మిల్లర్ల దోపిడీ.. మండిపడుతున్న రైతులు
కరీంనగర్, మే 1
ధాన్యం కొనుగోలు సీజన్ వచ్చిదంటే రైస్ మిల్లర్లకు పండుగ. కష్టపడి పంట పండించిన రైతులకు మద్దతు ధర అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. మిల్లర్లు మాత్రం తాలుపేరిట దోచుకుంటున్నారు. 40 కిలోల బస్తాకు అదనంగా 2 కిలోలు తూకం వేస్తూ దండుకుంటున్నారు. అధికారుల మౌఖిక ఆదేశాలతోనే అదనంగా 2 కిలోలు తూకం వేస్తున్నామంటూ నిర్వాహకులు రైస్ మిల్లర్లకు పరోక్షంగా సహకరిస్తున్నారు. కరీంనగర్ మండలం రబీ సీజన్‌లో 6,396 ఎకరాల్లో వరిపంట సాగు చేయగా 2 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తోందని అధికారులు అంచనా వేశారు. 20 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయి తే పలు గ్రామాల్లో పంట చివరిదశలో అగ్గితెగులు, మెడవిరుపు ఆశించడంతో గింజలు వట్టిపోయాయి.తాలుపేరిట జూబ్లీనగర్, నగునూర్ గ్రామాల్లో ధాన్యం తూకం వేయడం లేదంటూ ఇటీవల రైతులు ఆందోళన చేపట్టారు. ఈనెల 24న దుర్శేడు కొనుగోలు కేంద్రంలో 42 కిలోలు తూకం వేయడంపై రైతులు నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. సాధారణంగా 40 కిలోల చొప్పున వడ్ల బస్తాను తూకం వేస్తారు. సంచి బరువు 600 గ్రాముల నుంచి 800 గ్రాముల వరకు ఉండటంతో కిలో అదనంగా ధాన్యం కాంటా వేస్తారు. అయితే దుర్శేడు సహకార సంఘం పరిధిలోని ఇరుకుల్ల, మొగ్దుంపూర్, గోపాల్‌పూర్, నల్లగుంటపల్లి, చేగుర్తి కొనుగోలు కేంద్రాల్లో తాలుపేరిట మొత్తం 42 కిలోల ధాన్యం కాంటా పెడుతున్నారు. మేలు రకం ధాన్యం తెచ్చినా అదనంగా 2 కిలోలు తూకం వేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాలుపేరిట మిల్లర్లు దోచుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. అధికారుల మౌఖిక ఆదేశాలతో తాలుంటే అదనంగా 2 కిలోలు తూకం వేస్తున్నట్లు సంఘం ఉద్యోగి తెలిపాడు.