*పార్వతిదేవి చౌడేశ్వరి మాతగా పూజలందుకుంటున్న పుణ్యక్షేత్రం.*
* భక్తుల మనసులో పిరికితనాన్ని పోగొట్టి ధైర్య సాహసాలిచ్చే వీర చౌడేశ్వరీదేవిని విన్నారా?
* సౌభాగ్యాలూ ప్రసాదించే తల్లి భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా వీరాదిల్లుతుంది...
* అన్నదానికి సంకేతమా అన్నట్లు అమ్మవారి ఒక చేతిలో ఖడ్గం, మరొక చేతిలో కుంకుమ భరణె కలిగి వుంటాయి...
ఈ సృష్టికి మూలం శక్తి. ప్రథమ వేదమైన ఋగ్వేదంలో శక్తి సర్వమహాశక్తుల సమాహారమూర్తిగా అభివర్ణించబడింది. ఆ శక్తిని ఎవరు ఆరాధించినా స్ర్తిమూర్తిగానే ఆరాధిస్తారు. దీనినే ఈ శక్త్యారాధన శాక్తాయంగా చెప్పబడింది. జగదాంబగా పేరుపొందిన ఆదిపరాశక్తి పలు నామాలతో పూజలందుకుంటూ వుంది. ఆ పేర్లలో చాముండి, చాముండేశ్వరి, చౌడేశ్వరి పేర్లు లోకప్రసిద్ధి పొందాయి. పార్వతిమాత చౌడేశ్వరి మాతగా పూజలందుకుంటున్న పుణ్యక్షేత్రం ‘నందవరం’. రాజుల, నవాబుల ఏలుబడిలో ఒకప్పుడు ఉన్న ఈ దివ్యక్షేత్రంలోని చౌడేశ్వరి మాత ఆలయం అతి పురాతనమైన ఆలయంగా ప్రసిద్ధిగాంచింది. చారిత్రక, మరియు పౌరాణిక విశేషాలతో పుణికిపుచ్చుకున్న ఈ ఆలయంలో కొలువుదీరిన చౌడేశ్వరీమాత దర్శనం సర్వపాప హరణంగా, సర్వఐశ్వర్య ప్రదాయకంగా భక్తులు భావిస్తారు. కాశీ పుణ్యక్షేత్రంలో జ్యోతి స్వరూపంగా భాసించే కాశీ విశాలాక్షియే ఒకానొక సందర్భంలో ఆంధ్ర దేశానికి జ్యోతి స్వరూపంగా తరలివచ్చి నందవర పుణ్యక్షేత్రంలో సువర్ణ రూపంలో స్వయంభువుగా వెలిసిందని ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. భక్తుల మనసులో పిరికితనాన్ని పోగొట్టి ధైర్య సాహసాలిచ్చే వీర చౌడేశ్వరీదేవి విన్నారా? తనను కొలిచే కొందరు బ్రాహ్మణుల కోసం సాక్ష్యం చెప్పటానికి ఈ దేవి కాశీనుంచి సొరంగమార్గాన కదిలివచ్చి ఇక్కడ కొలువైనదంటారు. ఆ ప్రదేశమే కర్నూలు జిల్లాలోని నందవరం. ఈ ఊరు కర్నూలు జిల్లాలోని నంద్యాల పట్టణానికి 20 కి.మీ. ల దూరంలో, పాణ్యం – బనగానపల్లె రోడ్డులో వున్నది. అతి పురాతనమైన ఈ ఆలయం నిర్మాణకాలం తెలియదని కొందరంటే 4 వేల సంవత్సరాల క్రితం నిర్మింపబడిందని కొందరంటారు. సమయం ఎప్పుడైనా, ఈ దేవి కాశీనుంచి సాక్ష్యం చెప్పటానికి వచ్చి ఇక్కడ వెలసిందని అందరూ అంటారు. ఆ కధేమిటంటే…. పూర్వం చంద్రవంశీయ రాజైన నంద భూపాలుడు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తూవుండేవాడు. ఆయన పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో వుండేవాళ్ళు. నందభూపాలుడికి దైవభక్తి కూడా మెండు. ఆయన భక్తికి మెచ్చిన శ్రీ దత్తాత్రేయస్వామి రోజూ కాశీవెళ్ళి గంగలో స్నానం చెయ్యాలనే ఆయన కోర్కెను తీర్చటానికి పావుకోళ్ళను ప్రసాదించాడు. అయితే ఆ విషయం ఎవరికీ చెప్పకుండా రహస్యంగా వుంచమంటాడు. ఆ రాజు, రోజూ తెల్లవారుఝామునే ఆ పావుకోళ్ళు ధరించి మనోవేగంతో కాశీచేరి గంగలో స్నానమాచరించి, విశ్వనాధుణ్ణి, విశాలాక్షిని, అన్నపూర్ణని దర్శించి తిరిగి తెల్లవారేసరికి తన రాజ్యం చేరుకునేవాడు. కొంతకాలం ఇలా గడిచాక, నందభూపాలుడి భార్య శశిరేఖ తన భర్త రోజూ తెల్లవారుఝామునే ఎక్కడికో వెళ్ళివస్తూండటం గమనించి భర్తను అడుగుతుంది. తప్పనిసరి పరిస్ధితుల్లో శశిరేఖకు విషయం చెప్తాడు నందభూపాలుడు. ఆవిడ తనని కూడా కాశీ తీసుకువెళ్ళమని కోరుతుంది. ఆవిడ మాట కాదనలేక రాజు ఆ రోజు ఆవిడనికూడా కాశీ తీసుకువెళ్తాడు. తిరిగివచ్చు సమయానికి పావుకోళ్ళు పనిచేయవు. కారణం రాణీ శశిరేఖ బహిష్టుకావటం. తన రాజ్యానికి సత్వరం చేరకపోతే రాజ్యం అల్లకల్లోలమవుతుందనే భయంతో దిక్కుతోచని రాజు ఆ సమీపంలోనేవున్న ఆలయందగ్గరవున్న బ్రాహ్మణులనుచూసి వారిని తరుణోపాయం చూపించమని వేడుకుంటాడు. అందులో ఋగ్వేద పండితుడయిన ఒక బ్రాహ్మణుడు రాజుకి సహాయంచెయ్యటానికి సంసిధ్ధతను తెలియజేస్తాడు. ఆయన తనతోటి వారిని ఇంకో 500 మంది పండితులనుకలుపుకుని, దోషనివారణార్ధం జపతపాలుచేసి, తమ తపోశక్తి వారికి ధారపోసి వారిని వారి రాజ్యానికి చేరుస్తారు. ప్రత్యుపకారంగా రాజు వారికేసహాయంకావాల్సివచ్చినా తప్పక చేస్తానని, వారు నిస్సంకోచంగా కోరవచ్చునని అనగా, ఆ బ్రాహ్మణులు భవిష్యత్ లో అవసరమైనప్పుడు తప్పక కోరుతామంటారు. రాజూ, రాణీ తమ రాజ్యానికి చేరుకున్నారు. ఆ పాదుకలను, మంత్ర శక్తిని తిరిగి వాడకుండా దత్తాత్రేయ మందిరంలో వుంచి, తమ రాజ్యంలో సుఖంగా వుండసాగారు. కొంతకాలం తర్వాత కాశీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కరువురాగా, నందభూపాలుని సహాయమర్ధించటానికి ఆ బ్రాహ్మణులలో కొందరు బయల్దేరుతారు. వారు నందవరంచేరి, రాజసభకువచ్చి తమరాకకి కారణం చెబుతారు. రాజుకి అంతా తెలిసినా, తన తోటివారికి తెలియదుకనుక, వారికికూడా తెలియజేసే ఉద్దేశ్యంతో తానిచ్చిన వాగ్దానానికి ఋజువేమిటని అడుగుతాడు. బ్రాహ్మణులు రాజు వాగ్దానము చేసింది నిత్యం తాము కొలిచే చాముండేశ్వరీదేవి గుడి ముందు, ఆవిడ తప్ప వేరే సాక్ష్యంలేదనీ, ఆవిడనే నమ్ముకున్న తాము సాక్ష్యమిమ్మని ఆవిడని బతిమాలుతామంటారు. రాజు ఆ దేవదేవి తన రాజ్యానికి వస్తుందని లోలోన సంతోషించి అంగీకరిస్తాడు. వచ్చిన బ్రాహ్మణులలో కొందరు తిరిగి కాశీ వెళ్ళి తమ ఇష్టదైవం చాముండేశ్వరీదేవిని పరిపరివిధాల ప్రార్ధించి, సాక్ష్యం చెప్పటానికి రావలసినదిగా కోరుతారు. ఆ దేవి అలాగే వస్తానని, వారిని ముందు బయల్దేరమని, తేజోరూపంలో తను వారి వెనుకనే వస్తానని, అయితే దోవలో ఎక్కడా వెనుదిరిగి చూడవద్దని చెబుతుంది. మునుపు రాజుకి సహాయంచేసిన మిగతా 500మంది బ్రాహ్మణులనికూడా నందవరం రమ్మని చెబుతుంది. అందరూ సొరంగ మార్గాన నందవరానికి బయల్దేరుతారు. నందవరం చేరుతుండగా అందులో ఒక బ్రాహ్మణునికి అనుమానం వస్తుంది. తమ వెనుక ఏమీ అలికిడి కావటంలేదు, అమ్మవారు తమతో వస్తోందో రావటంలేదోనని సందేహంతో వెనుదిరిగి చూస్తాడు. అక్కడదాకా వచ్చిన అమ్మవారు వెంటనే శిలారూపందాలుస్తుంది. చింతిల్లితున్న బ్రాహ్మణులతో ఆమె చౌడేశ్వరీదేవిగా తానక్కడే కొలువైవుండి భక్తులను సంరక్షిస్తూ వుంటానని తెలుపుతుంది. నందభూపాలుడు కాశీనుంచి వచ్చిన ఆ దేవత తమ రాజ్యంలో వెలిసినదని సంతోషంతో గుడి కట్టించి, పూజలుసల్పసాగాడు. అమ్మవారితో కాశీనుంచి కదిలివచ్చిన 500మంది బ్రాహ్మణులు, అమ్మవారి ఆజ్ఞమేరకు అక్కడే వుండి తమ కులదైవమైన ఆ దేవిని పూజించుకోసాగారు. ఆ బ్రాహ్మణ కుటుంబాలను నందవరీకులంటారు. వారు ఇప్పటికీ చౌడేశ్వరీదేవిని తమ కులదేవతగా పూజిస్తారు. ఆ కుటుంబీకులు గర్భగుడిలోకెళ్ళి స్వయంగా దేవిని పూజించుకోవచ్చు. కాశీనుంచి బ్రాహ్మణులు, అమ్మవారు వచ్చిన సొరంగమార్గం ఇంకా వుందంటారు. కానీ అందులోకి ప్రవేశం లేదు. నందవరీక బ్రాహ్మణులకేకాక తొగట వీర క్షత్రియలకుకూడా చౌడేశ్వరీదేవి కులదేవత. అమ్మవారు ముందు చాలా ఉగ్రరూపంలో వుండేది. ఆ రూపాన్ని ప్రజలు చూడలేకపోయేవారు. భక్తుల సౌకర్యార్ధం, వారా తల్లి ఉగ్రరూపంచూడలేరని ఆ దేవి విగ్రహంలాంటిదే ఇంకొకటి తయారుచేయించి ప్రతిష్టించారు. అయితే ఈ విగ్రహం అసలు విగ్రహమంత భయంకరంగా వుండదు. అసలు విగ్రహం ఇప్పుడు అమ్మవారువున్న స్ధానానికి సరిగ్గా దిగువ భూగర్భంలో వున్నది. అక్కడికి వెళ్ళే మార్గం వున్నదికానీ ఎవరికీ ప్రవేశంలేదు. ఆలయం ముందు సొరంగ మార్గం వున్నది. పది మెట్లు దిగి వెళ్తే అక్కడ అమ్మవారి పాదాలు వున్నాయి. ఆ మార్గంనుంచే అమ్మవారు, మిగతా బ్రాహ్మణులు, కాశీనుంచి ఇక్కడికి వచ్చారంటారు. అమ్మవారు వీర చౌడేశ్వరీదేవి. వీరత్వానికి తగ్గట్లే రూపం వుంటుంది. ఈ తల్లిని సేవించినవారికి అన్నిరకాల భయాందోళనలు దూరమయి ధైర్యసాహసాలతో విలసిల్లుతారని ప్రతీతి. ధైర్యసాహసాలకు ప్రతీకగా నిలచిన ఆ దేవి తోజోవంతమైన రూపం చూసినవారి మనసులోని అన్ని భయాందోళనలూ పటాపంచలవుతాయి. ధైర్యసాహసాలేకాదు సకల సౌభాగ్యాలూ ప్రసాదించే తల్లి అన్నదానికి సంకేతమా అన్నట్లు అమ్మవారి ఒక చేతిలో ఖడ్గం, మరొక చేతిలో కుంకుమ భరణె వుంటాయి. ఆలయం ప్రక్కనే ఒక చెట్టు వున్నది. విశాలంగా విస్తరించిన ఈ వృక్షం ఆకులు మన గోరింట చెట్టు ఆకులులాగా ఇంకా చిన్నగా వుంటాయి. చిన్న చిన్న తెల్ల పూలతో ఆకర్షణీయంగా వుండే ఈ చెట్టు కరివె. ఈ వృక్షం కూడా అమ్మవారితోబాటు కాశీనుంచి తరలివచ్చిందని భక్తుల విశ్వాసం. అందుకే అచంచల భక్తితో భక్తులు ఈ వృక్షనికి కూడా పూజలు చేస్తారు. అమ్మవారిముందు శ్రీ చక్రం వున్నది. భక్తులు అక్కడ కుంకుమ పూజ చేయవచ్చు.
శ్రీ మాత్రే నమః
వరకాల మురళి మోహన్ సౌజన్యంతో