YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

వరి కొనుగోళ్లు ప్రారంభం

వరి కొనుగోళ్లు ప్రారంభం

వరి కొనుగోళ్లు ప్రారంభం
ఏలూరు, ఏప్రిల్ 27
రాష్ట్రంలో రబీ వరి కోతలు ముమ్మరంగా సాగుతుండగా, ధాన్యం కొనుగోళ్లు ఊపందుకోలేదు. గ్రామాల్లోనే రైతుల పొలాల (ఫాంగేట్‌) వద్దనే ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వగా, కొనుగోళ్లు నత్తకు నడక నేర్పుతున్నాయి. సాగైన దాంట్లో ఇప్పటి వరకు సుమారు 40 శాతం వరకు కోతలు పూర్తయ్యాయని వ్యవసాయశాఖ చెబుతోంది. దాదాపు 20 లక్షల టన్నుల ధాన్యం చేలల్లో, లేదంటే రైతుల ఇళ్ల వద్ద ఉందని అంచనా. కాగా ధాన్యం కొనుగోలుకు నోడల్‌ సంస్థగా వ్యవహరిస్తున్న పౌర సరఫరాల కార్పొరేషన్‌  3.74 లక్షల టన్నులను మాత్రమే కొనుగోలు చేసింది. రైతుల వద్ద ఉన్న ధాన్యంలో 20 శాతమే కొనుగోలు చేసింది. ఇది కూడా రబీ రైతుల వద్ద నుంచి నేరుగా కొన్నది కాదన్న ఆరోపణలు ఉన్నాయి. ఖరీఫ్‌లో, ప్రస్తుత రబీలో రైతుల వద్ద నుంచి మద్దతు ధరల (ఎంఎస్‌పి) కంటే తక్కువకు కొని, తిరిగి ఎంఎస్‌పిపై సివిల్‌ సప్లయిస్‌కు మిల్లర్లు, వ్యాపారులు, దళారులు బట్వాడా చేసిందే అధికమని విమర్శలొస్తున్నాయి.రబీలో 8.05 లక్షల హెక్టార్లలో వరి సాగైందని, దిగుబడులు 52 లక్షల టన్నులొస్తాయని వ్యవసాయ, అర్థగణాంక విభాగాలు తాజాగా మూడవ ముందస్తు అంచనాలు విడుదల చేశాయి. రానున్న దిగుబడుల్లో 30 లక్షల టన్నులను మాత్రమే సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ కొనుగోలు చేయాలని నిర్ణయించింది. వ్యవసాయ పనులకు, పంటల రవాణాకు లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపులు ఉన్నప్పటికీ వ్యాపారులు, మిల్లర్లు రైతుల వద్ద కొనుగోళ్లను వ్యూహాత్మకంగా నిలిపేశారు. ఈ సమయంలో రైతులను ఆదుకునేందుకు పండిన పంట మొత్తాన్నీ సర్కారే కొనాల్సి ఉండగా, లక్ష్యాన్ని 60 శాతానికి పరిమితం చేసింది. దీంతో వ్యాపారులు, దళారులు కొండెక్కి కూర్చున్నారు. ఎంఎస్‌పి కంటే తక్కువకు అడుగుతున్నారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ కేంద్రాల్లో ధాన్యం కొనుగోలుకు విధించిన ఈ-క్రాప్‌ బుకింగ్‌ నిబంధన రైతులకు, ప్రధానంగా కౌలు రైతులకు ఇబ్బందికరంగా మారింది. గోనె సంచులు, వేయింగ్‌ మిషన్లు, తేమ కొలిచే పరికరాలు, గ్రామాల్లో రైతుల పేర్ల రిజిస్ట్రేషన్‌కు అవసరమైన ట్యాబుల వంటి మౌలిక వసతులను సర్కారు ఇంకా పూర్తి స్థాయిలో సమకూర్చలేదు. దీంతో ప్రభుత్వ కేంద్రాల్లో కొనుగోళ్లు బాగా నెమ్మదిగా జరుగుతున్నాయి.రబీలో రాష్ట్రం మొత్తమ్మీద 2,169 కేంద్రాలు తెరవగా, వాటిలో 80 వేల హెక్టార్లకు సంబంధించిన 50 వేల మంది రైతులు తమ పేర్లను రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. 24 వేల మంది రైతుల నుంచి రూ.683 కోట్ల విలువైన 3.74 లక్షల టన్నులను ప్రభుత్వ కేంద్రాల్లో కొన్నారు. వారిలోనూ 8 వేల మందికి 1.37 లక్షల టన్నులకుగాను రూ.252 కోట్లు మాత్రమే చెల్లించారు. కానీ ఇప్పటికే మూడున్నర లక్షల హెక్టార్లలో వరి కోతలు పూర్తయినట్లు సమాచారం. వరి కోతలను పూర్తిగా యంత్రాలతోనే (హార్వెస్టర్లు) రైతులు సాగిస్తుండటంతో వెంటనే ధాన్యం చేతికొచ్చేస్తోంది. ఇదే సమయంలో వాన మబ్బులేస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు
 

Related Posts