Highlights
- వైద్య ఆరోగ్య సంస్కరణలు దేశానికే తలమానికం
- త్వరలో రాష్ట్రంలో ప్రతి వ్యక్తికీ హెల్త్ ప్రొఫైల్
- ఇంటింటికీ కంటి, రోగ నిర్ధారణ పరీక్షలు
- మంత్రులు కేటిఆర్, లక్ష్మారెడ్డి
తెలంగాణలో చేపట్టిన వైద్య ఆరోగ్య సంస్కరణలు దేశానికే తలమానికమన్నారు ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు. కెసిఆర్ మార్గ నిర్దేశనంలో, మంత్రి లక్ష్మారెడ్డి చొరవతో రాష్ట్ర ఆరోగ్యశాఖ గుణాత్మక మార్పులు తీసుకవచ్చిందన్నారు. నేను రాను బిడ్డో అని పాడుకునే రోజుల నుంచి నేను వస్త బిడ్డో సర్కార్ దవాఖానాకు అనే స్థాయిలో ప్రభుత్వ దవాఖానాల వైపు ప్రజలను ఆకర్షితులను చేయడం సామాన్య విషయం కాదన్నారు. మల్కాజీగిరి బి.జె.ఆర్ నగర్‌లో వైద్య ఆరోగ్యశాఖ-గ్రేటర్ హైదారాబాద్ కార్పొరేషన్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన బస్తీ దావఖానాను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మోహన్‌లతో కలిసి కెటిఆర్ ప్రారంభించారు.అనంతరం మంత్రి మాట్లాడుతూ, హైదరాబాద్ నగరంలో నిరుపేదలకు వైద్య సదుపాయలు అందించడానికి వెయ్యి బస్తీ దావఖానాలు ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. బిజెఆర్ నగర్‌తోపాటు మరో 17 బస్తీ దావఖానాలను నేటి నుంచి పనిని ప్రారంభిస్తాయన్నారు. మరో నెల రోజుల్లోగా 40 దావఖానాలను ప్రారంభించనున్నట్టు తెలిపారు. నగరంలో ప్రతి 10వేల మందికి ఒక దావఖానా చొప్పున వెయ్యి బస్తీ దావఖానాలను దశలవారిగా ప్రారంభిస్తామని వెల్లడించారు. ఈ దవాఖానాలు అందుబాటులోకి వస్తే బస్తీ ప్రజలకు మరింత చేరువగా వైద్య సేవలు అందుతాయన్నారు. వైద్య రంగంలో చేపట్టిన విప్లవాత్మకమైన పథకాలైన బస్తీ దావఖానాలు, పి.హెచ్.సిల ఆధునీకరణ, వెల్ నెస్ కేంద్రాలు, అందరికీ కంటి పరీక్షల నిర్వహణ, వ్యక్తిగత ఆరోగ్య వివరాల సేకరణ, 40 డయాలసిస్ కేంద్రాల ఏర్పాటు వల్ల దేశంలోనే తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య రంగంలో ఆదర్శవంతంగా నిలిచిందని, మంత్రి కె.టి.రామారావు అన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరుడి ఆరోగ్య వివరాల డిజిటల్ ప్రొఫైల్‌ను రూపొందించనున్నామని, ఈ విధమైన హెల్త్ ప్రొఫైళ్లు పాశ్చ్యత దేశాల్లోనే నిర్వహిస్తారని గుర్తుచేశారు. హెల్త్ ప్రొఫైళ్లను రూపొందించడం, విప్లవాత్మకమైన చర్య అని, ఇది దేశంలోనే వైద్య రంగంలో సరికొత్త చరిత్రకు నాంది పలకనుందని పేర్కొన్నారు. అదే విధంగా రాష్ట్రంలోని ప్రతిఒక్కరికి కంటి పరీక్షలు నిర్వహించే మరో చారిత్రాత్మక నిర్ణయం చేపట్టడం జరిగిందని, త్వరలోనే ప్రతిఒక్కరికి కంటి పరీక్షలు నిర్వహించి అవసరం ఉన్నవారికి శస్త్ర చికత్సలు కూడా చేయడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. కె.సి.ఆర్ కిట్‌లను ప్రవేశపెట్టడం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సంస్థాగత ప్రసూతిలు గణనీయంగా పెరిగాయని, 55శాతం వరకు ప్రసూతిలు ప్రభుత్వ దవాఖానాల్లోనే జరుగుతున్నాయని మంత్రి వివరించారు. దీంతో పాటు సీజేరియన్ శస్త్ర చికిత్సల సంఖ్య బాగా తగ్గాయని కె.టి.ఆర్ గుర్తుచేశారు. నిరుపేదలకు వివిధ పరీక్షల నిర్వహణకు త్వరలోనే తెలంగాణ రోగ నిర్థారణ పరీక్షల కేంద్రాలను ప్రారంభించనున్నామని మంత్రి వెల్లడించారు. ప్రభుత్వ వైద్యులు, సిబ్బంది పని తీరుని కెటిఆర్ అభినందించారు.వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి మాట్లాడుతూ నగరంలోని బస్తీల్లోని ప్రజలకు ఆరోగ్యపరమైన సలహాలు ఇవ్వడంతో పాటు ప్రాథమిక వైద్య చికిత్సలు అందించడం, ఆరోగ్య పరమైన అంశాలపై పూర్తిస్థాయి అవగాహన కల్పించేవిధంగా బస్తీదావఖానాలు పనిచేస్తాయని అన్నారు. కెసిఆర్ మార్గనిర్దేశనంలో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అద్భుత ప్రగతిని సాధించిందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకంటే నగర బస్తీల్లో జీవించే వారి ఆరోగ్య సమస్యలు క్లిష్టమైనవని మంత్రి చెప్పారు. ఇలాంటి వాళ్ళకు వైద్య సేవలు చేరువ కావడమేగాక, మెరుగ్గా అందుతాయని అందుకు బస్తీ దవాఖానాలు తోడ్పడతాయని చెప్పారు. కెసిఆర్ ఆశిస్సులతో భవిష్యత్తులో ప్రభుత్వ దవాఖానాలను మరింత గొప్పగా తీర్చిదిద్ది ప్రజలు మెరుగైన, సమర్థవంతమైన సేవలు అందించడానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులతోపాటు మల్కాజీగిరి ఎంపి మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే కనకారెడ్డి, డిప్యూటి మేయర్ బాబా ఫసియుద్దీన్‌లు,టిఎస్ఎంఎస్ఐడిసి చైర్మన్ పర్యాద కృష్ణమూర్తి, జిహెచ్ఎంసి కమిషనర్ జనార్దన్‌రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ వాకాటి కరుణ, స్థానిక కొర్పొరేటర్లు, వైద్య ఆరోగ్య, మున్సిపల్ శాఖల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.మరోవైపు ఫలక్‌నుమాలోని హషిమాబాద్, మలక్‌పేట గడ్డి అన్నారంలలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలను మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్, స్థానిక కార్పొరేటర్లు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.