ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం వైసీపీ చెప్పిందే చేసిందన్నారు ఆపార్టీ అధినేత జగన్. చెప్పినట్టుగానే... తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేశారన్నారు. ఏపీ ప్రజలతో కలిసి పోరాడాలనే ఉద్దేశం ఉంటే టీడీపీ ఎంపీలతో కూడా సీఎం చంద్రబాబు రాజీనామాలు చేయించాలంటూ ట్విట్టర్ వేదికగా సవాల్ చేశారు. జగన్ చేసిన ట్వీట్స్ కు కౌంటరిచ్చారు మంత్రి నారా లోకేష్ . పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ముగియగానే అన్నట్లుగానే లోక్‌సభ సభ్యత్వాలకు వైసీపీ ఎంపీలు రాజీనామా చేశారు. లోక్‌సభ సమావేశాలు నిరవధిక వాయిదా పడిన తర్వాత లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహజాన్‌ను కలిసి వారి రాజీనామా లేఖలను అందజేశారు. ఎంపీలు మేకపాటి, వరప్రసాద్, మిధున్‌రెడ్డి, వైవీసుబ్బారెడ్డి, అవినాష్ రెడ్డిలు తమ రాజీనామాలు సమర్పించారు. వెంటనే తమ రాజీనామాలను ఆమోదించాలని ఎంపీలు కోరారు.ప్రత్యేక హోదా సాధన కోసం చెప్పినట్టుగానే తమ ఎంపీలు రిజైన్ చేశారని.. రాష్ట్రం కోసం టీడీపీ ఎంపీలు రాజీనామా చేస్తారా అని జగన్ ట్విటర్ వేదికగా చంద్రబాబుకు సవాల్ విసిరారు. ప్రత్యేక హోదా సాధన కోసం అందరం ఐకమత్యంగా నిలబడదామని జగన్ పేర్కొన్నారు. ఢిల్లీలో ఎంపీల ఆమరణ దీక్షతో పాటూ రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు చేస్తామని..హోదా పోరాటంలో ప్రజలకు అండగా వైసీపీ నిలబడుతుందని మరో ట్వీట్‌లో జగన్ పేర్కొన్నారు.జగన్ ట్వీట్‌కు మంత్రి లోకేష్ కౌంటర్ ఇచ్చారు. ఏపీకి న్యాయం కోసం గల్లీ నుంచి ఢిల్లీ దాకా తాము పోరాడుతుంటే... జగన్ మాత్రం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని కౌంటర్ ఇచ్చారు. ఏపీ కోసం ఎక్కడా జగన్ గొంతు ఎత్తలేదని, కోర్టుల్లో చేతులు కట్టుకోవడంలో, శుక్రవారం ప్రార్థనల్లో బిజీగా ఉన్నారని సెటైర్ వేశారు.వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, అవినాష్ రెడ్డి, వరప్రసాద్ స్పీకర్ ఫార్మాట్‌లో పదవులకు రాజీనామా చేశారు. రాజీనామా లేఖలను స్పీకర్ సుమిత్రామహాజన్‌కు అందించారు. తమ రాజీనామాలను వెంటనే ఆమోదించాలని స్పీకర్‌ను కోరారు. అయితే సభలోనే ఉండి సమస్యలతో పోరాడాలని వైసీపీ ఎంపీలకు స్పీకర్ సూచించారు.