కొనే నాధుడేడి
భద్రాద్రి కొత్తగూడెం ఎప్రిల్ 28
కరోనా వైరస్ కారణంగా దేశమంతా లాక్ డౌన్ పాటిస్తున్న వేళ వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా రైతులు ఇబ్బందుల పాలవుతున్నారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో ఇటీవల కాలంలో ఎన్నో కష్టాలను అధిగమించి పండించిన పంటను కొనే నాధుడే కరువయ్యారు. గత నెల రోజులగా లాక్ డౌన్ ను ఎదుర్కొని,ఎన్నో వ్యయ ప్రయాసలోకోర్చి సాగు చేసిన రైతులకు కన్నీళ్లే మిగులుతున్నాయి. ఈసారి అశ్వారావుపేట మండలంలో మొక్కజొన్న,వరి విస్తారంగా సాగు అయ్యింది.అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈపాటికే రైతులు తమ పంటలను అమ్మి సొమ్ము చేసుకునేవాళ్ళు. కానీ అనుకోని ప్రళయంగా కరోనా మహమ్మారి తమ ఆశలను అడియాశలు చేసిందని వాపోతున్నారు రైతులు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులకు నష్టం వాటిల్లకుండా చూస్తామని హామీలు గుప్పించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం చేతులెత్తేసిందని ఆరోపిస్తున్నారు. కరోనా నేపథ్యంలో కూడా పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని, రైతులు దిగులు చెందొద్దని,అన్ని పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం మాటలు నీటి మూటలుగానే మిగిలిపోయాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అశ్వారావుపేట మండలంలో పలు గ్రామాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు నామమాత్రంగానే మిగిలిపోయాయని ఆరోపించారు. ధాన్యం యార్డ్ కి తీసుకువచ్చిన తర్వాత వంద ప్రశ్నలు వేసి ఆఖరుకి కొనుగోలు చేయకుండా వెనక్కితిప్పి పంపుతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచమే స్తంభించిన వేళ కరోనా రక్కసిని ఎదిరించి మరీ పంట పండిస్తే ఏవేవో కుంటిసాకులు చెప్పి,తమ పంటను కొనుగోలు చేయకుండా తమ కష్టాన్ని అధికారులు హేళన చేస్తున్నారని అధికారుల తీరును దుయ్యబట్టారు. అధికారుల నిర్లక్ష్య ధోరణి వల్ల పంటను దళారులకు అమ్ముకోవడం తప్ప తమకు వేరే మార్గం లేకుండాపోయిందని,దీనివల్ల ఆరుగాలం శ్రమించిన రైతు కష్టం దళారుల దోపిడీకి గురి అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఇప్పటికైనా పై అధికారులు తమ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి,చిన్న చిన్న కారణాలను సాకుగా చూపించకుండా పంట మొత్తాన్ని గిట్టుబాటు ధర ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.