YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

శివ కాళీ రహస్యం!

శివ కాళీ రహస్యం!

శివ కాళీ రహస్యం!
కొన్ని కాళీదేవి చిత్రాలలో శివుడు ఆమె పాదాల దగ్గర కనిపిస్తాడు. సాధారణంగా భార్యల కాళ్ల దగ్గర కూర్చున్న దేవుళ్లు తక్కువ. రాధాకృష్ణ సంప్రదాయంలో రాధాదేవి పాదాల దగ్గర కృష్ణుడు కూర్చుని పాదసేవ చేసే రూపాలు మనకు దర్శనమిస్తాయి. శాక్తేయ సంప్రదాయంలో కాళీదేవి చిత్రాలలో శివుని రూపం ఆమె పాదాల కింద ఉన్నట్టు కనిపిస్తుంది. దీని వెనకున్న కథను మన పురాణాలు చెబుతాయి. అదేంటంటే.. ఒకసారి యుద్ధరంగంలో రాక్షస సంహారం తర్వాత ఆ జగన్మాత క్రోధకాళిగా మారి నాట్యం చేయటం మొదలుపెట్టింది. ఆ రూపాన్ని చూసి అందరూ భయభ్రాంతులయ్యారు. ఆమె భర్త శివుని వద్దకు వెళ్లి అందరూ ఆ క్రోధ స్వరూపాన్ని ఉపసంహరింపజేయాల్సిందిగా ప్రార్థించారు. యుద్ధరంగంలోకి వచ్చిన శివుడు అమ్మవారి నాట్యం చూశాడు. ఆ దృశ్యమే భీకరంగా ఉంది. ఒక వైపు రాక్షసుల శరీరాలు.. మరోవైపు ఏరులై పారుతున్న రక్తం. వాటి మధ్య కాళీదేవి నృత్యం. ఆమె నృత్యాన్ని ఆపేదెలాగా అని ఆలోచించిన శివుడు. రాక్షసుల మృత దేహాల మధ్య పడుకున్నాడు. ఆ తల్లి యుద్ధరంగం అంతటా నాట్యం చేస్తూ శివుని దగ్గరకు వచ్చింది. ఆమె పాదం శివుని హృదయానికి తగిలింది. అప్పుడు ఆమె శివుని గుర్తించి.. తన క్రోధ స్వరూపాన్ని ఉపసంహరించుకుంది. ఇంకొక కథ ప్రకారం.. మహాప్రళయం వేళ అమ్మవారు ప్రళయతాండవం చేస్తోంది. ఆ తాండవానికి లోకాలన్నీ భయభ్రాంతులవుతున్నాయి. దేవతల ప్రార్థనల మేరకు శివుడు కాళీదేవి దగ్గరకు వెళ్లి- ‘‘దేవి! నీవు అత్యంత శక్తిస్వరూపిణినివి. నీ ప్రళయ తాండవం వల్ల సమస్తలోకాలు దద్దరిల్లిపోతున్నాయి. అందరూ నీ శక్తిని తట్టుకోలేకపోతున్నారు. నీ శక్తిని నేను మాత్రమే భరించగలను. అందుకు నీ పాదం నా హృదయం మీద మోపు’’ అని కోరాడు. అప్పుడు కాళీదేవి తన పాదాన్ని శివుని గుండెపై మోపి శివారూఢ అయింది. దీనికి సంబంధించిన మరో కథ కూడా మన పురాణాల్లో ఉంది. ఒక సందర్భంలో పార్వతీదేవి పరమేశ్వరుడితో- ‘‘స్వామి.. నేను ఎన్నో రూపాలు ధరించాను. సప్త మాతృకా స్వరూపాలతోను, నవదుర్గ రూపాలతోను, దశమహావిద్యల రూపాలతోను ప్రకాశిస్తూ ఉంటాను. నేను ధరించిన రూపాలలో ఏది మీకు ఎక్కువ ఇష్టం అని అడిగింది. దానికి పరమేశ్వరుడు- ‘‘నీవు ధరించిన రూపాలన్నింటిలోను కాళీ స్వరూపం అంటే చాలా ఇష్టం.’’ అన్నాడు. అప్పుడు పార్వతీదేవి- ‘‘స్వామి అందరూ నా సుకుమారమైన లలితా స్వరూపాన్ని ఆరాధిస్తూ ఉంటారు. కానీ మీకు కాళీ రూపం ఇష్టమంటే ఆశ్చర్యంగా ఉంది..’’ అంది అప్పుడు పరమేశ్వరుడు- ‘‘నీవు చెప్పింది నిజమే. లలితా స్వరూపం అతి సుందరమైనది. కామేశ్వరుడిగా నేను నీ పక్కనే ఉన్నా. ఇలా ప్రతి రూపంలోను నీ వెంట ఉన్నా. అయితే కాలమునకు అధిదేవతగా కాళిగా ఉన్నప్పుడు నిరాడంబరంగా, నిజమైన దివ్య సౌందర్యంతో ప్రకాశించావు. జ్ఞాన స్వరూపిణిగా వన్నెకెక్కావు. అందుకే ఆ స్వరూపంలో నేను నీ పాదాల దగ్గర ఉన్నా..’’ అని చెప్పాడు.

వరకాల మురళి మోహన్ సౌజన్యంతో

Related Posts