చైనాపై నష్టపరిహారం
బీజింగ్, ఏప్రిల్ 28,
నోవెల్ కరోనా వైరస్ విషయంలో చైనా నుంచి నష్టపరిహారాన్ని కోరేందుకు ప్రయత్నిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. చైనాలోని వుహాన్ నుంచి వైరస్ ప్రపంచవ్యాప్తంగా ప్రబలిన విషయం తెలిసిందే. అయితే వైరస్ విషయంలో.. చైనా తీరు పట్ల సంతోషంగా లేమని, ఎందుకంటే, ఎక్కడ వైరస్ పుట్టిందో, అక్కడ ముందు జాగ్రత్తలు తీసుకుంటే, దాన్నిఆపేవాళ్లమని ట్రంప్ అన్నారు. వైట్‌హౌజ్‌లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. వైరస్‌ను త్వరగా నియంత్రిస్తే, అది ప్రపంచవ్యాప్తంగా ప్రబలేది కాదన్నారు. చైనా ఈ అంశంలో బాధ్యత తీసుకునేందుకు చాలా కారణాలే ఉన్నాయన్నారు. ఈ విషయంలో తాము సీరియస్‌గా విచారణ చేపడుతున్నామని ట్రంప్ అన్నారు. 165 బిలియన్ల డాలర్ల నష్టపరిహారం ఇవ్వాలని జర్మనీ పత్రిక ఓ కథనం రాసింది. దానిపై ట్రంప్ స్పందిస్తూ.. అంతకన్నా మెరుగైన రీతిలో నష్టపరిహారాన్ని పొందవచ్చు అన్నారు. అయితే ఎంత మొత్తంలో చైనా దగ్గర నష్టపరిహారాన్ని డిమాండ్ చేయాలన్నదానిపై తుది నిర్ణయానికి రాలేదన్నారు. ప్రపంచవ్యాప్తంగా నష్టం జరిగిందన్నారు. అమెరికాలో ఇప్పటి వరకు కరోనా వల్ల 55 వేల మంది మరణించారు.