YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

టీడీపీలో నెక్స్ట్ ఎవరు..

టీడీపీలో నెక్స్ట్ ఎవరు..

టీడీపీలో నెక్స్ట్ ఎవరు..
విజయవాడ, ఏప్రిల్ 29
టీడీపీలో ఇటీవ‌ల కాలంలో తెర‌మీదికి వ‌స్తున్న ప్రశ్న. చంద్రబాబుకు రీప్లేస్ ఉందా? అని. నిజానికి గ‌త ఏడాది ఎన్నిక‌ల వ‌ర‌కు కూడా చంద్రబాబు నాయ‌క‌త్వంపై ఎవ‌రూ ఎలాంటి అపోహ‌లు లేకుండా మాట్లాడారు. త‌మ ప‌నులు తాము చేయించుకున్నారు. కానీ, గ‌త ఏడాది జ‌రిగిన సార్వత్రిక ఎన్నిక‌ల స‌మరంలో చంద్రబాబు త‌న పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావ‌డంలో ఓడిపోయారు. నిజానికి పార్టీల‌న్నాక గెలుపు ఓట‌ముల‌కు అతీతంగా ఉండ‌వు. 2014లో ఇంకేముంది.. వైసీపీ అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ, ప్రజాతీర్పు మ‌రోర‌కంగా వ‌చ్చింది.గత ఏడాది ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ ఇదే జ‌రిగింది. రెండోసారి కూడా ప్రజ‌లు త‌మ‌నే ఎన్నుకుంటార‌ని చంద్రబాబు భావించారు. తాము ప్రవేశ పెట్టిన ప‌థ‌కాలు త‌మ‌ను ర‌క్షిస్తాయ‌ని అనుకున్నారు. ముఖ్యంగా రాజ‌ధాని నిర్మాణం.. త‌మ‌పార్టీకి కొండంత అండ‌గా ఉంటుంద‌ని అనుకున్నారు. కానీ ప‌రిస్థితి తిర‌గ‌తిప్పింది. ఊహించ‌ని ప‌రాజ‌యం ఎదురైంది. దీంతో చంద్రబాబు ప్రతిప‌క్షానికి ప‌రిమిత‌మ‌య్యారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఆయ‌న వ‌య‌సును ప‌రిగ‌ణ‌నలోకి తీసుకున్న కొంద‌రు పార్టీ నాయ‌కులు స‌హా అధికార ప‌క్షంలోని కొంద‌రు నాయ‌కులు చంద్రబాబు ఇక పార్టీ ప‌గ్గాలు వేరేవారికి అప్పగించాల్సిందే! అనే టాపిక్‌ను తెర‌మీదికి తెచ్చారు.నిజానికి ఈ మాట తెర‌మీదికి వ‌చ్చిన‌ప్పడు అంద‌రి చూపూ.. చంద్రబాబు త‌న‌యుడు లోకేష్ వైపు తిరుగుతుంది. ఎందుకంటే.. పార్టీకి జాతీయ ప్రధాన కార్యద‌ర్శిగా ఉన్నారు కాబ‌ట్టి. చంద్రబాబు త‌ర్వాత ఆయ‌నే టీడీపీ సైకిల్ ‌ను తిరిగి న‌డిపించాల్సి ఉంటుంది కాబ‌ట్టి. అయితే, ఇది సాధ్యమేనా? డ‌క్కాముక్కీలు తిన్న చంద్రబాబు సాటి లోకేష్ కాగ‌ల‌రా? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్రశ్న. ఎన్ని స‌మ‌స్యలు వ‌చ్చినా.. వాటిని ఎదురొడ్డి ప్రజ‌ల మ‌ధ్యకు వెళ్లిన చంద్రబాబుకు, ఆయ‌న విజ‌న్‌ను.. లోకేష్ అందుకోగ‌ల‌రా ? అనే ప్రశ్నకు ఇప్పట్లో స‌మాధానం చెప్పడం క‌ష్టం.ఎలాంటి రాజ‌కీయ అనుభ‌వం లేని లోకేష్‌ను ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేశారు చంద్రబాబు. మంత్రిగా ఉన్నప్పుడు రాజ‌కీయ అనుభ‌వం సంపాదించుకోవడం.. ప్రజ‌ల నాడి ప‌ట్టుకోవ‌డం కూడా లోకేష్ చేయ‌లేక‌పోయారు. ఓ జాతీయ పార్టీకి భ‌విష్యత్తులో కాబోయే రాజ‌కీయ వార‌సుడు, కాబోయే ముఖ్యమంత్రి అంటూ ప్రచారం ఉన్న వ్యక్తి కి ఇప్పుడు ఆయ‌న పోటీ చేసిన చోటే గెల‌వ‌లేక‌పోయార‌నే అప‌వాదు ఆయ‌న‌ను వెంటాడుతోంది.ఈ క్రమంలో చంద్రబాబుకు సాటిరాగ‌ల నాయ‌కుడు టీడీపీలో ఇప్పటి వ‌రకు అయితే లేర‌నే చెప్పాలి. అటు జాతీయ స్థాయిలోను, అంత‌ర్జాతీయ స్థాయిలోను కూడా చంద్రబాబు త‌న విజ‌న్‌ను, అనుభ‌వాన్ని జోడించి మంచి మార్కులు సంపాయించుకున్నారు. అలాంటి విజ‌న్ ఉన్న నాయ‌కుడు మాత్రమే టీడీపీ ని న‌డిపించ‌గ‌ల‌ర‌న‌డంలో సందేహం లేదు. కానీ, అలాంటి నాయ‌కుడు లోకేషా.? మ‌రెవ‌రైనా? అనేది కాలం నిర్ణయించాల్సిన అంశం. ఇప్పటికైతే.. చంద్రబాబుకు రీప్లేస్ లేద‌నే చెప్పాలి.
 

Related Posts