కిమ్ జోంగ్ వారసురాలు యో జోంగే
ప్యాంగాంగ్, మే 1
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ మరణంపై మిస్టరీ ఇంకా వీడలేదు. ఆయన చనిపోలేదని దక్షిణ కొరియా మాత్రం చెబుతుండగా, ఉత్తరకొరియా మాత్రం దీనిపై పెదవి విప్పడం లేదు. గత ఇరవై రోజులుగా కిమ్ బయట ప్రపంచానికి కన్పించకపోవడమే దీనికి కారణం. అయితే కిమ్ బతికే ఉన్నాడని కొన్ని ఆధారాలు బయటపడ్డాయి. తాజాగా కిమ్ ఓ రిసార్ట్ లో విశ్రాంతి తీసుకుంటున్నారని ఉత్తర కొరియా ప్రభుత్వం స్పష్టం చేసింది. అక్కడి నుంచే కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని తెలిపింది.ఉత్తరకొరియాలో ఏం జరుగుతుందన్నది ప్రపంచానికి పెద్దగా తెలియదు. ఎందుకంటే ఇక్కడ ఫోన్లు ఉపయోగించడం నేరం. ఇంటర్నెట్ వాడకం కూడా నిషేధం. కేవలం ప్రభుత్వంలో ఉన్న అతి కొద్ది మందికే ఇంటర్నెట్ సేవలు లభిస్తాయి. ఇక టీవీలు కూడా రెండు, మూడే ఉన్నాయి. వీటిల్లో కూడా స్థానిక వార్తలే తెలుస్తాయి. అంటే ఉత్తరకొరియా ప్రజలకు ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియదు. అలాగే ఉత్తరకొరియాలో ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలియకుండా కిమ్ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు.అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ బతికే ఉన్నారని కొన్ని వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే కిమ్ మనస్తత్వానికి ఇన్ని రోజులు మౌనంగా, అజ్ఞాతంలో ఉండే ప్రసక్తి లేదని ఆయన బాగా తెలిసిన వారు చెబుతున్నారు. అయితే కిమ్ లేకపోయినా ఆ తర్వాత దేశ పగ్గాలను కిమ్ సోదరి కిమ్ యో జోంగ్ చేపడతారన్న ప్రచారం బాగా ఉంది. ఇప్పటికే కిమ్ తన సోదరిని రాజకీయంగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టారు. మొన్నటి వరకూ కిమ్ కు సలహాదారుగా ఉన్న యోంగ్ కు పెద్ద పదవిని కట్టబెట్టారు. తనకు గుండె శస్త్ర చికిత్స జరగక ముందే కిమ్ తన సోదరికి ీఅత్యున్నత స్థానాన్ని కల్పించడం చర్చనీయాంశమైంది.ఇప్పుడు ఉత్తరకొరియాలో పాలన చేస్తుంది కిమ్ సోదరి కిమ్ యో జోంగ్ మాత్రమేనని చెబుతున్నారు. పార్టీలో కీలక సభ్యురాలిగా ఉన్న కిమ్ యో జోంగ్ ప్రస్తుతం ఉత్తర కొరియా పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ట్రంప్ తో గతంలో జరిగిన చర్చల్లో కూడా కిమ్ యో జోంగ్ పాల్గొన్నారు. ఒకవేళ కిమ్ అనారోగ్యం పాలయితే ఆయన స్థానంలో సోదరికి పగ్గాలు దక్కేలా కిమ్ జోంగ్ ఉన్ అన్ని చర్యలు తీసుకున్నారని చెబుతున్నారు. కిమ్ జోంగ్ ఉన్ కు ఇద్దరు సోదరులు ఉన్నా వారు రాజకీయాలకు దూరంగా ఉన్నారు.