YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

కరీంనగర్‌లో నిబంధనల పట్టింపులేదు.. ఇష్టారాజ్యమే!

కరీంనగర్‌లో నిబంధనల పట్టింపులేదు.. ఇష్టారాజ్యమే!

కరీంనగర్‌లో ఇళ్ల నిర్మాణం జోరుగా సాగుతోంది. ఇంత వరకూ బాగానే ఉన్నా.. పలు నిర్మాణాలు నిబంధనలకు అనుగుణంగా లేనట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్న అధికారులు పర్యవేక్షణను సీరియస్‌గా తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితులు తలెత్తాయని అంటున్నారు. అధికారుల ఉదాసీనత వల్లే అనేక నిర్మాణాలకు రోడ్లపైకీ వచ్చేస్తున్నాయని చెప్తున్నారు. నిబంధనల ప్రకారం రోడ్డుకు వదలాల్సిన సెట్‌బ్యాక్‌ వదలకపోవడం, రహదారికి ఆనుకునే ర్యాంపులు నిర్మించుకోవడం, రోడ్డును దర్జాగా కబ్జా చేసుకోవడం వంటివి అధికమయ్యాయని వ్యాఖ్యానిస్తున్నారు. నిబంధనల ప్రకారం కొత్తగా భవన నిర్మాణాలు చేపడితే భవిష్యత్తు అవసరాలు దృష్టించి లోపలికి జరిగి ఇళ్లు నిర్మించుకోవాలి. పట్టణ ప్రణాళిక ప్రకారం కనీసం నిర్మించే ప్లాట్‌ ఏరియా స్థలాన్ని బట్టి 200 మీటర్ల లోపు అయితే రోడ్డు వైపు ఐదు అడుగులు, మిగతా మూడు వైపుల 3.3 అడుగులు రహదారి కోసం విడిచి పెట్టాలి. 100 మీటర్ల స్థలమైతే రోడ్డు వైపు 5 అడుగులు, మిగతా వైపుల 2 అడుగులు వదలాలి. అయితే ఎక్కువ వీధుల్లో నిబంధనల మేరకు స్థలాన్ని వదలడం లేదు.

కొత్తగా నిర్మిస్తున్న భవనాలు, ఇళ్లు సెట్‌బ్యాక్‌ లేకుండా పనులు చేస్తున్నారు. దీంతో స్థానికుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. భవన అనుమతుల సమయంలోనే రోడ్డుకు వదలాల్సిన స్థలాన్ని అనుమతుల పత్రంలో పక్కాగా పేర్కొంటారు. ఆ మేరకు నిర్మాణాలు చేపట్టాలి. రహదారి పరిధిలోకి వచ్చే స్థలాన్ని వదలకుండా ప్రస్తుతం ఉన్న పాత స్థలంలోనే యథావిధిగా శ్లాబులు వేయడం, మెట్లు కట్టడం, ప్రహరీలు నిర్మించుకోవడం వంటివి చేస్తున్నారు. కొన్ని ఇళ్లకు తప్ప ఎక్కడా రోడ్డుకు స్థలాన్ని వదలడం లేదు. ఫలితంగా ఇదో సమస్యగా పరిణమించింది. నిర్మాణాలకు అనుమతులు జారీ చేసిన అధికారులు పర్యవేక్షణ కూడా జరిపితే ఇలాంటి సమస్యలు రావని అంతా అంటున్నారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి ఈ తరహా చర్యలు తీసుకోవాలని లేదంటే భవిష్యత్‌లో దారులు ఇరుకుగా మారిపోయే పరిస్థితి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. నిబంధనల ప్రకారమే నిర్మాణాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టంచేస్తున్నారు.

Related Posts