కనిపించకుండా ఇసుక తోడేస్తున్నారు...
ఖమ్మం, ఏప్రిల్ 27
కిన్నెరసాని, మొర్రేడు నదులు ఇసుక మాఫియాతో ఘోషిస్తున్నాయి. పాల్వంచ మండల, పట్టణ పరిధిల నుండి ఆయా నదులు ప్రవహిస్తున్నాయి. కొందరు ఇసుకాసురులు అక్రమ ఇసుక రవాణాను వ్యాపారంగా చేసుకొని రోజుకు లక్షల రూపాయలు దోచుకుంటున్నారు. అభివృద్ధి పనుల కోసం ప్రారంభించిన ఇసుక ర్యాంపు నుండి అక్రమ ఇసుక వ్యాపారానికి తెరలేపారు. అనుమతులు తీసుకున్నది అభివృద్ధి పనుల కోసం.. కానీ అక్కడ జరిగే తంతు వేరేలా ఉంది. ర్యాంపు ప్రారంభం కాక ముందు అక్రమ ఇసుక రవాణాను గుట్టుచప్పుడు కాకుండా రవాణా చేసేవారు. ర్యాంపు ప్రారంభించిన నాటి నుండి ఎటువంటి అడ్డుఅదుపు లేకుండా పగలు రాత్రి తేడాలేకుండా అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్నారు. ధనార్జనే ధ్యేయంగా కొందరు అధికార పార్టీకి చెందిన గల్లీ లీడర్లు ఎమ్మెల్యే పేరును వాడుకొని ఒకే కూపన్ పై రోజంతా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు. ప్రతి రోజు ఒక్కో ట్రాక్టర్ మొదటి లోడ్‌కు రూ. 1200 చెల్లించి తరువాత లోడ్‌లకు కూపన్ లేకుండా ఒక్కో ట్రాక్టర్ ఇసుక లోడ్‌కు రూ. 500 నుండి 800 వరకు వసూలు చేస్తున్నారు. ర్యాంపుకు వెళ్ళేదారిలో అనధికార చెక్‌పోస్ట్ ఏర్పాటుచేసి ప్రైవేటు వ్యక్తులు డబ్బులు తీసుకొని ట్రాక్టర్ నెంబర్ నమోదుచేసుకుని లోడ్ చేసి పంపిస్తున్నారు. ర్యాంపు వద్ద సుమారు వంద ట్రాక్టర్లు సీరియల్ లో ఉన్నాయంటే ఎంత మేర అక్రమ ఇసుక రవాణా జరుగుతుందో అర్ధం చేసుకోవచ్చు. రోజుకు సుమారు 80 నుండి 100 ట్రాక్టర్లు ఒక్కో ట్రాక్టర్ 5 నుండి 8 ట్రిప్పుల ఇసుక రవాణా అవుతుంది. అంటే సుమారు రోజుకు 500 ట్రిప్పుల వరకు ఇక్రమ ఇసుక రవాణ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి గాను రోజుకు సుమారు రూ. 2.5 నుండి 3 లక్షల వరకు అక్రమంగా దోచుకుంటున్నట్లు సమాచారం. ర్యాంపు వద్ద పంచాయితీ కార్యదర్శి కానీ వారి సహాయకుల పర్యవేక్షణలో డి.డి. లు తీసిన ట్రాక్టర్ యజమానులకు ఇసుకను ఇవ్వాల్సి ఉంది. కానీ సంబంధించిన ఏ ఒక్క అధికారి కూడా పర్యవేక్షణ ఉండటం లేదు. పంచాయితీ రశీదు పుస్తకం సైతం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. దీంతో పంచాయితీ ఆదాయానికి భారీగా గంఢీ కొడుతున్నట్లు వినిపిస్తోంది. పంచాయితీ ఆదాయానికి గంఢీ పడుతుందని కొందరు స్థానికులు అడ్డుకొనగా అధికార బలంతో పోలీసులతో కేసులు పెడతామని బెదిరిస్తున్నట్లు స్థానికంగా వినిపిస్తోంది. అధికారులను సైతం ర్యాంపు వైపు కన్నెత్తి చూడకుండా ఓ చోటా నాయకుడు అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి పేరు చెప్పి హడలెత్తిస్తున్నట్లు సమాచారం. స్థానికులు కొందరు అక్రమ ఇసుక రవాణా పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన సందర్భాలున్నాయి.ఇప్పటికైనా అక్రమంగా తరలుతున్న ఇసుకపై స్థానిక ఎమ్మెల్యే, ఉన్నతాధికారులు దృష్టి సారించి పంచాయితీ ఆదాయాన్ని పెంచి అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు.