కోహేడ మార్కెట్ సిద్దం
హైదరాబాద్ ఏప్రిల్ 28
రంగారెడ్డి జిల్లా కోహెడ మార్కెట్ పనులను రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, విద్యా శాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఇతరులు మంగళవారం పరిశీలించారు. మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ వినియోగానికి కొహెడ మార్కెట్ సిద్దమని అన్నారు. సంపూర్ణస్థాయి వినియోగంలోకి తెచ్చి అధికారికంగా మూడు రోజులలో ప్రారంభిస్తాం. రైతుకు ఎక్కడా ఇబ్బందులు కలగొద్దు. అనధికారికంగా మామిడి రాక మొదలయ్యింది. కరోనా నేపథ్యంలో కోహెడ యుద్దప్రాతిపదికన సిద్దంచేస్తున్నాం. రోజుకు 600 వాహనాలు వస్తున్నాయి. ఇది మరింత పెరుగుతుందని అన్నారు. రెండు భారీ షెడ్లు సిద్దమయ్యాయి . మరో షెడ్ నిర్మిస్తాం . రూ.65 లక్షలతో 1.26 లక్షల చదరపు అడుగుల షెడ్లు అందుబాటులోకి వస్తాయి. తాగునీటి కోసం 20 రెండువేల లీటర్ల ట్యాంకులు కడుతున్నాం. ఔటర్ నుండి మార్కెట్ వరకు వెంటనే లైటింగ్ సిద్దం చేయండి. రైతులు, ఏజెంట్లు, సహాయకుల కోసం క్యాంటిన్ ఏర్పాటు చేయాలి. మార్కెట్ ఏజెంట్లు, సహాయకులకు పోలీసులతో ఇబ్బందులు లేకుండా గుర్తింపు కార్డులు వెంటనే ఇవ్వండని అధికారులకు ఆదేశాలిచ్చారు. తెలంగాణలో 4 లక్షల ఎకరాలలో మామిడి సాగయింది. జగిత్యాల మామిడి ముంబయికి వెళ్తుంది .. మిగిలిన మామిడి అంతా కొహెడకే వస్తుంది. గడ్డిఅన్నారం మార్కెట్ సరిపోదని ముందస్తు ప్రణాళికతో కోహెడలో ఈ ఏడాది మామిడి మార్కెట్ సిద్దం చేశామని అన్నారు. మార్కెట్లో సీసీ కెమెరాలు, ప్రథమ చికిత్స కేంద్రం, అగ్నిమాపక కేంద్రం, పార్కింగ్ తదితర సౌకర్యాలన్నీ సిద్దమయ్యాయి. వ్యవసాయ మార్కెట్ కమిటీ నుండి ఉచితంగా మాస్క్ లు సరఫరా చేస్తాం. . రైతులు, ఏజెంట్లు సామాజిక దూరం పాటించాలని అన్నారు.