మంచిర్యాలలో కాన రాని మామిడి పండు
అదిలాబాద్, మే 2
కరోనా ప్రతి రంగంపైన ప్రభావం చూపిస్తోంది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, మార్కెట్‌లో గిట్టుబాటు ధర ప్రభావం వెరసి మామిడిపంటను నమ్ముకున్న జిల్లా రైతులు మూడేళ్లుగా నష్టాలను చవిచూస్తున్నారు. దిగుబడులు బాగుంటే ధర పడిపోవడం, ధర బాగుంటే దిగుబడులు తగ్గిపోవడం ఫలితంగా మామిడి రైతులు నిరాశను చవిచూస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో దాదాపు 17,500 ఎకరాల్లో మామిడిపంట సాగవుతోంది. చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో విస్తారంగా తోటలున్నాయి. మార్కెట్‌లో అత్యధిక డిమాండ్ పలికే తోతాపురి, బంగన్‌పల్లి, దసిలి, చెఱుకు, పంచదార, చెక్కెల గుంగళి, పెద్దరసాలు, చిన్నరసాలు రకాలు సాగవుతున్నాయి. సాధారణంగా ఈ చెట్ల నుంచి ఎకరాకు 3 నుంచి 4 టన్నుల దిగుబడులు వస్తాయి. ఈసారి పరిస్థితులు తారుమారు కావడంతో కనీసం 35 శాతం కూడా దిగుబడులు వచ్చేలా కనిపించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా మామిడి కాయలు ఇక్కడి ప్రజల అవసరాలకు సరిపోను పొరుగు రాష్ట్రంలోని నాగ్‌పూర్, నాందేడ్, ముంబయితో పాటు మన రాష్ట్రంలోని నిజామాబాద్, హైదరాబాద్ ప్రాంతాలకు ఎగుమతి అవుతాయి. ప్రస్తుత దిగుబడులను గమనిస్తే ఎగుమతి చేసే చోట దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితులే కనిపిస్తున్నాయని వ్యాపారవర్గాలు పేర్కొంటున్నారు.ఈసారి అనావృష్టి పరిస్థితులు, చీడపీడల ఉద్ధృతి వెంటాడటంతో పెట్టుబడులను కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. పూత, కాత దశలోనే ప్రతికూల వాతావరణం దిగుబడులను దెబ్బతీసేలా చేసింది. సాధారణంగా పూత నవంబరులో ప్రారంభమై జనవరితో ముగుస్తుంది. ఈసారి వాతావరణంలో సమతుల్యం లోపించడంతో పూత ఆలస్యంగా వచ్చింది. వచ్చిన పూత రాలిపోవడం, ఉన్నపూతపై చీడపీడలు ఆశించడంతో కాతపై ప్రభావం చూపింది. ఈపాటికే మామిడి కాయలు మార్కెట్‌ను ముంచెత్తాల్సి ఉండగా పంట లేకపోవడంతో మార్కెట్లు వెలవెల బోతున్నాయి. మామిడి దిగుబడులు ఇబ్బడిముబ్బడిగా రావడంతో స్థానికంగా కిలోకు రూ.15 అన్న కొనేవారు కరవయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇతర ప్రాంతాల్లో టన్నుకు రూ.15 వేలు కూడా పలకకపోవడంతో విక్రయించేందుకు తీసుకెళ్లిన రైతులకు కనీస రవాణా ఛార్జీలు కూడా వెళ్లక తీవ్రనష్టాలను చవిచూశారు. గత నష్టాలను అధిగమించేందుకు ఈసారి సాగైన పంటతో ఆశలు ఫలిస్తాయని ఎదురుచూసిన రైతులకు పంట దిగుబడులు తీవ్రనిరాశను కలిగించాయి. తగ్గిన దిగుబడులతో ఈసారి టన్నుకు రూ.60 వేల నుంచి రూ.70 వేలు పలుకుతుందని మార్కెట్ వర్గాలు చెబుతుండగా స్థానికంగా కిలోకు రూ.60 వరకు ఉంటుందని వ్యాపారులు పేర్కొంటున్నారు.