YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

కన్నీరు తెప్పిస్తున్న ఉల్లి

కన్నీరు తెప్పిస్తున్న ఉల్లి

కన్నీరు తెప్పిస్తున్న ఉల్లి
కర్నూలు, మే 1
ఉల్లి చేసే మేలు తల్లికూడా చేయదంటారు. కానీ, ఉల్లి ని పండించే రైతుకు మాత్రం  ఎపుడు మేలు జరగడంలేదు. ఎందుకంటే పండించిన పంట చేతికొచ్చే సమయానికి ధర ఉండకపోవచ్చు.. లేదా అధిక వర్షాలతో పంట సరిగ్గా పండకపోవచ్చు. ఇలా ఏదో రూపంలో అన్నదాతను ఉల్లి వెక్కిరిస్తోంది. ఈఏడాది ఉల్లికి మంచి ధర ఉండటంతో కర్నూలు జిల్లాలో రైతన్నలు ఆ పంటపై మక్కువ చూపారు. పంట చేతికొచ్చే సమయానికి కరోనా రూపంలో ఉల్లి రైతును నట్టేట ముంచింది.. లాక్ డౌన్  కారణంగా పండించిన పంటకు మార్కెట్ కు తరలించలేక ఉల్లిని పొలంలోనే వదిలేసిన పరిస్థితి ఇపుడు కర్నూలు జిల్లాలో ఏర్పడింది... ఉల్లిని నమ్ముకుని జీవిస్తున్న అన్నదాత కష్టాలు అన్నీ ఇన్నీకావు. ఎంతో కష్టపడి పండించిన ఉల్లి పంటను పొలంలోనే గొర్రెలు, మేకలు తినేందుకు వదిలేసిన దుస్థితి కర్నూలు జిల్లా రైతులకు ఏర్పడింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర  వస్తుందని ఆశతో ఎదురు చూసిన రైతుకు అడియాశలయ్యాయి.  చేతికి వచ్చిన ఉల్లి పంటను మార్కెట్ కు తరలించి చేసిన అప్పులను తీర్చేద్దామని భావించిన అన్నదాత మళ్ళీ అప్పులపాలయ్యాడు.  కర్నూలు జిల్లాలో ఎక్కువ శాతం పండించే పంట ఉల్లి.. అందులోనే పశ్చిమ ప్రాంతాలు ఆలూరు, కోడుమూరు, ఆదోని,పత్తికొండ నియోజకవర్గాల్లో ఎక్కువగా ఉల్లి పంటపైనే ఆధార పడి జీవిస్తారు.ముఖ్యంగా పత్తికొండ నియోజకవర్గ పరిధిలో  దాదాపుగా ఐదు నుంచి 600 హెక్టార్లలో రైతులు ఉల్లి సాగు చేశారు. తీరా పంట చేతికి వచ్చే సరికి ఒక్కసారిగా రేటు పడిపోయింది. క్వింటం ఉల్లి 500 రూపాయలకు పడిపోయింది.  గతేడాది నవంబర్, డిసెంబర్ నెలలో రాష్ట్రంలో నే కర్నూలు జిల్లాలో క్వింటాల్ ఉల్లి పదివేలకు పైగా పలికింది. దీంతో అన్నదాతలు ఈసారి  కూడా ఉల్లి పంటను నమ్ముకున్నారు.. వేల ఎకరాలలో పంటను  వేశారు. ఒక ఎకరా పంట ఉల్లి సాగు చేయాలంటే 50 వేలనుంచి 80వేల రూపాయలు పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. దీంతో రైతులు అప్పోసోప్పో చేసి ఉల్లి పై మమకారంతో పంటను వేశారు. కానీ పంట చేతికొచ్చే సమయంలో ఎక్కడో చైనా దేశంలో పుట్టిన కరోనా వైరస్ యావత్తు దేశాల అన్నింటినీ వెన్నులో వణుకు పుట్టిస్తుంది.  రైతు గుండెల్లో దడ పుట్టించింది.. కరోనా కట్టడికి కోసం కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ అన్ని రాష్ట్రాలలో కొనసాగింది.దీంతో రైతు పండించిన పంటకు కూడా లాక్ డౌన్ ప్రభావం పడింది. ఇప్పటికే మూలిగే నక్క పై తాటికాయ పడ్డట్టు ఆరుగాలం కష్టపడి పండించిన పంట కు లాక్ డౌన్ అమలులోకి రావడంతో రైతు పరిస్థితి అగమ్యగోచరంగా తయారయింది. రైతులు పండించిన ఉల్లి పంట రేటు ఒక్కసారిగా పడిపోవడంతో ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో జిల్లా రైతులు దిక్కులు చూస్తున్నారు. ప్రస్తుత ఉన్న ఉల్లి రేటుకు రైతు పెట్టిన పెట్టుబడి రాని పరిస్థితి ఏర్పడింది. దూర ప్రాంతమైన తాడేపల్లెగూడెంకు ఉల్లి తీసుకుపోదామని అనుకున్నా లారీ బాడుగ రాదేమో..? అని రైతు దిగాలు చెందుతున్నాడు. కర్నూలు లో ఉన్న మార్కెట్ అమ్ముదామంటే మరీ తక్కువ రేటుకు ఉల్లిని అడుగుతున్నారని  రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు కరోనా భయం... మరోవైపు ఉల్లి రేటు లేదనే ఆందోళనతో  రైతులు కాలం వెళ్లదీస్తున్నారు. ప్రభుత్వం ఉల్లి రైతులను రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించి  ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

Related Posts