YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పాలిటిక్స్.. ఫ్రమ్ హోమ్...

పాలిటిక్స్.. ఫ్రమ్ హోమ్...

పాలిటిక్స్.. ఫ్రమ్ హోమ్...
విజయవాడ, మే 4,
టెక్నాల‌జీని వాడుకోవ‌డంతో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడుది అందెవేసిన చేయి. ఈ మాట ఆయ‌నే అనేకసార్లు చెప్పారు. కంప్యూటర్లు, సెల్‌ఫోన్‌లు దేశంలోకి రావ‌డంలో త‌న చొర‌వ‌, ముందుచూపును అప్పుడ‌ప్పుడు ఆయ‌న గుర్తు చేస్తుంటారు. ఇక ఆయ‌న ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో అయితే టెక్నాల‌జీని వాడుకునే ముఖ్య‌మంత్రుల్లో దేశంలోనే ముందుండేవారు. ఆర్టీజీఎస్‌, డాష్‌బోర్డు ద్వారా రాష్ట్రంలో ఎక్క‌డ ఒక వీధిలైటు వెల‌గ‌క‌పోయినా త‌న‌కు క‌నిపించేలా చేశాన‌ని కూడా ఆయ‌న చెబుతారు.మ‌రి, ఇంతలా టెక్నాల‌జీని వినియోగించే చంద్ర‌బాబు ఇప్పుడు లాక్‌డౌన్ స‌మ‌యంలో ఎందుకు వ‌దులుకుంటారు. పూర్తి స్థాయిలో టెక్నాల‌జీని ఉప‌యోగించుకుంటున్నారు. అలాగే తెలుగు త‌మ్ముళ్లు కూడా ఉప‌యోగించేలా చేస్తున్నారు. అంతేకాదు హైద‌రాబాద్‌లో ఉంటూనే ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో ప్ర‌తీ రోజూ ఏదో ఒక ర‌కంగా వార్త‌ల్లో నిలుస్తున్న చంద్ర‌బాబు తెలుగు త‌మ్ముళ్ల‌కు కూడా వ‌ర్క్ ఫ్ర‌మ్ నేర్పించారు. దీంతో ఇప్పుడు రాష్ట్ర‌వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నేత‌లంతా వ‌ర్క్ ఫ్ర‌మ్ హోం ద్వారా రాజ‌కీయాలు చేస్తూ కొత్త ఒర‌వ‌డి సృష్టిస్తున్నారు.
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికారం కోల్పోయాక ప‌క్కా సాఫ్ట్‌వేర్ ఉద్యోగిలా చంద్ర‌బాబు ప‌నితీరు మారిపోయింది. సోమ‌వారం ఉద‌యాన్నే హైద‌రాబాద్‌లో విమానం ఎక్కి గ‌న్న‌వ‌రంలో దిగ‌డం, శుక్ర‌వారం వ‌ర‌కూ అమ‌రావ‌తిలోనే ఉండ‌టం, మ‌ళ్లీ శుక్ర‌వారం సాయంత్రం విమానం ఎక్కి హైద‌రాబాద్ వెళ్లిపోవ‌డం చేస్తున్నారు. ఇలా ఆయ‌న త‌న కాలాన్ని బ్యాలెన్స్ చేస్తున్నారు. అంత‌కుముందు ప్ర‌తిప‌క్ష నేత‌గా జ‌గ‌న్ ఉన్న‌ప్పుడు కూడా హైద‌రాబాద్ కేంద్రంగానే ఏపీ రాజ‌కీయాలు చేసే వారు. ఇక‌, క‌‌రోనా వైర‌స్ ప్ర‌భావం మొద‌లు కాక‌ముందు, లాక్‌డౌన్ విధించ‌క‌ముందే చంద్ర‌బాబు నాయుడు హైద‌రాబాద్ వెళ్లిపోయారు. దీంతో ఆయ‌న ఇప్పుడు అక్క‌డే ఉండిపోయారు.వాస్త‌వానికి రాష్ట్ర ప్ర‌తిప‌క్ష నేత‌గా తాను ఏపీకి వ‌స్తానంటే ప్ర‌భుత్వం అనుమ‌తించే అవ‌కాశం ఉంది. ప‌రీక్ష‌లు జ‌రిపి ఆయ‌న ప‌ని ఆయ‌న‌ను చేసుకునే అవ‌కాశం ప్ర‌భుత్వం క‌ల్పించాలి కూడా. కానీ, వైసీపీ నేత‌లు ఆయ‌న ఏపీకి వ‌స్తే క్వారంటైన్‌లో ఉండాల్సిందే అనే ప్ర‌క‌ట‌న‌లు ఇస్తున్నారు. ఇదే స‌మ‌యంలో ఏపీకి వ‌స్తాన‌ని, త‌న‌ను అనుమ‌తించండి అని చంద్ర‌బాబు కూడా ఎటువంటి ప్ర‌తిపాద‌న పెట్ట‌లేదు.