*
పుస్తకాన్ని ఆప్తమిత్రుడిగా చేసుకున్నవారు ఆనందమయ జీవితం గడపగలుగుతారు. చిన్న పిల్లలకు పుస్తకం చదవడం అలవాటు చేయాలి. చదువుతూ ఎదిగినవాడు జీవితాన్ని చక్కదిద్దుకోగలుగుతాడు. చిన్నతనంలో చదివే బాల సాహిత్యం మెదడును మేల్కొలుపుతుంది. వేమన శతకం, సుమతీ శతకం జీవితాన్ని తీర్చిదిద్దే నిత్యసత్యాలు. సులువుగా పలకగలిగిన చిన్న పద్యాలు బాలల మనోవికాసానికి దోహదపడతాయి. వారి నడతను నిర్దేశిస్తాయి. పుస్తకమే గురువు. పుస్తక పఠనం ఎన్నో పాఠాలు నేర్పుతుంది. రామాయణం ఆదికావ్యం. శ్రద్ధగా రామాయణం చదివినవారు శ్రీరాముడిలా బతకాలనుకుంటారు. తప్పు చేయబోతే రాముడు గుర్తుకు వస్తాడు. మన నిత్యజీవితంలో ఎలా నడుచుకోవాలో రామాయణం బోధిస్తుంది. మానవ సంబంధాల అవసరం అర్థమవుతుంది. శ్రీరాముడు రామాయణంలో భగవంతుడిగా ప్రవర్తించలేదు. ఒక మనిషి ఎలా బతకాలో సోదాహరణంగా చూపించాడు. జీవితంలో కష్టం వచ్చినప్పుడు శ్రీరాముణ్ని తలచుకుంటే- ఆయన పడిన కష్టాల ముందు మనదెంత అన్న భావన కలిగి, వాటిని తట్టుకునే శక్తి వస్తుంది. ఎన్ని కష్టాలు పడినా సత్యం, ధర్మం విడిచిపెట్టవద్దని రామాయణం చెబుతుంది. గుణవంతుడు, శక్తిమంతుడు, ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, దృఢవ్రతుడు మొదలైన శ్రీరాముడి లక్షణాలు వర్ణిస్తూ మనిషి ఎంతటి గుణవంతుడై మెలగాలో చెబుతుంది రామాయణం. మహాభారతం ధర్మాన్ని ప్రబోధిస్తుంది. శ్రీమహాభారతం పంచమ వేదమని ప్రసిద్ధి. ధర్మం, అర్థ, కామ, మోక్షాలనే చతుర్విధ పురుషార్థాలతో పాటు అనేక శాస్త్ర విషయాలను అది బోధించింది. భారతంలో లేనిది మరింకెక్కడా లేదంటారు.  అంతులేని విజ్ఞాన సంపద భారతం. అన్ని వయసులవారికీ అవసరమైన నీతిని బోధించే భారతం నిజమైన స్నేహితుడిలా సలహాలిస్తుంది. జీవిత పరమార్థాన్ని భగవద్గీత బోధిస్తుంది. భగవద్గీతను మించిన వ్యక్తిత్వ వికాస పుస్తకం ఇంతవరకు రాలేదనడం అతిశయోక్తి కాదు. అది సాక్షాత్తు భగవానుడు అర్జునుడికి చేసిన జ్ఞానబోధ. ప్రతి మనిషీ ఆచరించాల్సిన జీవన గీత. గీతను అర్థం చేసుకున్నవారు ఆటుపోట్లను తట్టుకోగలుగుతారు. సుఖాలకు పొంగిపోరు. దుఃఖాలకు కుంగిపోరు. కష్టాలను ఎదుర్కొనే శక్తినిస్తుంది గీత.
భాగవతం భక్తిచింతనను నేర్పుతుంది. శ్రీమహావిష్ణువు దివ్యరూపాన్ని వివరిస్తుంది. అవతార పురుషుడి లీలలను కళ్లకు కడుతుంది. పోతన భాగవతంలోని పద్యాలు మధురమైనవి. మనసుకు హత్తుకునేవి. మనసుకు ప్రశాంతతనిచ్చేవి. భాగవతం భగవదారాధన వైపు మనసును మళ్ళిస్తుంది. శ్రీకృష్ణ లీలలు చదివి ఆనందించనివారెవ్వరూ ఉండరు... మనసు పరమానందంతో మురుస్తుంది. పురాణాలు చదివితే ఆధ్యాత్మిక భావ చింతన అలవడుతుంది. సంకుచిత భావాలు తొలగిపోతాయి. రూపాలు వేరైనా భగవంతుడొక్కడే అన్న సత్యం అర్థమవుతుంది. జీవితాన్ని తీర్చిదిద్దుకొనే మార్గం గోచరిస్తుంది. మనసు నిర్మలమవుతుంది. మహాత్ముల జీవిత చరిత్రలు మనిషి మనిషిగా జీవించడానికి మార్గం చూపుతాయి. స్వార్థం విడనాడి సంఘ శ్రేయానికి తోడ్పడమని ఉపదేశిస్తాయి. ఆధునిక సాహిత్యం మంచి చెడులను ఎంచి చూపుతుంది. మంచిబాటను ఎంచుకోవాలని హితవు పలుకుతుంది. అన్ని వయసులవారి మెదడుకు పదునుపెట్టే సాధనం పుస్తక పఠనం. పుస్తక పఠనం అలవాటైతే అనవసర ఆలోచనలు మనసును పట్టి పీడించవు. విపరీత ధోరణికి అడ్డుకట్ట పడుతుంది. ఆరోగ్యవంతమైన జీవనానికి దివ్యౌషధం- పుస్తక పఠనం!\
వరకాల మురళి మోహన్ సౌజన్యంతో

Related Posts