YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఎవరు స్లీపర్ సెల్స్..ఎవరు సూపర్ స్ప్రెడర్లు

ఎవరు స్లీపర్ సెల్స్..ఎవరు సూపర్ స్ప్రెడర్లు

ఎవరు స్లీపర్ సెల్స్..ఎవరు సూపర్ స్ప్రెడర్లు
విజయవాడ, మే 1
నాయకుల్లో అసహనం పెరిగిపోతోంది. ఇంకెన్నాళ్లు కరోనా పేరు చెప్పి నోరు మూసుకుని కూర్చోవాలని తెగ బాధ పడిపోతున్నారు. క్రమేపీ రోడ్డెక్కుతున్నారు. ప్రజలు ఏమైనా అనుకుంటారేమోనని కొంత కాలంగా సంయమనం పాటిస్తూ వస్తున్నారు. అప్పుడప్పుడూ విమర్శలు గుప్పించుకున్నప్పటికీ తీవ్రత మరీ ఎక్కువ కాకుండా జాగ్రత్త పడుతూ వచ్చారు. కరోనా లాక్ డౌన్ టైమ్ కావడంతో ప్రజల కోసమే తాము స్పందిస్తున్నామన్న భావన చెరిగిపోకుండా జాగ్రత్త పడ్డారు. రెండో దశ ముగింపునకు వస్తున్న తరుణంలో నాయకులు ఆగలేకపోతున్నారు. ఇన్నిరోజుల ఓపికను పక్కనపెట్టి ఒక్కసారిగా జూలు విదల్చాలనుకుంటున్నారు. అందులో భాగమే వైసీపీ, టీడీపీల ఆరోపణల పర్వం. పరస్పరం స్లీపర్ సెల్స్, సూపర్ స్ప్రెడర్స్ అభియోగాలు. ప్రజారోగ్యానికి పూచీకత్తుగా నిలవాల్సిన పార్టీలు తమ దుందుడుకు ధోరణితో ప్రజల్లో పలచనైపోతున్నాయి. ఓట్లపరంగా చూస్తే రాష్ట్రంలో తొంభైశాతం ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీల బాధ్యతారాహిత్యం కరోనా వంటి విషమ పరిస్థితుల్లోనూ రాజకీయ వైరాలనే రగులుస్తోంది.ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు ధోరణి ని రాజకీయ తటస్థులు అతి జాగ్రత్తకు మారుపేరుగా చెబుతారు. ప్రతి విషయాన్ని భూతద్దంలో చూస్తూ అవసరానికి మించి ప్రవర్తించడం టీడీపీ అధినేత నైజంగా పేర్కొంటారు. విపత్తులను డీల్ చేయడంలో చంద్రబాబుకు మంచి ట్రాక్ రికార్డుంది. అయితే క్షేత్ర స్థాయిలో ఇతరులెవరూ తనంతగా కష్టపడరనే భావన కల్పిస్తారాయన. జిల్లాల్లో కలెక్టర్లు, ఉన్నతాధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు చేయాల్సిన పనులపై సైతం తన ముద్ర మాత్రమే ఉండేలా చంద్రబాబు హడావిడి చేసేవారు. దీని కారణంగానే చంద్రబాబు ఎవరి పని వారిని చేయనీయరు. అన్నీ తానే చేస్తున్నట్లు కనిపించాలని తాపత్రయపడతారనే భావన ఆ పార్టీ వర్గాలు, అధికార యంత్రాంగంలో నెలకొంది. అయితే సంక్షోభం ఏర్పడినప్పుడు మాత్రం ఆయన చూపే చొరవ , వేగం కచ్చితంగా యంత్రాంగం గుండెల్లో రైళ్లు పరిగెట్టించేవి. తాజాగా కరోనా విషయంలో అధికారపార్టీ ప్రతినిధులు కొన్ని తప్పులు చేస్తూ వస్తున్నారు. దీనిని చంద్రబాబు నాయుడు రాజకీయ కోణంలో చక్కగా మలచుకుంటున్నారు. కరోనా వైరస్ వ్యాప్తికి వైసీపీ నేతలు కారకులుగా నిలుస్తున్నారంటూ ఎత్తి చూపుతున్నారు. వైసీపీ నేతలు అత్యుత్సాహంతో జాగ్రత్తలు మరిచి పేరుకోసం హడావిడి చేస్తున్న మాట వాస్తవం. అయితే తెలుగుదేశం పార్టీ తన వంతు సేవను మరిచి అధికారపార్టీ లోపాలపైనే దృష్టి పెడుతోంది.ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కరోనాను డీల్ చేయడంలో విమర్శలను ఎదుర్కొంటున్నారు. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం చేసే ఆరోపణలను పట్టించుకోకపోయినా ఫర్వాలేదు. కానీ తొలి నుంచి ఈ వైరస్ విషయంలో అజాగ్రత్తగానే ఉన్నారని తటస్థులు సైతం విమర్శిస్తున్నారు. ప్రపంచాన్నంతటినీ గడగడలాడిస్తున్న వైరస్ విషయాన్ని తేలికగా తీసుకోవడం ఆంధ్రప్రదేశ్ లోనే కనిపిస్తుంది. ముఖ్యమంత్రి ప్రజలను భయపెట్టకూడదని , భరోసానిచ్చేందుకే అలా మాట్టాడుతుంటారని ఆ పార్టీ నేతలు చెబుతుంటారు. కానీ ముఖ్యమంత్రి శైలి, మాట్లాడే విధానాన్ని బట్టి చూస్తే కరోనా సీరియస్ అంశం కాదనే ధోరణి వ్యక్తమవుతూ ఉంటుంది. దీనిని అలుసుగా తీసుకునే దిగువస్థాయి వైసీపీ నాయకులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. తొలి నాళ్లలో కనబరిచిన అజాగ్రత్తయే ఇందుకు కారణంగా చెప్పుకోవాలి. టీడీపీ స్లీపర్ సెల్స్ ఈ వ్యాధి ముదరడానికి కారణమేమోనంటూ బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మంత్రి వ్యాఖ్యానించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కరోనా వంటి పెను ప్రమాదాన్ని రాజకీయ కోణంలో మలచి దుమ్మెత్తి పోసుకుంటే కలిసొచ్చేదేమీ ఉండదు. సర్కారుకే చిన్నతనం.కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంటూ మార్గదర్శకాలు రూపొందిస్తోంది. హాట్ జోన్లు, ఆరంజ్ జోన్లు, గ్రీన్ జోన్లకు జిల్లాల పరిధులే ప్రమాణంగా తీసుకోబోతున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ కు అశనిపాతంగా మారబోతోంది. పెద్దజిల్లాలతో కూడిన రాష్ట్రం కావడంతో విజయనగరం మినహా అన్ని జిల్లాలు రెడ్ జోన్ల పరిధిలోకే వస్తున్నాయి. అందువల్ల మే మూడు తర్వాత సైతం కేంద్రం ఆంక్షల పరిధిలోకి ఈ జిల్లాలు రావచ్చు. అంటే పూర్తి స్థాయి ఆర్థిక చక్రం కదలదు. అదే సమయంలో తెలంగాణ 33 జిల్లాలుగా వికేంద్రీకరించుకోవడంతో కేవలం మూడు నాలుగు జిల్లాలకు మాత్రమే ఆంక్షలు పరిమితమవుతాయి. దానివల్ల రాష్ట్రం తొందరలోనే కుదుటపడే చాన్సులున్నాయి. ఆంధ్రప్రదేశ్ కు ఆ సూచనలు కనిపించడం లేదు. దీని విషయమై ఈ తరహా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్రాలతో కలిసి కార్యాచరణ రూపొందించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి. కేంద్రంపై ఒత్తిడి పెంచాలి. రాష్ట్ర రాజకీయాలను, ప్రతిపక్షంతో పేచీలను కొంతకాలం పక్కనపెట్టి కేంద్రం నుంచి సాధ్యమైనన్ని మినహాయింపులు తెచ్చుకోవాలి. రాష్ట్రంలో 20 శాతం ప్రాంతంలోనే కరోనా తీవ్రత ఉంది. కానీ కేంద్ర నిబంధనలు అమలు చేస్తే పదిశాతం ప్రాంతంలో కూడా కార్యకలాపాలు మొదలు కావు. దీనిని ఎదుర్కోవడానికి, ప్రత్యామ్నాయం వెదుక్కోవడానికి తక్షణం రాష్ట్రప్రభుత్వం యోచన చేయాలి. ఇప్పటికే అంతంతమాత్రంగా ఉన్న ఆర్థిక పరిస్థితి కుదేలు కాకుండా చూసుకోవాలి. దేశం మొత్తాన్ని కేంద్రం ఒకే కోణంలో చూస్తుంది. ఆంధ్రప్రదేశ్ ను ప్రత్యేకంగా చూసే అవకాశం లేదు. అందువల్ల ఈ తరహా ఇబ్బందులున్న రాష్ట్రాలన్నిటినీ కలుపుకుంటే ఒక మోడల్ రూపొందుతుంది. దానిని కేంద్రం చేత అమలు చేయించుకోవడానికి ఆస్కారం ఉంటుంది.

Related Posts