YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

విద్యలు

విద్యలు

విద్యలు
విద్య నాలుగు విధములు :
1. సాంకేతికము :
మానవుని జీవితావసరములను తీర్చుచు, తద్ద్వారా సమాజాభివృద్ధికి అవసరమైన వృత్తులకు సంబంధించిన విద్య.
2. శారీరకము :
శరీర ఆరోగ్యమునకు అవసరమైన వ్యాయామము, ఆహార నియమము, యోగాభ్యాసములకు సంబంధించిన విద్య.
3. నైతికము :
సమాజము భౌతికముగా ఎంత పురోగమించినను, సంఘములోని వ్యక్తులు శీలవంతులై యుండుట, పురాణేతిహాసములలోని మహానుభావుల జీవితములను ఆదర్శముగా చూపుచు బోధించు విద్య.
4. ఆధ్యాత్మిక విద్య :
అధి అనగా అత్యధికమైన సత్యము. ఆత్మ అనగా నేనుగా ప్రాకటమైనది. విద్య అనగా తెలుసుకొనవలసినది. ఈ మూడు అర్థములు కలిసినది తనను తాను సత్యస్వరూపమనే బ్రహ్మగా తెలుసు కొనుటకు అవసరమైన బోధ. దివ్యత్వమును గుర్తింపజేసి, పూర్ణానుభవమును అందించునది. అన్ని విద్యలలోకెల్లా గొప్పది. అన్ని విద్యలకు పునాది వంటిది. వివేకము, అర్పణ, కర్తవ్యములను మేళవించి, శిక్షణతో కూడిన విద్య ఆధ్యాత్మిక విద్య.
విద్య కొఱకు త్రివిధ విచారణ :
1. పరబ్రహ్మ స్వరూప నిశ్చయము. 2. మాయా స్వరూప నిశ్చయము 3. ధర్మస్వరూప నిశ్చయము.
అన్వీక్షకీ విద్య :
తర్క వేదాంతమునకు సంబంధించిన విద్య.
విద్యకు శత్రువులు :
పెద్దల సేవ చేయకుండుట, తొందరపాటు, రజో గుణము, ఆత్మ స్తుతి, పరనింద - ఇవన్నీ విద్యార్జనకు ప్రతిబంధకములు, శత్రువులు.
వార్త : అర్థ, అనర్థములను బోధించు విద్యను వార్త అందురు. వార్త అనగా శ్రమ, వ్యవసాయము, ఉపాయములను అవలంబించి, సత్ఫలితమును సాధించుటను తెలియజేయు విద్య.
భగవద్గీతలోని విద్యలు :
1. అభయ విద్య 2. సామ్య విద్య 3. బ్రహ్మ విద్య 4. భగవత్‌ విద్య.
విద్య (జ్ఞానము) : జీవుడే ఈశ్వరుడు, జీవుడే పరమాత్మ అనెడి అఖండ, అభిన్న, అద్వితీయ తత్త్వమును బోధించు శబ్దములు, వాక్యములు, వాక్యార్థములు.
వైశ్వానర విద్య : ఛాయా పురుష లక్షణము గురించిన విద్య.
వారుణీ విద్య : వరుణుడు భృగువునకు బోధించిన విద్య
భార్గవీ విద్య : భృగువు వరుణుడి ద్వారా సంపాదించిన విద్య
హార్ద విద్య : ఆత్మ గురించి హృదయ సమీపమునకు చేర్చబడిన విద్య
బ్రహ్మ విద్య : 1. బ్రహ్మ పరమాత్మ నుండి సంపాదించిన విద్య 2. బ్రహ్మ నుండి అధ్వరుడికి, అతడి నుండి సర్వులకు చేరిన విద్య 3. బ్రహ్మము గురించిన విద్య 4. శ్రేష్ఠమైనది, గొప్ప దానికంటే గొప్పదైన విద్య - అని నాలుగు అర్థములు. ముక్తి విద్య : పై నాలుగు అర్థములతో ఉన్న బ్రహ్మ విద్య పరంపరగా వచ్చి జీవులకు బంధ విముక్తి కలిగించే విద్య. నయ విద్య : శాస్త్రము ధర్మము చెప్పువారు 'ఇది ఇంతే' అని ప్రమాణమువలె చెప్పరాదు. ఎంత తెలిసినవాడైనా 'ఇప్పటికి నాకు తెలిసినది ఇంత మాత్రమే' అని చెప్పవలెను. కొన్ని విషయములను ప్రమాణము అని చెప్పినచో అపార్థము, అపకారము జరుగవచ్చును. వినయము, విశిష్ఠత, నేర్పుతో చెప్పగలవానిని నయవిద్య తెలిసినవాడని అందురు. త్రయీ విద్య : వాయుమధనములో ఊర్థ్వ గతిని ప్రాణగతి అనియు, అధోగతిని అపానగతి అనియు, సమానత్వమును మధ్యగతి అనియు మూడు గతులుగా విభజించి వాయుమధనమును చేయు నేర్పును త్రయీ విద్య అందురు.  