YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ

రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ
 

 రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ
హైద్రాబాద్, ఏప్రిల్ 28
కరోనా కష్ట కాలంలో తెలంగాణ ప్రజలకు యాసంగి పంట దిగుబడి అదిరిపోయే గుడ్‌న్యూస్‌ని అందించింది. గత రికార్డులన్నీ చెరిపేస్తూ రికార్డు స్థాయిలో పంట చేతికొస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి సుమారు 40 లక్షల ఎకరాల్లో వరిని రైతులు సాగు చేశారు. దీంతో రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ సరికొత్త రికార్డులను నెలకొల్పబోతోంది. కొత్త రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణలో యాసంగి సాగు అంతంత మాత్రంగా ఉండేది. ఓవైపు సాగునీటి కొరత మరోవైపు విద్యుత్తు లభించక రైతులు యాసంగి సాగు అంటేనే హడలిపోయేవారు. కొందరు ధైర్యం చేసి సాగు చేసినా... నీరు, కరెంటు కష్టాల కారణంగా అనేక ఇబ్బందులు పడేవారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత పరిస్థితుల్లో మార్పు రావడం మొదలైంది.  రాష్ట్రం ప్రభుత్వం రైతుల కష్టాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. రైతులను నిత్యం ఇక్కట్లకు గురి చేస్తున్న విద్యుత్, సాగు నీటి కష్టాలు తీర్చేందుకు ప్రత్యేక ప్రణాళిక అమలు చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 24.16 లక్షల మంది రైతుల పంపుసెట్లకు 24 గంటల పాటు ఉచితంగా కరెంటు సరఫరా చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఓ వైపు కరెంటు సమస్యలకు పరిష్కారం చూపిస్తూనే దీర్ఘకాల సమస్యగా ఉన్న సాగునీటి వనరుల సమగ్ర వినియోగానికి శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా కాళేశ్వరం, పాలమూరు, దేవాదుల ఎత్తిపోతల పథకాలతో రాష్ట్ర తీరు తెన్నులు మారిపోవడం మొదలైంది. కాళేశ్వరం ప్రాజెక్టు ఫస్ట్ ఫేజ్ ఇప్పుడిప్పుడే ఫలితాలు ఇవ్వడం మొదలు పెట్టింది.కాశేశ్వరం కాల్వలు, రిజర్వర్వాయర్లు నీటితో కళకళలాడుతుండటంతో యాసంగి సాగు చేసుకునేందుకు ఉత్తర తెలంగాణ  రైతులకు భరోసా వచ్చింది. ఎస్సారెస్పీ, జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, ఎల్లంపల్లి ల కింద పూర్తిస్థాయిలో ఆయకట్టుకు నీరందించారు. ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేసి దాదాపు 5వేల చెరువులు నింపారు. దీంతో భూగర్భ జలాలు పెరిగాయి. దీంతో సాగునీటి ప్రాజెక్టుల కింద ఏకంగా 40లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయి. గతేడాది యాసంగిలో మొత్తంగా 18.57లక్షల ఎకరాలలో వరి సాగవగా, అది ఈ ఏడాది ఏకంగా 40లక్షల ఎకరాలకు పెరిగింది.తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన కొత్తలో యాసంగి సాగు విస్తీర్ణం 2014‌‌‌‌‌‌-15లో కేవలం 12.23 లక్షల ఎకరాలకే పరిమితం. గడిచిన నాలుగేళ్లుగా తీసుకుంటున్న చర్యలతో సాగు విస్తీర్ణం పెరిగి గతేడాది 18.35 లక్షల ఎకరాలకు చేరుకుంది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా గత యాసంగి సీజన్‌ కంటే రెట్టింపు స్థాయిలో ఏకంగా 39.12  లక్షల ఎకరాల్లో యాసంగి సాగు జరిగింది. ఇక ఖరీఫ్ సీజన్‌ విషయానికి వస్తే 2014-15లో ఖరీఫ్ సీజన్ సాగు 22.7 లక్షల ఎకరాలు ఉంది. గత ఖరీఫ్‌లో ఈ సంఖ్య 40.7 లక్షల ఎకరాలకు చేరుకుంది. రాబోయే ఖరీఫ్ సీజన్‌లో తెలంగాణలో కనీవినీ ఎరుగని రీతిలో ఏకంగా 70 లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సాగునీటి , విద్యుత్ ప్రాజెక్టులన్నీ పూర్తయితే తెలంగాణ రాష్ట్రం దేశానికే  రైస్‌బౌల్‌గా మారుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. యాసంగి పంటకు సంబంధించి రికార్డు స్థాయిలో వస్తోన్న పంట దిగుబడిని కొనేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 7వేలకు పైగా కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కోతలకు సంబంధించి రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఇప్పటికే జిల్లా యంత్రాంగాలకు ఆదేశాలు జారీ అయ్యాయి.  ప్రస్తుతం తెలంగాణలో ఉత్పత్తవుతున్న  వరిధాన్యంలో 3 లక్షల టన్నుల బియ్యాన్ని ఇక్కడ ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందిస్తున్నారు. మరో  2.52 లక్షల టన్నుల ధాన్యం తమిళనాడు, కేరళా, కర్నాటక రాష్ట్రాలకు పంపిస్తున్నారు. ప్రస్తుతం పెరుగుతున్న దిగుబడిని దృష్టిలో ఉంచుకుని పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి వరి ధ్యాన్యం పంపే యోచనలో ప్రభుత్వం ఉంది. మొత్తం మీద దేశానికే రైస్ బౌల్‌గా మారబోతోంది తెలంగాణ.

Related Posts