నిజానికి ఆయ‌న వ‌య‌స్సురిత్యా కరోనా వ్యాప్తి ఎక్కువ ఉన్న దృష్ట్యా క్షేత్ర‌స్థాయిలోకి ఇప్ప‌ట్లో ఆయ‌న రాక‌పోవ‌డం, ప‌ర్య‌ట‌న‌లు పెట్టుకోక‌పోవ‌డ‌మే మంచిది. ఇదే ఉద్దేశ్యంతో కావ‌చ్చు హైద‌రాబాద్‌కే ప‌రిమిత‌మైనా ఏపీ రాజ‌కీయాల్లో ఎప్ప‌టి లాగానే త‌న ముద్ర‌ను స్ప‌ష్టంగా చూపిస్తున్నారు.జూమ్ యాప్ ద్వారా రెండు, మూడు రోజుల‌కు ఒక‌సారి ప్రెస్‌మీట్లు పెడుతున్నారు. టీడీపీ నేత‌ల‌తో, వివిధ వ‌ర్గాల వారితో టెలీ, వీడియో కాన్ఫ‌రెన్స్‌ల‌ను నిర్వ‌హిస్తున్నారు. ఇదే కాకుండా ప్ర‌జ‌ల‌కు బ‌హిరంగ లేఖ‌లు రాస్తున్నారు. అటు కేంద్రానికి, ఇటు రాష్ట్రానికీ లేఖ‌లు రాస్తున్నారు. అప్పుడ‌ప్పుడూ ట్విట్ట‌ర్‌లో క‌రోనా ప‌రిస్థితులు, రాజ‌కీయాల‌పై స్పందిస్తున్నారు. వైసీపీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఎలాగూ బ‌ల‌మైన మీడియా టీడీపీకి అనుకూలంగా ఉన్న నేప‌థ్యంలో ఒక్కోసారి ముఖ్య‌మంత్రి కంటే ఎక్కువ చంద్ర‌బాబుకు క‌వ‌రేజ్ దొరుకుతోంది. ఇలా చంద్ర‌బాబు హైద‌రాబాద్ నుంచే ఏపీలో రాజ‌కీయాలు ఎలా చేయాలో పాలిటిక్స్ ఫ్ర‌మ్ హోం అనే కొత్త ఒర‌వ‌డి సృష్టించారు.ఇదే స‌మ‌యంలో తెలుగుదేశం పార్టీ నాయ‌కుల‌కు, శ్రేణుల‌కు కూడా ఇదే దిశానిర్దేశం చేస్తున్నారు. ఇంటివ‌ద్ద నుంచే రాజ‌కీయాలు చేయ‌డం ఎలానో నేర్పించారు. దీంతో ఇప్పుడు టీడీపీ నేత‌లు, ప్ర‌జాప్ర‌తినిధులు అంతా ఇంటి వ‌ద్ద‌నే ఉంటూ రాజ‌కీయాలు చేస్తున్నారు. ఇళ్ల నుంచే టెక్నాల‌జీ ద్వారా ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ప్ర‌భుత్వ విధానాల‌కు వ్య‌తిరేకంగా, కొత్త కొత్త డిమాండ్ల‌తో ఇళ్ల‌లోనే దీక్ష‌లు చేస్తున్నారు.నిజానికి రాజ‌కీయ నాయ‌కులు బ‌య‌ట తిరగ‌డం బోలెడు ఖ‌ర్చుతో కూడుకున్న వ్య‌వ‌హారం. ఇప్పుడు ఆ అవ‌స‌రం లేకుండా ఇళ్ల నుంచి దీక్ష‌లు, ప్రెస్ మీట్లు పెట్ట‌డం ద్వారా ఎలాగూ రావాల్సినంత ప‌బ్లిసిటీ వ‌చ్చేస్తోంది. ఇదే స‌మ‌యంలో టీడీపీ శ్రేణుల‌కు కూడా సోష‌ల్ మీడియాలో యాక్టీవ్ కావాల‌ని అని చంద్ర‌బాబు దిశానిర్దేశం చేస్తున్నారు. వీరంతా గ‌తం కంటే ఎక్కువ‌గా సోష‌ల్ మీడియాలో చురుగ్గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. వైసీపీని ఇరుకున పెట్ట‌డమే ల‌క్ష్యంగా త‌మ ప‌రిధిలో దూసుకుపోతున్నారు.

Related Posts