YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పౌష్టికాహారం అందేదెన్నడు?

పౌష్టికాహారం అందేదెన్నడు?

పేద విద్యార్ధులకు నాణ్యమైన విద్యనందించేందుకు తెలంగాణ సర్కార్ కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే ఆశ్రమ పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇక్కడి విద్యాబోధనతో పాటూ ఈ పాఠశాలలకు అనుసంధానంగా ఉండే వసతి గృహాల్లోనూ మెరుగైన పరిస్థితులు ఉండేలా చర్యలు తీసుకుంటోంది. విద్యార్ధులకు మంచి చదువుతో పాటూ పౌష్టికాహారం అందించేందుకు కృషి చేస్తోంది. పిల్లలకు ఇడ్లీ, చపాతీలతో పాటూ మాంసాహారం అందించేందుకు చర్యలు తీసుకుంది. అయితే వీటికి సంబంధించిన వంట పాత్రలు, యంత్రాల కొనుగోలే సక్రమంగా లేనట్లు కుమురం భీం జిల్లాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. పాత్రలు, గ్రైండర్లు ఇతర పరికరాలు కొనుగోలు చేసి సరఫరా చేయాలంటూ రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ జిల్లా గిరిజన సంక్షేమ విభాగానికి సూచించింది. దీనికి కోసం నిధులు సైతం విడుదల చేసింది. అయితే జీసీసీ, జిల్లా గిరిజన సంక్షేమశాఖల మధ్య సమన్వయ లోపం వల్ల పాత్రల కొనుగోలు ఆలస్యమవుతోంది. నిధులు మంజూరై చాలాకాలమే అయినా వినియోగించుకోకపోవడం అధికారుల ఉదాసీనత, అలసత్వానికి నిదర్శనమని విద్యార్ధి సంఘం నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఆర్ధిక సంవత్సరం కూడా ముగిసిపోవడంతో నిధులు మురిగిపోయాయని చెప్తున్నారు. కుమూరం భీం జిల్లాలో 46 గిరిజన పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 12,327 మంది విద్యార్ధులు విద్యనభ్యసిస్తున్నారు. వీరు ఉండే హాస్టళ్లలో వంట సామాగ్రి కొనుగోలుకు రూ.14.50లక్షలు మంజూరు చేశారు. ఉమ్మడి జిల్లా మొత్తానికి రూ.45.10లక్షలు కేటాయించారు. ఒక్క కుమురం భీం జిల్లాలోనే కాక ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్‌లోనూ ఇదే పరిస్థితి ఉన్నట్లు సమాచారం. సరైన వంట పాత్రలు లేకపోవడంతో విద్యార్ధులకు డైట్ ఛార్ట్ సక్రమంగా అమలు కావడంలేదు. నిధులు ఎప్పుడో ఇచ్చినా విద్యాసంవత్సరం చివరి దశకు చేరుకున్న సమయానికీ పాత్రలు కొనలేదు అధికారులు. దీంతో అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికార యంత్రాంగం స్పందించి వంట పాత్రలు కొనుగోలు చేయాలని.. కనీసం వచ్చే విద్యాసంవత్సరంలో అయినా పిల్లలకు ప్రభుత్వ సూచించిన డైట్ అందించాలని డిమాండ్ చేస్తున్నారు.

Related Posts