బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్‌ఖాన్ తరఫున లాయర్లు వేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణను జోధ్‌పూర్ కోర్టు శనివారానికి వాయిదా వేసింది. ఈ బెయిల్ పిటిషన్‌పై ఇరు వర్గాల వాదనలను విన్న న్యాయమూర్తి.. శనివారం తీర్పు చెప్పనున్నారు. మరోవైపు సల్మాన్ తరఫున బెయిల్ పిటిషన్‌పై వాదనలు వినిపించకూడదని తనకు బెదిరింపు సందేశాలు వచ్చినట్లు అతని తరఫు లాయర్ మహేష్ బోరా విచారణకు ముందు మీడియాతో చెప్పారు. నన్ను బెదిరిస్తూ ఎస్సెమ్మెస్‌లు, ఇంటర్నెట్ కాల్స్ వచ్చాయి. సల్మాన్ తరఫున బెయిల్ పిటిషన్‌పై వాదించకూడదని వాళ్లు నన్ను బెదిరించారు అని బోరా తెలిపారు. 20 ఏళ్ల కిందట రెండు కృష్ణ జింకలను వేటాడన్న కేసులో సల్మాన్‌కు ఐదేళ్ల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతను జోధ్‌పూర్ సెంట్రల్ జైల్లో ఉన్నాడు. ఓ బాలికను రేప్ చేసిన కేసులో ఇదే జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపు పక్క సెల్‌లోనే సల్మాన్ ఉన్నాడు.మరో వైపు ఐదేళ్ల జైలు శిక్ష పడటంతో సల్మాన్‌ఖాన్ తీవ్ర ఒత్తిడికి గురైనట్లు జైలు వర్గాలు వెల్లడించాయి. దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడని, సెల్‌లో ఏడ్చేశాడని జైలు అధికారులు తెలిపారు. మొదట సల్మాన్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. అతని బీపీ నార్మల్‌గానే ఉంది కానీ.. మానసికంగా కుంగిపోయాడు. జైల్లో అతను ఏడ్చాడు అని అధికారులు చెప్పారు. రాత్రి అన్నం కూడా తినలేదని తెలిపారు. శిక్ష పడుతుందని సల్మాన్ అసలు అనుకోలేదు. దీంతో అతను షాక్‌లో ఉన్నాడు. మిగతా ఖైదీలకు దూరంగా సల్మాన్‌ను ప్రత్యేక సెల్‌లో ఉంచాం. జోధ్‌పూర్‌లో జింకలను దేవతల్లాగా చూస్తారు. అందువల్ల సల్మాన్‌కు ఎలాంటి హాని జరగకూడదన్న ఉద్దేశంతో అతన్ని మిగతా ఖైదీలకు దూరంగా ఉంచామని అధికారులు వెల్లడించారు. అతనికి బెయిల్ కూడా రాకపోతే మరింత కుంగిపోయేలా ఉన్నాడని చెప్పారు.