YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

జోరుగా విత్తనోత్పత్తి...!!

జోరుగా విత్తనోత్పత్తి...!!

తెలంగాణ ప్రాంతాన్ని విత్తన ఉత్పత్తి కేంద్రంగా మలచేందుకు ప్రభుత్వం కృషిచేస్తోంది. దీనిలో భాగంగానే నిర్మల్‌ జిల్లాలో విత్తనశుద్ది ప్లాంట్లను ఏర్పాటు చేశారు. తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ గతంలో పొచ్చెర, ఇచ్చోడ, నిర్మల్‌ కేంద్రంగా ఈ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. పొచ్చెర, ఇచ్చోడలో గోడౌన్ల సమస్య ఏర్పడటంతో వాటిని నిర్మల్‌కు మార్చి ప్లాంట్లన్నింటిని ఒకే చోట ఏర్పాటు చేస్తున్నారు. దీనిలో భాగంగానే హాకా సంస్థ రూ.20 లక్షల వ్యయంతో ప్లాంట్‌ నిర్మించింది. ఇక్కడ పూర్తి సాంకేతికతో యంత్రాలను బిగించారు. ఈ ప్లాంట్‌ ద్వారా రైతుల నుంచి కొనుగోలు చేసిన విత్తనాలను శుద్ధి చేస్తారు. నాలుగు టన్నుల విత్తనం గంటకు శుద్ధి అయ్యే టెక్నాలజీ ఇక్కడ ఉంది. శుద్ధి చేసిన విత్తనం ఎప్పటికప్పుడు సంచులలో నింపి విత్తన ధృవీకరణ ట్యాగ్‌ వేసి ఉంచే అవకాశముంది. అయితే ఇక్కడ గోడౌన్లు తగినంతగా లేకపోవడంతో నిజామాబాద్‌ జిల్లా బోధన్‌కు పంటను తీసుకొని రావాలని రైతులకు చెబుతున్నారు. ఇందుకు అవసరమైన రవాణా ఛార్జీలను సంస్థే రైతులకు చెల్లిస్తోంది.

మంచి సాంకేతిక యంత్రంతో ఉన్న ఈ ప్లాంట్‌లో విత్తనశుద్ధి నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా సాగడంలేదు. దీనిని విస్తృత వినియోగంలోకి తీసుకురావడానికి నిర్మల్‌లో గోదాంల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపారు. ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో విత్తనశుద్ధి ప్లాంట్‌ ఏర్పాటు చేసేందుకు రెండేళ్ల కిందటే సామగ్రి సరఫరా చేశారు. ప్రస్తుతం భవన నిర్మాణం పనులు జరుగుతున్నాయి. భవనం పూర్తి అయితే ప్లాంట్‌ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ ప్లాంట్‌ అందుబాటులోకి వస్తే స్థానిక రైతులకు గణనీయమైన ప్రయోజనాలు లభిస్తాయని అధికారులు అంటున్నారు. వాస్తవానికి జిల్లా భూములు విత్తనోత్పత్తికి అనుకూలంగా ఉన్నాయి. రెండేళ్లుగా విత్తనోత్పత్తి చేపట్టినట్లు అధికారులు చెప్తున్నారు. శనగ విత్తనాలు ఉమ్మడి జిల్లాకే కాక ఇతర జిల్లాలకు సరఫరా చేసేలా నిల్వలు ఉన్నట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తే తెలంగాణలోని జిల్లాలకు అవసరమయ్యే వివిధ పంటల విత్తనాలను స్థానికంగానే ఉత్పత్తి చేసుకునే వీలుందని ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.

 

Related Posts