రంజాన్ వేళ.. పాకిస్థాన్‌లో లాక్‌డౌన్ పొడిగింపు
న్యూ ఢిల్లీ ఏప్రిల్ 25
రంజాన్ నెల ఆరంభమైంది. దీంతో పాకిస్థాన్‌లో.. లాక్‌డౌన్‌ను మే 9వ తేదీ వరకు పొడిగించారు. ప్రస్తుతం పాక్‌లో 11,700 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 248 మంది మరణించారు. రంజాన్ నెల మధ్య వరకు లాక్‌డౌన్ పొడిగించాలని నిర్ణయించినట్లు మంత్రి అసద్ తెలిపారు. వైరస్ పోరాటంలో కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో లాక్‌డన్ పొడగించాల్సి వచ్చిందన్నారు. లాక్‌డౌన్‌ను మరో 15 రోజుల పాటు అంటే మే 9వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రణాళిక, అభివృద్ధిశాఖ మంత్రి అసద్ ఒమర్ తెలిపారు. మరో మంత్రి పీర్ నూర్ అల్ హక్.. మసీదుల తీరుపై మండిపడ్డారు. మసీదుల్లో మతపెద్దలు సోషల్ డిస్టాన్సింగ్ రూల్స్ పాటించడంలేదని అసహనం వ్యక్తం చేశారు. ఒకవేళ కరోనా కట్టడిలో విఫలమైతే, మతసంస్థలే నింద మోయాల్సి వస్తుందన్నారు. పాకిస్థాన్ ప్రభుత్వం అధికారికంగా రంజాన్ నెల ప్రారంభాన్ని ప్రకటించకముందే.. పెషావర్‌లోని ముఫ్తీ ఖాసిమ్ అలీ ఖాన్ మసీదులో ప్రార్థనలు మొదలుకావడం పట్ల కూడా మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పాక్ ప్‌లధాని ఇమ్రాన్ ఖాన్ ముస్లిం ప్రజలకు రంజాన్ ముబాకర్ చెప్పారు. లాక్‌డౌన్ నేపథ్యంలో.. ఈ పవిత్ర మాసంలో.. పేదలను, అణగారిన వర్గాలకు ఏమీ చేయలేకపోతున్న కారణంగా.. అల్లాను క్షమాభిక్ష కోరాలన్నారు.