‘ఆరోగ్య సేతు’పై రాహుల్ గాంధీ ఆరోపణలు వ్యక్తిగత సమాచారం లీక్
కరోనా వ్యాప్తిని అరికట్టడంలో కీలకంగా మారుతుందని కేంద్రం వెల్లడిస్తున్న ఆరోగ్య సేతు యాప్‌పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యాప్ ఓ అధునాతన నిఘా వ్యవస్థ అని ఆయన ఆరోపించారు. వ్యవస్థీకృత పర్యవేక్షణ లేకుండానే దీని నిర్వహణ బాధ్యతలను ఓ ప్రైవేట్ సంస్థకు అప్పగించారని విమర్శించారు.ఆరోగ్య సేతు యాప్‌ను ఇకపై విస్తృతంగా వినియోగించుకోవాలని భావిస్తున్న కేంద్రం... దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులందరూ తప్పనిసరిగా ఆరోగ్య సేతు యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని కేంద్రం ఆదేశించింది. ఎక్కడైనా సరే కార్యాలయాలకు హాజరయ్యే ఉద్యోగుల ఫోన్లలో ఆ యాప్ ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. దీనికి సంస్థాగత పర్యవేక్షణ లేకపోవడం వల్ల డేటా భద్రతకు భంగం కలగడం, వ్యక్తిగత గోప్యత సమస్యలు లాంటివి పెరుగుతాయని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. సాంకేతిక పరిజ్ఞానం అనేది మనల్ని సురక్షితంగా ఉంచాలన్న ఆయన... అనుమతి లేకుండా మనపై నిఘా ఉంటుందన్న భయాలను మాత్రం కలిగించకూడదని అన్నారు. మే 4 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని ప్రకటించింది. ఆయా కంపెనీలు, సంస్థలు, శాఖల ఉన్నతాధికారులు దీన్ని తప్పనిసరిగా అమలయ్యే బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేసింది.