ఏపీలో ప్రారంభమైన విద్యాదీవెన
విజయవాడ, ఏప్రిల్ 28,
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరో ప్రతిష్టాత్మక పథకానికి శ్రీకారం చుట్టారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో.. మంగళవారం ‘జగనన్న విద్యా దీవెన’ పథకాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల విద్యార్థులతో సీఎం వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లు, విద్యార్థులు తల్లులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఈ పథకాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఇంతకు ముందు తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఈ పథకం తీసుకువచ్చారని.. అంతవరకూ ఎవరూ కూడా దీని గురించి ఆలోచన చేయలేదని సీఎం జగన్ గుర్తుచేశారు. బోర్డింగ్, లాడ్జింగ్ కోసం వసతి దీవెన, పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం విద్యా దీవెన అనే రెండు పథకాలను తీసుకోచ్చామని తెలిపారు. అలాగే ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద రూ. 4 కోట్లకు పైగా నిధులు విడుదల చేశారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఎన్నడూ లేని విధంగా పూర్తి ఫీజును రీయింబర్స్‌మెంట్ అందజేయనున్నారు. గత ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.1,880 కోట్ల బకాయిలను కాలేజీలకు చెల్లించారు. ఇంకా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘పెద్ద చదువులు చదవగలిగితేనే పేదరికం పోతుందని, అప్పులు పాలు కాకుండా పెద్ద చదువులు చదివితేనే పేదవాళ్ల తలరాతలు మారుతాయని, బతుకులు మారుతాయని నాన్నగారు ఈ పథకాన్ని తీసుకొచ్చారు. రాష్ట్రంలో నాన్నగారు ఉన్నప్పుడు ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అగ్రవర్ణాల్లోని పేదలందరికీ పూర్తి భరోసా ఉండేదన్నారు. సీఎం స్థానంలో మనసున్న మహారాజు ఉండేవాడని ఒక భరోసా ఉండేది. ఆయన చనిపోయాక ఈ పథకాన్ని పూర్తిగా నీరుగారుస్తూ పోయారు. చాలీచాలని ఫీజులు ఇవ్వడం, ఇచ్చామంటే ఏదో ఇచ్చామన్నట్లుగా ఇవ్వడం చేశారు. ఫీజులు ఎలా ఇవ్వాలన్న ఆలోచన కాకుండా ఎలా కత్తిరించాలి.. అని ఆలోచన చేసి.. చాలీచాలని ఫీజులు ఇచ్చారు. బోర్డింగ్, లాడ్జింగ్ కోసం వసతి దీవెన, పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం విద్యా దీవెన అనే రెండు పథకాలను తీసుకు వచ్చాం. పిల్లలకు మనం ఇవ్వగలిగిన ఆస్తి ఏదైనా ఉందంటే.. ఒక్క చదువులు అన్నది.. నేను వేరే చెప్పాల్సిన పని లేదు. కుటుంబంలో ఒక్క పిల్లాడైనా మంచి చదువులు చదివితే.. ఆ పిల్లాడికి మంచి జీతం వస్తుంది, మన బతుకుల మారుతాయి. ఈ దిశగానే అడుగులు వేస్తే.. మొట్టమొదటి సారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా మార్చి 31 వరకూ ఉన్న పూర్తి బకాయిలను ఒక్క రూపాయి కూడా పెండింగులో పెట్టకుండా ఇస్తున్నాం. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు. 2018–19లో గత ప్రభుత్వం పెట్టిన రూ.1880 కోట్ల బకాయిలను పూర్తిగా చెల్లిస్తూ, అలాగే ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి నాలుగు త్రైమాసికాలకు ఇస్తున్న డబ్బులు అన్నీ కలిపి ఒక్క పైసా కూడా బకాయి లేకుండా చెల్లిస్తున్నాం.ఈ పథకాన్ని మరో అడుగు ముందుకు తీసుకువెళ్తున్నామన్నారు, వచ్చే విద్యా సంవత్సరం 2020–21కి సంబంధించి ప్రతి త్రైమాసికం పూర్తైన తర్వాత తల్లుల ఖాతాలోనే నేరుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులు వేస్తాం. తల్లులు ఫీజులు కట్టడం వల్ల.. కాలేజీలను వారు అడగగలరు. టీచింగ్ స్టాఫ్ బాగా లేకపోయినా, వసతులు బాగా లేకున్నా ప్రశ్నించే అవకాశం వస్తుంది. ప్రతి 3 నెలలకోసారి డబ్బులు కట్టడానికి వెళ్లడం వల్ల పిల్లలు ఎలా చదువుతున్నారు? వారు సక్రమంగా కాలేజీలకు వెళ్తున్నారా? లేదా? అని తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు