తాము ఇచ్చిన సలహాలను అన్ని దేశాలు పాటించలేదు:డబ్లూఎచ్ఓ
న్యూ ఢిల్లీ ఏప్రిల్ 28
నోవెల్ కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన సలహాలను అన్ని దేశాలు పాటించలేదని టెడ్రోస్ అథనమ్ గెబ్రియాసస్ తెలిపారు. జనవరి 30వ తేదీ నుంచి కోవిడ్19కు సంబంధించిన ట్వీట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు. కోవిడ్19 పేషెంట్లను గుర్తించి, పరీక్షించి, ఐసోలేట్ చేయాలని ఎప్పటికప్పుడూ చెబుతూనే ఉన్నామన్నారు. అయితే తాము ఇచ్చిన సలహాలు, సూచనలను కొన్ని దేశాలు మాత్రమే పాటించాయన్నారు. ప్రతి దేశం తమ సలహాలను పాటించే విధంగా వత్తిడి చేసే అధికారం కానీ, శక్తి కానీ తమ దగ్గర లేదన్నారు. మా సలహాలను ఆయా దేశాలు ఇష్టపూర్వకంగా స్వీకరించడం లేదా తిరస్కరించడం జరిగిందన్నారు. సైన్సు, ఆధారాల మూలంగా తాము సలహాలు ఇస్తూనే ఉంటామన్నారు. తాము ఇచ్చే సలహాలను స్వీకరించడం ఆయా దేశాల ఇష్టాన్ని బట్టి ఉంటుందని టెడ్రోస్ తెలిపారు.