YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

దాడి వీరభద్రరావు..దారెటు.

దాడి వీరభద్రరావు..దారెటు.

దాడి వీరభద్రరావు..దారెటు...
రాజమండ్రి, ఏప్రిల్ 29
అన్న గారి పుణ్యమాని ఆనాటి రాజకీయాల్లోకి మాస్టర్లు, డాక్టర్లు, లాయర్లు విరివిగా వచ్చారు. రాజకీయం అంటే నిశాని గాళ్ళదేనన్న దుస్సంప్రదాయాన్ని మొత్తం తుడిచిపెట్టేసి కొత్త తరం అలా వెలుగు చూసింది. నాటి నుంచి అది కొనసాగుతూ వస్తోంది. ఇపుడు అసెంబ్లీలో పెద్ద సంఖ్యలో విద్యావంతులు ఉన్నారంటే దానికి కారణం నాడు అన్న ఎన్టీఆర్ తీర్చి దిద్దిన ఒరవడేనని చెప్పాలి. ఇదిలా ఉండగా హిందీ మాస్టార్ గా ఉన్న దాడి వీరభద్రరావు ఎన్టీఆర్ పిలుపుని అందుకుని రాజకీయాల్లోకి వచ్చారు. పలు మార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా కూడా రాణించారు.ఇక వైసీపీలో దాడి వీరభద్రరావు 2012లో చేరారు. 2014 ఎన్నికల్లో కొడుకు రత్నాకర్ కి టికెట్ సాధించుకున్నారు. ఓడిపోగానే తిరిగి పార్టీకి గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోయారు. అయిదేళ్ళ అనంతరం ఆయన వైసీపీలో చేరినా కూడా ఈసారికి సారీ చెప్పేశారు, అలా టికెట్టూ దక్కలేదూ, ఏ రకమైన పోస్టూ చిక్కలేదు. ఇలా దాడి వీరభద్రరావు వైసీపీలో తన బాధలు తాను పడుతున్నారు. పెద్ద నోరు వేసుకుని చంద్రబాబును, టీడీపీని దారుణంగా తిడుతున్నా కూడా ఆయన వైపు జగన్ చూడడంలేదు.ఇక అనుకోని అవకాశంగా విశాఖ మేయర్ సీటు బీసీలకు రిజర్వ్ అయింది. దాంతో తన కుమారుడిని పెద్ద కుర్చీ ఎక్కించాలని దాడి మాస్టార్ పధక రచన చేశారు. అయితే దాడి వీరభద్రరావు సొంత నియోజకవర్గం అనకాపల్లిలో అయిదు కార్పొరేటర్ సీట్లు ఉంటే అన్నింటికి అన్నీ మహిళలకు రిజర్వ్ చేయించి అసలుకే ఎసరు పెట్టారని స్థానిక ఎమ్మెల్యే గుడివాడ అమర్నాధ్ మీద దాడి వీరభద్రరావు గుస్సా అవుతున్నారుట. ఎమ్మెల్యే గుడివాడ తన రాజకీయ జీవితానికి భవిష్యత్తులో దాడి కొడుకు అడ్డు వస్తారని భావించే ఇలా చేశారని దాడి వర్గం రగిలిపోతోంది. పోటీ చేసేందుకు అవకాశం లేకపోవడంతో దాడి మాస్టర్ సైతం స్థానిక ఎన్నికల వేళ పెద్దగా చడీ చప్పుడూ చేయడం లేదని అంటున్నారు.దాడి వీరభద్రరావు రాజకీయాల్లో ఉన్ననాటి రోజులు ఇపుడు లేవు. పైగా ఇపుడు ధన ప్రరవాహంతోనే కధ మొత్తం సాగుతోంది. మాస్టార్ డబ్బులు పెద్దగా విదల్చరు అని అంటారు. ఇక ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవం చూసి జడుసుకునే వారు వెన‌క్కి నెట్టేస్తున్నారు. తన జీవితం వరకూ ఒకే. వారసుడిగా కుమారుడి నిలదొక్కుకోవాలని దాడి వీరభద్రరావు చేస్తున్న ప్రయత్నాలు మాత్రం ఎప్పటికపుడు బెడిసికొడుతున్నాయి. ఇక నామినేటెడ్ పదవులు అయినా పార్టీలోని దాడి వీరభద్రరావు వ్యతిరేకులు దక్కనిస్తారా అన్న అనుమానాలు ఇపుడు కలుగుతున్నాయట. మొత్తానికి మాస్టారి రాజకీయ ఆట ఆగిందా, ఆయన్ని తొక్కేసే వారిదే పై చేయిగా ఉందా అంటే వైసీపీలో ఇపుడు అదే జరుగుతోందని అంటున్నారు.
 

Related Posts