డేరా బాబాను వదలొద్దు
ఛండీఘడ్, ఏప్రిల్ 29
డేరా బాబా ఈ పేరు అందరకి సుపరిచతమే. ఆయన మహిళలపై అత్యాచార కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. మూడేళ్ల క్రితం ఆయన జైలుకు వెళ్లారు. అయితే కరోనాను ఉపయోగించుకోవాలని డేరాబాబా చూస్తున్నారు. తనకు పెరోల్ ఇవ్వాలని, జైలులో తనకు కరోనా సోకే అవకాశముందని డేరాబాబా జైలు అధికారులకు విజ్ఞప్తులు మీద విజ్ఞప్తులు చేసుకుంటున్నారు. అయితే డేరా బాబాను బయటకు వదిలితే శాంతి భద్రతలకు విఘాతం కల్గే అవకాశాలున్నట్లు తేలడంతో జైలు అధికారులు నిరాకరించారు.గుర్మీత్ రామ్ రహీం సింగ్ అలియాస్ డేరా బాబా. ఈయన రా సచ్ఛా సౌదాకు గురువుగా ఉన్నారు. పంజాబ్, హర్యానాల్లో ఈ డేరాబాబాకు లక్షల సంఖ్యలో భక్తులు ఉన్నారు. డేరా బాబా 2017లో అత్యాచార కేసుల్లో అరెస్ట్ అయినప్పుడు కూడా శాంతిభద్రతలకు విఘాతం కల్గింది. వేల సంఖ్యలో డేరా బాబా భక్తులు పోలీసులపై దాడులకు కూడా దిగారు. భయానక వాతావరణాన్ని సృష్టించారు. మూడేళ్లుగా సునారియా జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఆయనకు న్యాయస్థానం యావజ్జీవ ఖైదు విధించారు. ఆయన గతంలో దరఖాస్తు చేసుకున్న బెయిల్ పిటీషన్లు అన్నీ తిరస్కరణకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో కరోనా దేశ వ్యాప్తంగా విస్తరిస్తుండటం, కొందరు ఖైదీలను పెరోల్ పై బయటకు పంపుతుండటంతో డేరా బాబా కూడా జైలు నుంచి పెరోల్ పై బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు.మూడు వారాల పాటు పెరోల్ ఇవ్వాలంటూ డేరా బాబా విజ్ఞప్తిని సునారియా జైలు అధికారులు తిరస్కరించారు. డేరా బాబాకు బెయిల్ ఇస్తే శాంతిభద్రతలకు భంగం కలుగుతుందని సిర్సా ఎస్పీ నివేదిక ఇచ్చారు. దీంతో డేరా బాబా పెరోల్ అభ్యర్థనకు జైలు అధికారులు నో చెప్పారు. డేరా బాబా తల్లి చేత పెరోల్ కు పిటీషన్ పెట్టించుకున్నారు. తనకు ఆరోగ్యం బాగాలేదని ఆయన తల్లి చేసిన అభ్యర్ధనను కూడా జైలు అధికారులు తిరస్కరించారు. డేరా బాబాకు పెరోల్ లభించే అవకాశాలు కరోనా సమయంలో కూడా లేనట్లేనని జైలు అధికారులు వెల్లడించారు.