YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

శ్రమ దోపిడీ !!

శ్రమ దోపిడీ !!

గుంటూరు: మిర్చి పంట కోతకు వస్తుండడంతో గుంటూరు ప్రాంతంలోని మిర్చి యార్డుల్లో హడావిడి మొదలైపోయింది. కార్మికులూ వివిధ పనులతో బిజీగా గడిపేస్తున్నారు. మిర్చి ధరలు, ఎగుమతులు బాగానే ఉండడంతో మిర్చి తొడాలు తీసే కార్యక్రమం జోరుగా సాగుతోంది. మహిళా కార్మికులే అధికంగా మిర్చి తొడాలు తీస్తుంటారు. యార్డు సమీపంలోనే దాదాపు 200 రేకు షెడ్లలో ఈ పని జరుగుతుంటుంది. 7 వేల నుంచి 10వేల మంది మహిళా కార్మికులు తొడాలు తీసే పని ద్వారా ఉపాధి పొందుతున్నారు. ఉపాధి మాట ఎలా ఉన్నా వారు చేసే పనికి తగిన వేతనం లభించడంలేదు. పైగా అరకొర వసతుల మధ్య పని చేస్తుండడం వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం సీజన్‌ కావడం వల్ల కేజికి రూ.10 నుంచి రూ.22 వరకు కార్మికులకు ఇస్తున్నారు. కార్మికులందరికీ ఒక మహిళా మేస్త్రి ఉంటారు. కేటీ మిర్చికి రూ.1 వంతున కార్మికురాలు మేస్త్రికి చెల్లించాల్సి ఉంటుంది. లేకపోతే మరుసటి రోజు నుంచి ఆమెను పనిలోకి రానివ్వరు. ఈ దోపిడీ చాలదన్నట్లు తొడాలు తీసిన మిర్చిని తూకం వేసే సమయంలో గుమస్తాలు కూడా చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఫలితంగా శ్రమజీవులు కాటాలో సైతం దగా పడుతున్నారు. గుమస్తాలు సరిగా తూకం వేయకుండా తమశ్రమను దోచుకుంటున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పదిహేను కేజీలు వరకు తొడాలు తీస్తే పది కేజీలకే డబ్బు ఇస్తుంటారని వాపోతున్నారు. ఈ మోసాల గురించి అడిగే ధైర్యం లేదు వారికి. అడిగితే పని ఉండదని చేతికందే ఆ కొద్ది మొత్తం కూడా రాకుండా పోతుందని భయపడుతున్నారు. ఈ దందాను ప్రశ్నించే వారు లేకపోవడంతో ఇక్కడ గుమస్తాలు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని బాధితులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ బాధలకు తోడు అక్కడ కనీస వసతులు కూడా లేకపోవడం మహిళాకార్మికులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. మంచినీటికీ పలు షెడ్లలో కటకట నెలకొంది. నిర్వాహకులు తాగునీరు ఏర్పాటు చేయకపోతుండడంతో అంతా ఇంటి నుంచే మంచినీళ్లు తెచ్చుకుంటున్నారు. మరుగుదొడ్లు లేకపోవడం మరో ప్రధాన సమస్య. ప్రస్తుతం ఎండలు ముదిరిపోతుండడంతో కార్మికుల అవస్థలు మరింతగా పెరిగాయి. ఈ ఇబ్బందులన్నీ గుర్తించి కార్మికులకు కనీస వసతులు కల్పించాలని, శ్రమ దోపిడీని సైతం అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని బాధితులు నిర్వాహకులను కోరుతున్నారు.

Related Posts