మా దేశంలో కరోనా లేదు :న్యూజిలాండ్ ప్రధాని
న్యూఢిల్లీ, ఏప్రిల్ 27
నోవెల్ కరోనా వైరస్‌ను సమర్థవంతంగా రూపుమాపినట్లు న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెన్ తెలిపారు. దేశంలో కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌ను కూడా నిలువరించామన్నారు. గత కొన్ని రో్జుల నుంచి న్యూజిలాండ్‌లో కేసుల నమోదు దగ్గింది. రోజువారి సంఖ్య ఒక్క కేసు కూడా దాటడంలేదు. ఆదివారం కూడా ఒకే ఒక్క పాజిటివ్ కేసు నమోదు అయ్యింది. దీంతో వైరస్‌ను అంతం చేసినట్లు ప్రధాని జెసిండా ప్రకటించారు కానీ అధికారుల మాత్రం నిర్లక్ష్యంగా ఉండరాదంటూ వార్నింగ్ ఇచ్చారు. మార్చి మొదటి వారం నుంచి కఠినమైన ఆంక్షలు అమలు చేస్తున్న న్యూజిలాండ్ ప్రస్తుతం వాటిని సడలించనున్నది. మంగళవారం నుంచి దేశంలో వ్యాపారాలు, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ కార్యక్రమాలు ప్రారంభంకానున్నాయి. అయితే ఎక్కువ శాతం జనం ఇండ్లకే పరిమితం కానున్నారు. సామూహిక కలయికలను నిషేధించారు. ప్రపంచ దేశాల్లో అత్యంత వేగంగా వైరస్‌ను నియంత్రించిన దేశంగా న్యూజిలాండ్ నిలిచింది. 50 లక్షల జనాభా ఉన్న ఆ దేశంలో కేవలం 1500 మందికి మాత్రమే వైరస్ సంక్రమించింది. 19 మంది మరణించారు.