YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సాహిత్యం

దేవుడు చేసిన పెళ్ళి

దేవుడు చేసిన పెళ్ళి

“ఇవాళ మా అమ్మాయి పుట్టినరోజు, తమ ఆశీస్సులు తమ ఆశీస్సులు అర్థిస్తున్నాము”

1967 మే మాసంలో శ్రీవెంకటేశ్వర ఆలయం వద్ద చాతుర్మాస్యం జరుపుతున్న కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సర్స్వతి స్వామివారిని ప్రార్థించాము నేనూ, నా భార్యా, కుమార్తె లక్ష్మిని వెంతబెట్టుకు వెళ్ళి.

మా అమ్మాయి లక్ష్మి విజయవాడ మేరిస్టెల్లా కాలేజీలో ఆ సంవత్సరం బీఏ పూర్తిచేస్తున్నది. కాలేజికి సెలవులు కావడం వల్ల రోజూ స్నేహితురాళ్ళతో కలిసి వేంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి స్వామివారి చేసే చంద్రమౌళీశ్వరుని పూజలు చూస్తుండేది. సాయింత్రం స్వామివారి ప్రవచనాలు వింటూ ఉండేది. 

ఉయ్యూరు నివాసులు ఒకరు మా అమ్మాయిని చూసి, నా వద్దకు వచ్చి మాట్లాడారు. విదేశాల్లో ఇంజనీరింగ్ చదువుతున్న వారి అబ్బాయి సెలవుపై స్వదేశానికి తిరిగి వచ్చాడు. వివాహం చేసుకుని తిరిగి ఇంగ్లండుకు వెళదామనుకుంటున్నాడు. 

నేను వారితో ఇలా అన్నాను. “మీతో వియ్యమందడానికి మాకు ఇష్టమేగాని, వివాహం విషయంలో నాకు కొన్ని నియమాలున్నవి. వీటిని మీరు అంగికరించవలసి ఉంటుంది. వధూవరుల జాతకాలు సరిపోవాలి. నేనివ్వదలచిన కట్నం మీరు పుచ్చుకోవాలి. అన్నిటినీ మించి, మా గురుదేవులు శ్రీ కామకోటి స్వామివారి అనుమతి లభించాలి”

కాస్త రాయబాఅరం జరిగిన తరువాత ఉభయులకూ అన్నిటిపై సమాధానం కుదిరింది. 

స్వామివారప్పుడు ఏలూరులో మకాంలో ఉన్నారు. వెంటనే వెళ్ళి స్వామిని సందర్శించి, జరిగినదంతా సంగ్రహంగా విన్నవించాను. మౌనదీక్షలో ఉంటూనే మంత్రాక్షతలు ప్రసాదించి, వరదాభయహస్తంతో అనుమతించారు. 

ముఖ్యబంధువులందరూ ముందుగానె వచ్చారు. మిత్రులన్నిటా సహకరించారు. పెద్దలు పెట్టిన ముహూర్తానికి పెళ్ళి ముచ్చటగా జరిగింది. వేదవిధులూ, పండితులూ వధూవరులను ఆశీర్వదించారు. 

తలవని తలంపుగా జరిగిన ఈ కథంతా నెమరు వేసుకుంటే ఇది గురు కటాక్షమే తప్ప, మానవ ప్రయత్నం ఏమాత్రం కాదని నాకు రూఢి అయ్యింది. 

ఇది ఒక లీలగా కనిపిస్తే అంతకంటే అద్భుతావహం ఆ తరువాత జరిగిన ఘట్టం. 

వివాహం పూర్తి కాగానే నూతన దంపతులకు స్వామి దర్శనం చేయించి, శ్రీవారి ఆశీస్సులు అందజెయ్యాలి అనుకున్నాను. స్వామి అప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా క్షణముక్తేశ్వరంలో ఉన్నారని తెలిసింది. 

తక్షణం కారులో వధూవరులను వెంటబెట్టుకుని అక్కడికి బయలుదేరాను. ముక్తేశ్వరం చేరేసరికి అప్పుడే గోదావరి దాటడానికి స్వామి సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. డ్రైవరు కారు వేగం హెచ్చించాడు. స్వామి పల్లకిలో కూర్చున్నారు. బోయిలు పల్లకిని భుజాలకెత్తుకుని బయలుదేరబోతున్నారు. గబగబా నేను పల్లకి వద్దకు నడిచాను. 

నమస్కారం చేసి, “అల్లుణ్ణీ, అమ్మాయినీ వెంటబెట్టుకు వచ్చాను” అన్నాను. మందహాసం చేశారు స్వామి. పల్లకి ఆపారు బోయిలు. 

అల్లుడూ, కూతురూ స్వామికి ప్రణమిల్లారు. ఇన్ని అక్షతలు తీసి వరుడి ఉత్తరీయంలో పోశారు. పల్లకి బయలుదేరింది గోదావరి నదికేసి. 

మంచిరోజు చూసి వధూవరులిరువురూ ఇంగ్లండుకు పయనమైనారు. ఇంగ్లండుకు చేరినట్టు కేబుల్ కూడా వచ్చింది. 

ఆ తరువాత అల్లుడిగారిలో జరిగిన పరిణామమే ఆశ్చర్యజనకం. బాల్యంలో ఉపనయనమప్పుడు పురోహితులవద్ద నేర్చుకుని, ఎన్ని రోజులు సంధ్యవార్చారో ఏమోగాని, ఇంగ్లీషు చదువులు చదివిన ఆధునిక బ్రహ్మచారులు అనేకుల ధోరణిలో, ఈయనగారు కూడా అటుతరువాత సంధ్యకు స్వస్తి చెప్పడం సంభవించింది. 

అలాంటి యువకుడు వివాహానంతరం, స్వామిని సందర్శించిన తరువాత విదేశంలో రెండువేళలా సంధ్యవార్చడం ప్రారంభించాడు! 

కొంతకాలానికి చదువు ముగిసింది. బొంబైలో ఒక ప్రఖ్యాత ఇంజనీరింగ్ కంపెనీవారు, ఇంగ్లండులో చదివిన ఇంజనీరింగ్ పట్టభద్రులకు తమ కంపెనీలో ఉద్యోగాలిచ్చి ఇండీయాకు పిలిపించుకున్నారు. ఈ విధంగా సెలక్టు అయినవారిలో మా అల్లుడు ఒకరు. 

స్వదేశానికి తిరిగివచ్చినది మొదలుకుని, ఆయన త్రికాల సంధ్యావందనం, నిత్యాగ్నిహోత్రం చేస్తూ, ఉద్యోగంతో పాటే రోజుకు సుమారు ఆరుగంటలు అనుష్ఠానంలో ఉంటారు. 

పలు సంవత్సరాలు విదేశాల్లో నివసించి, వేషభాషల్లో పాశ్చాత్యులను అనుకరిస్తూ వచ్చిన ఈ నవనాగరికునిలో ఈ పరిణామం రావడానికి కారణభూతులెవ్వరో ప్రత్యేకించి నేను చెప్పక్కరలేదు. 

స్వామి ప్రకృతి శక్తులను వశపరచుకుంటారు. సృష్టికి ప్రతిసృష్టి చేస్తారు. విశేషించి, మానవ ప్రకృతినే మార్చివేస్తారు. దానవుడు మానవుడవుతాడు. నరుడు నారాయణుడౌతాడు!

Related Posts