90 లక్షలు..కరోనా రోబో
న్యూయార్క్, మే 2,
ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా వైరస్‌ను రెండు నిమిషాల్లో హతమార్చే రోబోను రూపొందించినట్లు అమెరికాకు చెందిన ఓ సంస్థ ప్రకటించుకుంది. UVC కాంతితిని వెలువరించే ఈ రోబో వైరస్, బ్యాక్టీరియాలను నాశనం చేస్తుంది.అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన ఓ కంపెనీ కరోనా వైరస్‌ను రెండు నిమిషాల్లో అంతమొందించే ఓ రోబోను రూపొందించింది. అత్యంత తీవ్రతతో ఉన్న అల్ట్రా వయోలెట్ సీ (యూవీసీ లైట్) కాంతి సాయంతో వైరస్‌ను నాశనం చేస్తారు. సాధారణ అతినీలలోహిత కాంతి (UV) తో పోలిస్తే UVC కాంతి తరంగదైర్ఘ్యం చిన్నగా, మరింత శక్తివంతంగా ఉంటుంది. జినెక్స్ డిస్‌ఇన్ఫెక్షన్ సర్వీస్ రూపొందించిన ఈ రోబోను అమెరికాలోని మిలిటరీ బేస్‌లు, పోలీసు బారక్‌లు, యూనివర్సిటీ క్యాంపస్‌లలో ఉపయోగిస్తున్నారు.టెక్సాస్ బయోమెడికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఈ రోబోను పరీక్షించగా కోవిడ్-19నకు కారణమైన SARS-CoV-2 వైరస్‌ను రోబో లైట్ స్ట్రైక్ రెండు నిమిషాల్లో హతం చేసింది. ఈ రోబోల్లో ఉండే జినాన్ ల్యాంప్ అత్యంత తీవ్రతతో ఉన్న ఫుల్ జెర్మిసైడల్ స్పెక్ట్రమ్ యూవీసీ లైట్‌ను ఉద్గారిస్తుంది. ఇది సూర్యరశ్మి కంటే ఇది తీవ్రంగా ఉంటుంది.ఈ కాంతి వైరస్‌లు, బ్యాక్టీరియా, బీజాంశాలను క్రియారహితం చేస్తుంది. రకరకాల తరంగదైర్ఘ్యాలతో యూవీసీ లైట్‌ను ప్రయోగించడం ద్వారా వ్యాధికారకాలను నశింపజేయొచ్చు. ఈ కాంతి తీవ్రతకు కళ్లు దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి.. రోబో మాత్రమే పని చేస్తుంది. ఈ సంస్థ ఒక్కో రోబోను లక్ష డాలర్ల చొప్పున విక్రయిస్తుంది. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.80 లక్షలు. దిగుమతి సుంకాలు, ఇతరత్రా ఖర్చులు కలిపితే.. మన దగ్గరకు వచ్చేసరికి రూ.90 లక్షలకుపైగా ఖర్చువుతుంది.