ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర చిత్తూరు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. ఆదివారం శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని చెర్లోపల్లి వద్ద ప్రజాసంకల్పయాత్ర 900 కిలోమీటర్ల మైలు రాయిని దాటింది. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం చెర్లోపల్లి గ్రామంలో వైఎస్ జగన్ రావి మొక్కను నాటారు. వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన పాదయాత్ర కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.
శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వేల సంఖ్యలో యువకులు, మహిళలు జగన్‌కు మద్దతుగా ఆయనతో కలసి అడుగులో అడుగేస్తున్నారు. ఊరూరా సందడి వాతావరణం నెలకొంది. కొండలు.. కోనలు.. అడవులు.. కరువు నేలల మీదుగా పాదయాత్ర సాగిస్తున్న జగన్‌కు అడుగడుగునా ప్రజలు తమ సమస్యలు ఏకరువు పెడుతున్నారు. చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో ఎవరికీ న్యాయం జరగలేదని గోడు వెళ్లబోసుకుంటున్నారు. తమ కష్టాలు వినే నాయకుడొచ్చాడని ఘన స్వాగతం పలుకుతున్నారు.
ప్రజలు వైఎస్ జగన్‌ను చూడాలని, ఆయనకు తమ సమస్యలు చెప్పుకోవాలని గంటల తరబడి వేచి చూస్తున్నారు. యువకుల కేరింతలు.. అవ్వాతాతల ఆశీర్వచనాలు.. అక్కాచెల్లెళ్ల ఆత్మీయత నడుమ జిల్లాలో ప్రజా సంకల్పయాత్ర దిగ్విజయంగా సాగుతోంది. దగా పడిన ప్రజలు, ఉపాధి లేక వీధిన పడ్డ యువకులు, పింఛను అందని దివ్యాంగులు, ఫీజు రీయింబర్స్‌మెంట్ అందని విద్యార్థులు జననేతకు అర్జీలు సమర్పిస్తున్నారు