YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

నిలిచిపోయిన కూరగాయల రవాణా

నిలిచిపోయిన కూరగాయల రవాణా

నిలిచిపోయిన కూరగాయల రవాణా
విజయవాడ, మే 1
ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు పెరగడంతో లాక్ డౌన్ ఖచ్చితంగా అమలుచేస్తున్నారు పోలీసులు. విజయవాడ నుండి కూరగాయల రవాణాను తాత్కాలికంగా నిలుపుదల చేశారు. విజయవాడ నుండి మచిలీపట్నంకు  కూరగాయలు రవాణాను నిలుపుదల చేశామని, కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా కీలక నిర్ణయం తీసుకున్నామని బందరు డివిజన్ టాస్క్ ఫోర్స్ కమిటీ తెలిపింది. బందరుఆర్డీఓ ఖాజావలీ అధ్యక్షతన సమావేశమైన టాస్క్ ఫోర్స్ అధికారులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇటీవల నూజివీడులో విజయవాడ  నుండి కూరగాయలు తీసుకువచ్చిన ఓ డ్రైవర్ కు కరోనా పాజిటివ్ రావటంతో అప్రమత్తమయ్యారు అధికారులు. ఇకపై విజయవాడ నుండి కాకుండా ఏలూరు, అవనిగడ్డ నుండి కూరగాయలు తెప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఈ మేరకు మచిలీపట్నం రైతుబజారు ఎస్టేట్ ఆఫీసర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. లాక్ డౌన్ వేళ దాతల ద్వారా నిరుపేదలకు ఫుడ్ ప్యాకెట్స్, నిత్యావసరాలు, కూరగాయలు పంపిణీకి కూడా బ్రేక్ లు పడ్డాయి.  అలాగే, మాంసాహార విక్రయాల్లో కూడా కొత్త ఆంక్షలు అమలులోకి వచ్చాయి. కేవలం చికెన్, మటన్ అమ్మకాలకే అనుమతిచ్చారు. చేపలు, ఇతర మాంసాహారాల విక్రయాలపై పూర్తి నిషేధం విధించింది ప్రభుత్వం. ప్రభుత్వం నిర్ధేశించిన ధరలు కాదని  నిత్యావసర వస్తువులు అమ్మకాలు చేస్తే షాప్ మూసివేయటంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామంటున్నారు. రెడ్ జోన్ లు నిత్యావసర దుకాణాలు కాకుండా ఏ దుకాణం తెరిచినా చర్యలు తీసుకుంటామని ఆర్డీవో తెలిపారు. ఇటు గుంటూరు జిల్లాలో లాక్ డౌన్ ఆదేశాలను బేఖాతరు చేసేవారిపై కఠినచర్యలు తీసుకుంటున్నారు. నరసరావుపేటలో రోజురోజుకీ కరోనా కేసుల ఉధృతి పెరుగుతుండటంతో కలెక్టర్‌ ఆదేశాల మేరకు డివిజన్‌ మొత్తం రెండు రోజులపాటు పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ నేపథ్యంలో చిలకలూరిపేట ప్రాంతంలో బుధవారం లాక్‌డౌన్‌ పటిష్టంగా అమలు చేశారు. అన్ని మార్గాలలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. అర్బన్‌, రూరల్‌ సీఐలు  సూర్యనారాయణ, ఎం సుబ్బారావుల ఆధ్వర్యంలో ఎస్‌ఐలు రాంబాబు, అసన్‌, నారాయణరెడ్డి, నాగేశ్వరరావులు బందోబస్తు పర్యవేక్షించారు.మరోవైపు రాష్ట్రంలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదు కావడం వల్ల కంగారు పడక్కర్లేదని వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ డా.కె.ఎస్‌.జవహర్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఎక్కువ టెస్టులు చేస్తున్నాం కాబట్టే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని,  అయితే కేసుల సంఖ్య ముఖ్యం కాదని,  ఇన్ఫెక్షన్‌ ఉన్న ప్రతి ఒక్కరినీ గుర్తించి వారిని.. ఆస్పత్రిలో వైద్యం అందిస్తే మిగతా వారికి వైరస్‌ సోకకుండా కాపాడుకోగలమని వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ డా. కె.ఎస్‌. జవహర్‌ రెడ్డి అన్నారు. ప్రస్తుతం 200 క్లస్టర్లలోనే కేసులు నమోదవుతున్నాయన్నారు. వాటిలో 50 క్లస్టర్లలోనే యాక్టివ్‌ కేసులు వున్నాయన్నారు. 70 క్లస్టర్లలో 14 రోజులుగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదని, మరో 50 క్లస్టర్లలో ఐదు రోజులుగా కేసులు నమోదు కాలేదన్నారు జవహర్ రెడ్డి.

Related Posts