వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్
వైకాపా ఎంపీలు తమ రాజీనామాలను లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కు శుక్రవారం నాడు సమర్పించారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సహా విభజన హామీల అమలులో కేంద్రం పూర్తిగా విఫలమైనందున రాజీనామాలు సమర్పిస్తున్నామని వారీ సందర్భంగా స్పీకర్ కు తెలిపారు. ఈ సందర్భంగా రాజీనామాలపై పునరాలించుకోవాలని స్పీకర్ ఎంపీలను కోరారు. సభలోనే ఉండి పోరాడాలని వారికి చెప్పారు.అంతకుముందు ఏంపీలు మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఫోటో దగ్గర స్పీకర్ ఫార్మట్ లో సిద్ధం చేసిన రాజీనామా లేఖలు ఉంచి, అయనకు నివాళులు అర్పించారు. అనంతరం రాజీనామా పత్రాలతో పార్లమెంటుకు వెళ్లారు. వైసీపీ ఎంపీలు మాట్లాడుతూ, తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, రాష్ట్ర హక్కుల కోసం రాజీనామాలు చేస్తున్నామని చెప్పారు. అనంతరం వారు అక్కడ నుంచి ఏపీ భవన్ కు చేరుకున్నారు. ప్రత్యేక హోదా కోసం వైకాపా ఎంపీలు ఆమరణదీక్షకు సిద్దమయ్యారు. ఎంపిలు వైవి సుబ్బారెడ్డి, వరప్రసాద్, అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి తమ పదవులకు రాజీనామాలు చేసినవారిలో వున్నారు.
అన్న మాట ప్రకారం మా మాటను నిలబెట్టుకున్నామని, వైకాపా ఎంపీల రాజీనామాపై ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ముందుగా చెప్పినట్టుగానే మా ఎంపీలు తమ రాజీనామాలను స్పీకర్ కు సమర్పించారని అయన తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేస్తూ, తమవంతుగా టీడీపీ ఎంపీలతో చంద్రబాబు రాజీనామా చేయించాలని సవాల్ విసిరారు.
స్పీకర్ ఫార్మట్ లో రాజీనామాలు ఇచ్చిన వైకాపా ఎంపీలు!!