ఈ వాయు మధనమునుండి ఉద్భవించు దానిని అశనము అందురు. అశనమనగా అన్నము. ఈ సాధనతో అశనమును గ్రహించిన ప్రాణుడు బలపడుచున్నాడు. ఇది యోగము.  త్రయీవిద్య అనగా ధర్మ, అర్థ, కామములనెడి మూడింటిని తెలుసుకొని అర్థ కామములను ధర్మయుతముగా పొందే వివేకము. పంచాగ్ని విద్య : ఆకాశము, మేఘము, భూమి, పురుషుడు, స్త్రీ అనేవి పంచాగ్నులు. వీటియందు శ్రద్ధా, సోమ, వృష్టి, అన్నము, రేతస్సు అనే పంచ ద్రవ్యములను, లేక పంచ ఆహుతులను హోమము చేయగా రేతో రూప ఆహుతియందు ఉదకములు పురుష రూపము చెందుచున్నవి. జీవుడు శరీర బీజములైన సూక్ష్మ బీజములతో చేరి క్రమముగా ఆకాశమున శ్రద్ధా రూపములో చేరి, వర్ష రూపములో భూమిపైబడి, అన్న రూపములో పురుషునిలోనికి చేరి, రేతస్సు రూపములో స్త్రీ గర్భమందు ప్రవేశించి, అక్కడనుండి పురుషుడుగా వ్యక్తమగుచున్నాడు. శ్రద్ధ అనగా జీవుడు జీవరూపముగా ఉండుటలో గల ధర్మము. దహర విద్య : బ్రహ్మ రంధ్రమందు చిన్న కమలము, ఆ కమల మధ్యమున సూక్ష్మమైన శూన్య స్థానము, ఆ శూన్యమే దహరాకాశమనబడును. దీనిని తెలుసుకొన్నవాడు బ్రహ్మను తెలుసుకొనును. ఈ తెలుసుకొనే విద్యను దహర విద్య, లేక ప్రాణ విద్య అందురు. సంవర్గ విద్య - వాయు సంవర్గ విద్య : వాయువు అనగా హిరణ్య గర్భుడు. ఇతడిలోనే ప్రపంచమంతయు పుట్టి, స్థితిని కలిగి, లయించుచున్నది. సంవర్గమనగా ప్రవిలయము. అనగా అతడిలో చేరి యుండుట అని అర్థము. సకల దేవతలు, జీవులు, జడ ప్రకృతి అంతా ప్రలయకాలములో ఈ వాయువును చేరి అవ్యక్తమగుచున్నవి. ఇట్టి వాయు సంవర్గమును ఉపాసన చేయుచు, తానుకూడా లేనివాడుగా అవ్యక్తమగుటను వాయు సంవర్గ విద్య అందురు. వాయువులో చేరి యుండుట వలన వాయువే సంవర్గుడు. కేవలము సంవర్గ విద్య అన్నను అదే. మధు విద్య : సర్వ దేవతలలో ఉండే దైవత్వమును మధువు అందురు. త్రిగుణాత్మకమైన నామరూప క్రియా నటనలను వదలి, అందలి సారమైనట్టి ఆత్మ చైతన్యమును గ్రహింపజేయునది మధువిద్య. ఆ సారమే దైవత్వము, లేక మధువు లేక అమృతము. మధు విద్యోపాసకులకు బ్రహ్మానందము సిద్ధించును. అపరవిద్య: గడ్డిపరక మొదలు సృష్టి కర్త వరకు గల ప్రకృతి గుణములను, ధర్మములను వివేకముతో సరిగా గ్రహించి, కార్యసిద్ధి బడయుట, ధర్మాధర్మములను తెలుసుకొనుట - ఈ రెండింటికి సంబంధించిన విద్యను అపరవిద్య అందురు. పరవిద్య : ఉపాసన, తపస్సు, ఇంద్రియ మనో నిగ్రహము, యోగాభ్యాసము, మొదలగు సాధనలకు సంబంధించి మోక్ష లక్ష్యముగా తెలుపు విద్యను పరవిద్య అందురు. బ్రహ్మ విద్యలు 32 : శ్రీ రామానుజాచార్యుల వారు తెలిపిన బ్రహ్మ విద్యలు 32 రకములు. 1. సద్విద్య 2. శాండిల్య విద్య 3. అంతరాదిత్య విద్య 4. ఆనంద విద్య 5. ప్రాణి విద్య 6. ఇంద్ర ప్రాణ విద్య 7. భూమ విద్య 8. నచికేత విద్య 9. గాయత్రీ జ్యోతిర్విద్య 10. ఆకాశ విద్య 11. అంతర్యామి విద్య 12. దహర విద్య 13. ఉపకోసల విద్య 14. వైశ్వానర విద్య 15. అక్షర విద్య 16. అంగుష్ఠ ప్రమితి విద్య 17. అజా శారీరక విద్య 18. చాలకీ విద్య 19. మైత్రేయీ విద్య 20. మధువిద్య 21. ప్రణవోపాస్య పరమ పురుష విద్య 22.ఆదిత్య స్థామర్మామక విద్య 23. అక్షస్థ ఆహావన్నామ విద్య 24. ఉషక్తి కహోల విద్య 25. గార్లక్ష విద్య 26. వ్యాహృతి శారీరక విద్య 27. పంచాగ్ని విద్య 28. పురుష విద్య 29. సంవర్గ విద్య 30. దేహోపాస్య జ్యోతిర్విద్య 31. ఈశావాస్య విద్య 32. బ్రహ్మ విద్య.
దండనీతి అనే విద్య : మంచి - చెడు, న్యాయము-అన్యాయము, ధర్మము- అధర్మము వీటి గురించియు, మంచి మొదలగు వారికి రక్షణయు, పురస్కారములను మరియు చెడు మొదలగు వాటిని నివారించుటకును, శిక్షించుటకును అవసరమైన నీతిని బోధించే విద్యను దండనీతి అనే విద్య అందురు.
ప్రతిస్మృతి విద్య : ఈ విద్య వలన అధిక తపోవీర్య సంపన్నుడగును. తక్కువ కాలములోనే ఎక్కువ ఫలితమును సాధించును. పంచాగ్నులు
1. ఆకాశాగ్ని సోమ రూపము
2. పర్జన్యాగ్ని వృష్టి రూపము
3. పృథివ్యగ్ని వ్రీహ్య రూపము
4. పురుషాగ్ని రేతో రూపము
5. యోషిదగ్ని పురుష రూపము
 జీవుడు తన శరీర పతనము తరువాత సోమ రూపుడై, వృష్టి రూపుడై, వ్రీహ్య (ధాన్య) రూపుడై, రేతో రూపుడై స్త్రీ యోనిలో చేరి, స్త్రీ గర్భమందు పురుషుడుగా మారుచున్నాడు. పంచాగ్నులలో క్రమముగా పరివర్తన చెందుచు పురుషుడగుచున్నాడు.
యోగులలో భ్రూమధ్యమందు జ్ఞానాగ్నిగా, పాదకములందు కాలాగ్నిగా, నాభిస్థానమందు క్షుదాగ్నిగా, హృదయమందు శీతాగ్నిగా, నేత్రములందు కోపాగ్నిగా ఉండును. ఈ పంచాగ్నులను జ్వలింప జేసుకొనుచూ పరివర్తన చెందుటకు సాధన చేసే యోగి మక్తుడగును.
త్రేతాగ్నులు :
1. గార్హ పత్యాగ్ని లేదా జఠరాగ్ని : గృహమనగా శరీరము. శరీరానికి పతిగార్హపతి అనగా జీవుడు. జఠరాగ్ని వలన కలిగే ఆకలి బాధ తీర్చుకొను చున్నప్పుడే శరీరము బలముగా, ఆరోగ్యముగా నుండును. జీవుడు తన శరీర పోషణార్థము మాత్రమే ఈ గార్హపత్యాగ్ని ఉన్నదని, తాను మాత్రము సాక్షిగా నుండవలెను.
2. ఆహవనీయాగ్ని : ఆహవనము అనగా అన్ని వైపులా ఉండే వాటిని తనవైపుకు తెచ్చుకొనుట, మరియు వాటిని తన లోపలకు తీసుకొనుట. విషయములను అన్ని వైపులనుండి తెచ్చుకొనుచు, తన మనస్సులోనికి చేర్చుకొనుట. మనస్సే ఆహవనీయాగ్ని. ఈ మనస్సు యొక్క స్వభావమును తెలుసుకొని, తాను మాత్రము సాక్షిగా నుండవలెను.
3. దక్షిణాగ్ని : హృదయములో ఉండే తేజస్సు, దానివలన కలిగే జ్ఞానమును దక్షిణాగ్ని అందురు. దక్షిణాగ్నియే జ్ఞానాగ్ని. హృదయములో కలిగే జ్ఞానానికి కూడా అతీతమైన పరబ్రహ్మగా సిద్ధిని పొందవలెను.
శ్లో||  విద్యాంచా- విద్యాంచ యస్త ద్వేదో-భయం సహ |
      అవిద్యయా మృత్యుం తీర్థ్వా విద్యయా-మృతమస్నుతే ||
తా|| విద్యను, అవిద్యను రెంటిని తెలుసుకొనవలెను. అవిద్యను తెలిసి విడచుట చేత మృత్యువును అధిగమించును. విద్యను తెలియుటచేత అమృతత్వమును సిద్ధింపజేసుకొనును.

వరకాల మురళి మోహన్ సౌజన్యంతో
 

Related Posts