హైద్రాబాద్ నగరంలో బస్తీ దవాఖానాలు ప్రారంభమయ్యాయి. మల్కాజ్‌గిరిలోని బీజేఆర్ నగర్‌లో బస్తీ దవాఖానను వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్ కలిసి ప్రారంభించారు. మలక్‌పేటలోని గడ్డిఅన్నారంలో, ఫలక్‌నూమాలోని హష్మాబాద్‌తో పాట పలు ప్రాంతాల్లో బస్తీ దవఖానాలు ప్రారంభమైనట్లు అధికారులు వెల్లడించారు. ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. వైద్యరంగంలో తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. నగరంలో వెయ్యి బస్తీ దవాఖానాల ఏర్పాటే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ఈ దవాఖానాల ఏర్పాటుతో లక్షలాది మందికి ఉపశమనం కలుగుతుందన్నారు. ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ నమోదు చేయబోతున్నామని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు నిర్వహిస్తామన్నారు. క్యాన్సర్‌ను ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు తీసుకొని.. ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. కేసీఆర్ కిట్ పథకం అమలు చేసిన తర్వాత ప్రభుత్వ ఆస్పత్రుల్లో 30 నుంచి 50 శాతానికి ప్రసవాల సంఖ్య పెరిగిందన్నారు. పేదలకు ప్రభుత్వం ఆరోగ్య భరోసా కల్పిస్తుందన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వైద్యం, విద్యకు ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి కేటీఆర్ ఉద్ఘాటించారు.