YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

విశాఖ కమలంలో వర్గాలు

విశాఖ కమలంలో వర్గాలు

విశాఖ కమలంలో వర్గాలు
విశాఖపట్టణం, ఏప్రిల్ 27,
విశాఖ బీజేపీలో ఇపుడు మళ్ళీ రచ్చ సాగుతోంది. అధికారం ఏపీలోనే అసలు లేదు. ఒక ఎమ్మెల్యే కానీ వార్డు మెంబర్ కానీ ఆ పార్టీకి లేరు. కానీ మిగిలిన పార్టీలతో సమానంగా వర్గ పోరు మాత్రం చాలా ఎక్కువగానే ఉందిపుడు. విశాఖలో బీజేపీకి కొంత బలం ఎపుడూ ఉంది. ఇక్కడే బీజేపీ ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు కొన్ని సార్లు గెలుచుకుంది. అలాగే విశాఖ కార్పోరేషన్ తొలి మేయర్ కూడా ఏనాడో బీజేపీ గెలుచుకుంది. ఇక ప్రతీ కార్పోరేషన్లోనూ ఇద్దరు ముగ్గురైనా బీజేపీ కార్పోరేటర్లు గెలుస్తూ ఉంటారు. విశాఖలో సొంతంగా బీజేపీకి ఉన్న రాజకీయ బలమిది. దాంతో విశాఖ మీద ఇతర ప్రాంతాల బీజేపీ నేతల కన్ను కూడా ఉంది.అన్న ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురంధేశ్వరి విశాఖ నుంచి కాంగ్రెస్ తరఫున ఒకసారి ఎంపీగా గెలిచారు. ఇక ఆమె 2019 ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఆమెకు డిపాజిట్ కూడా రాకుండా చేసింది సొంత పార్టీలోనేనని ఆమె సైతం అనుమానించారు. దాని మీద ఢిల్లీ పెద్దలకు అప్పట్లో ఫిర్యాదు కూడా చేశారని టాక్. ఆ సంగతి ఇలా ఉంటే ఆమె ఇప్పటికీ విశాఖను తన సొంత ప్లేస్ గా భావిస్తున్నారు. తాను మళ్ళీ అవకాశం ఉంటే ఇక్కడ నుంచే ఎంపీగా బీజేపీ తరఫున పోటీకి దిగాలనుకుంటున్నారు. ఇక పురంధేశ్వరి రావడంతో బీజేపీ అప్పటి సిట్టింగ్ ఎంపీ హరిబాబు కూడా సైడ్ అయిపోయారు. అయితే ఆమెకు మళ్ళీ అవకాశం ఇవ్వకుండా పార్టీలో అపుడే పావులు కదుపుతున్నారట.విశాఖ బీజేపీలో కాశీరాజు అని ఒక కీలక నేత ఉన్నారు. ఆయన ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా ఇపుడు వ్యవహరిస్తున్నారు. ఆయన గతంలో విశాఖ వన్ నియోజకవర్గం నుంచి ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్ధిగా బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆయన సినీ నటుడు కృష్ణంరాజుకు దగ్గర బంధువు. ఆ విధంగా ఆయనకు నేరుగా ప్రధాని మోడీతోనూ, ఢిల్లీ బీజేపీ పెద్దలతోనూ సన్నిహిత పరిచయాలు ఉన్నాయి. దాంతో ఆయన రానున్న రోజుల్లో విశాఖ నుంచి పార్టీలో చక్రం తిప్పాలను ఉబలాటపడుతున్నారు.ఇక బీజేపీకి 2024 ఎన్నికలు బాగా కలసివస్తాయని రాజు గారు అంచనా వేస్తున్నారు. అప్పటికి అనుకోని కొత్త పొత్తులు కుదురుతాయని కూడా ఆయన ఆశపడుతున్నారు. దాంతో విశాఖ నుంచి బీజేపీ ఎంపీగా టికెట్ సంపాదిస్తే ఇక ఫ్లైట్ లో ఢిల్లీ వెళ్ళి పార్లమెంట్ లో కూర్చోవడమే తరువాయి అని భావిస్తున్నారు. ఆయన ఈ మధ్య బీజేపీలో జోరు బాగా పెంచారు. తరచూ మీడియా మీటింగులు పెట్టడమే కాకుండా జనాల్లో కూడా తిరుగుతున్నారు. ఇక కరోనా వైరస్ ఆర్ధిక సాయాన్ని భారీగా సేకరించి ప్రధాని మోడీ ఖాతాకు నేరుగా పంపించి మార్కులు కొట్టేశారు. మొత్తం మీద రాజు గారి దూకుడు చూస్తూంటే చిన్నమ్మ పురంధేశ్వరికి చెక్ చెప్పేందుకు సర్వం సిధ్ధం చేసుకున్నట్లే కనిపిస్తోంది. అయితే ఈయన కూడా నాన్ లోకలే. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వారు. దాంతో నాన్ లోకల్ డిమాండ్ తో చిన్నమ్మ సీటుకు ఎసరు పెట్టడం సాధ్యపడుతుందా? అలాగే ఢిల్లీ బంధాలు కూడా పురంధేశ్వరికే గట్టిగా ఉన్నాయి, చూడాలి మరి. మొత్తానికి బీజేపీ రాజు గారు రేపటి రోజు నాదేనంటున్నారు.

Related Posts