గూగుల్ సెర్చ్ లో అల్కాహాల్ తయారీ
హైద్రాబాద్, ఏప్రిల్ 25
కరోనా కట్టడి కోసం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో నిత్యవసర వస్తువులు, అత్యవసర సేవలు తప్ప మిగతా అన్నీ బంద్ అయిపోయాయి. మార్చి 22 నుంచి అకస్మాత్తుగా అన్ని ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. ప్రజా రవాణా లేకపోవడంతో సొంతూళ్లకు పోలేకపోతున్నామని కొంత మంది బాధపడుతున్నారు. వలస కార్మికులు కష్టం ఇక ఎవరూ చెప్పలేనిది. నిలువ నీడ, తినడానికి తిండి కూడా సరిగా లేని పరిస్థితి. అందరి కష్టాలు ఇలా ఉంటే మద్యానికి అడిక్ట్ అయిపోయిన వాళ్లు ఆల్కహాల్ దొరక్క పిచ్చెక్కిపోతున్నారు. మన రాష్ట్రంలోనూ ఆల్కహాల్ కు బానిసైన వాళ్లు మానసిక, శారీరక అనారోగ్యంతో భారీ సంఖ్యలో ఎర్రగడ్డ హాస్పిటల్ కు క్యూ కట్టారు.లిక్కర్ షాపులు క్లోజ్ చేసి ఉండడంతో ఏదో ఒక రకంగా మందు చుక్కతో నోరు తడుపుకోవాలన్న తపనతో కొందరు బ్లాక్ లో దొరుకుతుందేమోనని ప్రయత్నాల్లో పడ్డారు. లాక్ డౌన్ అమలులో ఉన్నా.. ఒక్క తెలంగాణలోనే కాదు దేశమంతా అనేక ప్రాంతాల్లో బ్యాక్ డోర్ నుంచి లిక్కర్ షాపు యజమానులు అమ్మకాలు చేశారు. అయితే ముందు 170 రూపాయలు ఉన్న విస్కీ బాటిల్ ఇప్పుడు ఏకంగా రూ.700 నుంచి వెయ్యి దాకా పెంచేసి అమ్మారు. అలాగే కొన్ని చోట్ల లిక్కర్ షాపుల్లో చోరీలు కూడా జరిగాయి. వీటన్నింటిపై ప్రభుత్వాలు నిఘా పెంచాయి. దీంతో కొంత మంది ఇంట్లోనే మంద్యం తయారు చేసుకోవాలన్న ఆలోచనలో పడ్డారు. దీని కోసం గూగుల్ లో వెతకడం స్టార్ట్ చేశారు.దీంతో ఒక్కసారిగా “how to make alcohol at home” అన్న సెర్చ్ ట్రెండింగ్ లోకి వచ్చింది. లాక్ డౌన్ పెట్టిన తొలి వారంలోనే మార్చి 22 నుంచి 28 మధ్య ఈ సెర్చ్ పీక్ లోకి వెళ్లింది. మార్చి 22 నుంచి ఏప్రిల్ 20 మధ్య గూగుల్ ట్రెండ్స్ లో ఈ సెర్చ్ లో మణిపూర్ తొలి స్థానంలో ఉంది. ఆ తర్వాత జమ్ము కశ్మీర్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, అస్సాం ఉన్నాయి. ఆరో స్థానంలో ఏపీ, పదో స్థానంలో తెలంగాణ ఉన్నాయి.ఆల్కహాల్ తయారీ కోసం సెర్చ్ చేసినట్లుగానే బీర్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలన్న దాని కోసం కూడా దేశంలో లాక్ డౌన్ పెట్టిన తర్వాత జనాలు విపరీతంగా సెర్చ్ చేశారు. మార్చి 29న “how to make beer at home” అన్న సెర్చ్ పీక్ లోకి వెళ్లింది. దీని కోసం టాప్ -5 సెర్చ్ లో ఢిల్లీ, కేరళ, హర్యానా, కర్ణాటక, మహారాష్ట్ర ఉన్నాయి. ఆరో స్థానంలో తెలంగాణ, ఏడవ ప్లేస్ లో తమిళనాడు, ఎనిమిదో ప్లేస్ లో ఏపీ, తొమ్మది, పది స్థానాల్లో రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి.