సరదా ట్వీట్ దెబ్బకు...లక్ష కోట్లు ఆవిరి
పిచ్చి తలకెక్కే ట్వీట్లతో సొంత కంపెనీకే ఎసరు తేవడంలో టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మాస్క్ చిరపరిచితుడు తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో "టెస్లా స్టాక్ ధర చాలా ఎక్కువ," అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు తన ఇల్లుతో సహా తన ఆస్తులన్నీ అమ్మేస్తానని ఆయన ట్వీట్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తుంది. ఇలాంటి సమయంలో స్పేస్ ఎక్స్ సీఈవో, టెస్లా సహవ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ చేసిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారి కొంప ముంచింది. ట్వీట్ దెబ్బకు స్టాక్ మార్కెట్లో టెస్లా కంపెనీ మార్కెట్ వ్యాల్యూ ఏకంగా 14 బిలియన్ డాలర్లు అంటే సుమారు రూ. లక్ష కోట్ల పై మాటే హుష్ కాకి అన్నట్లు ఆవిరి అయిపోయింది. దీంతో ఎలాన్ మాస్క్ తన చీఫ్ ఎగ్జిక్యూటివ్ పదవికి కూడా ఎసరు పెట్టుకున్నాడు.టెస్లా మార్కెట్ వాల్యూ 141 బిలియన్ డాలర్లు కాగా, ఎలాన్ మాస్క్ ట్వీట్ దెబ్బకు 127 బిలియన్ డాలర్లకు పతనమైంది. ఓ ఫాలోయర్ అయితే డబ్బులు అవసరమై ఇలా అమ్మకానికి పెడుతున్నారా? లేక ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకు నిరసనగా ఇలా చేస్తున్నారా? అని అడిగారు. దీనిపై మాస్క్ స్పందిస్తూ.. డబ్బు అక్కర్లేదు. అంగారకుడికి, భూమికి నన్ను నేను అంకితం చేసుకుంటున్నాను. ఆస్తులు కలిగి ఉండడం భారమే తప్ప మరోటి కాదు.. అని బదులిచ్చారు.ఇదిలా ఉంటే 2018 లో సైతం ఎలాన్ మాస్క్ ఇలాంటి తుంటరి ట్వీట్ కారణంగా చైర్మన్ పదవి త్యాగం చేయాల్సి వచ్చింది. అప్పట్లో టెస్లా కంపెనీ స్టాక్ మార్కెట్ నుంచి వైదొలుగుతుందని, ప్రైవేటు యాజమాన్య సంస్థగా మార్చుతున్నానని ట్వీట్ చేశాడు. అంతేకాదు అందుకు తగిన నిధులు కూడా సమకూర్చినట్లు తెలిపాడు. దీంతో ఒక్కసారిగా కంపెనీ షేర్ల విలువ పెరిగింది. ఆ వార్తలన్నీ అవాస్తవమని US Securities and Exchange Commission (SEC) తేల్చడంతో మళ్లీ షేర్లు పతనం అయ్యాయి. ఫలితంగా మాస్క్ చైర్మన్ పదవి కోల్పోవాల్సి వచ్చింది.