భద్రకాళీ ఆలయంలో అంకుకార్పణ
వరంగల్ ఏప్రిల్ 25
చరిత్ర ప్రసిద్ధి గాంచిన శ్రీ భద్రకాళి దేవస్థానంలో ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా జరిగే శ్రీ భద్రకాళి భద్రేశ్వర శ్రీ కళ్యాణ బ్రహ్మోత్సవాలకు శనివారం అంకురార్పణ జరిగింది. ఉదయం గం: 04 గంటలకు అమ్మవారి నిత్యహ్నికం జరిపిన వెంటనే అమ్మవారికి అర్చకులు ఉత్సవ అంగీకార ప్రార్థన జరిపారు. అనుజ్ఞ లభించిన సూచన వచ్చినవెంటనే పూర్వాంగ విధిని నిర్వర్తించి స్నపనం జరిపారు. ఉత్సవాలకు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఉత్సవాలు నిర్విఘ్నంగా జరగాలని ఉదయం గణపతి సేవ సాయంకాలం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సేవ నిర్వహించిన అనంతరం ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. ఈరోజు ఉత్సవం వరంగల్ జిల్లా మున్నూరు కాపు సంఘం సౌజన్యంతో నిర్వహించడం జరిగింది. కరోనా ఎఫెక్ట్స్ వలన గుడి కి చెందిన అర్చకులు, సేవకులు ఐదుగురు మాత్రమే ఈ ఉత్సవాన్ని నిర్వహించారు. ఈరోజు వినయ్ భాస్కర్ వెంట ఉన్నవారిలో వరంగల్ జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు, చాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు కటకం పెంటయ్య ఉన్నారు. రాజ శాసనం ప్రజలంతా తమ తమ ఇండ్లలోనే ఉండాలి, భక్తులెవరు ఉత్సవాలలో పాల్గొనడానికి ఆలయానికి రాలేకపోయిన అందులకు బాధపడవద్దు అని భక్తులు తమ తమ ఇళ్లలోనే ఉండి భద్రకాళి శరణం మమ అనే నామాన్ని జపించడం వల్ల ఉత్సవాలలో అమ్మవారిని దర్శించిన పుణ్యం సంపూర్ణంగా వస్తుందని భక్తులు కలత చెందవలసిన పనిలేదు అని ఆలయ ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు అన్నారు. భక్తులు ఎవరు ఆలయంలో దర్శనానికి రావద్దని, భక్తులను ఎవరినీ అనుమతించడం లేదని ప్రజల ఆరోగ్య భద్రత ప్రాముఖ్యాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం చేసిన శాసనాన్ని పాటిస్తూ తమ తమ ఇళ్ల నుంచి బయటకు రావద్దు అని కోరుతూ ఉత్సవ విశేషాలు ఎలక్ట్రానిక్ , ప్రింట్ మీడియా ద్వారా ఇతర ప్రసార మాధ్యమాల ద్వారా అందించబడుతుంది అని ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, వరంగల్ ఉమ్మడి జిల్లాల సహాయ కమిషనర్ భద్రకాళి దేవస్థానం కార్యనిర్వహణాధికారి సునిత భక్తులను కోరారు. అంతేకాకుండా ప్రజల ఆరోగ్య భద్రత రీత్యా పూలు మరియు పూల దండలు బయట ఖరీదు చేసి పంపవద్దని మరియు ఇతర పదార్థాలను గుడికి పంపవద్దని ఆలయ ఈవో కోరారు.