కేసీఆర్ నిర్ణయంపై ఆసక్తి
హైద్రాబాద్, మే 4,
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 5వ తేదీన ప్రగతి భవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన జరగునుంది. ఈ సమావేశంలో లాక్‌డౌన్‌కు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను పొడగిస్తారా? లేదా? అన్న విషయంపై సిఎం కెసిఆర్ తీసుకునే నిర్ణయంపై దేశవ్యాప్తంగా సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. కేంద్ర లాక్‌డౌన్ 3వ తేదీన ముగుస్తుండగా, రాష్ట్రంలో 7వ తేదీ వరకు విధించారు. అయితే కేంద్రం లాక్‌డౌన్‌పై తీసుకునే నిర్ణయాలు, రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి, కేసుల నమోదు ఆధారంగానే నిర్ణయాలుంటాయని సచివాలయ వర్గాలు వెల్లడించాయి. అలాగే ప్రస్తుత తరణంలో రైతులు ఏ పంటలు వేస్తే మేలు కలుగుతుందన్న విషయంపై అధికారులు ఇచ్చే నూతన వ్యవసాయ విధానం నివేదికపై కూడా సమావేశంలో చర్చించనున్నారు. వీటితో పాటు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తదితర అంశాలపై సమగ్రంగా క్యాబినెట్‌లో చర్చిస్తారు. ప్రధానంగా రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం, లాక్‌డౌన్ నిబంధనలు అమలుపై సమీక్షిస్తారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో లాక్‌డౌన్ నిబంధనలను చాలా నిక్కచ్చిగా అమలు అవుతున్నాయి. దీని కారణంగానే రాష్ట్రంలో కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. అయినప్పటికీ వైరస్ పట్ల ఏ మాత్రం ఆలక్షంగా ఉన్న ఇన్ని రోజుల పాటు పడిన శ్రమ బూడిదలో పోసిన పన్నీరుగా మారనుంది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌పై సిఎం కెసిఆర్ మరింత ఆచితూచి నిర్ణయం తీసుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉండగా ఈ నెల 17వ తేదీతో కేంద్రం విధించిన లాక్‌డౌన్ గడువు ముగియనుంది. అయితే లాక్‌డౌన్ గడువును మరోసారి పొడగించాలని ఇటీవల అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్రమోడీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పలువురు సిఎంలు కోరారు. దీంతో కేంద్రం తీసుకునే నిర్ణయంపై కూడా రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కూలంకషంగా చర్చించనున్నారు. లాక్‌డౌన్ ఆంక్షలపై కేంద్రం ఇప్పటికే పలు సడలింపుల అమలుపై కూడా సమీక్షించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కేసులు తగ్గుముఖం పడుతుండం పట్ల సిఎం కెసిఆర్ పూర్తి సంతృప్తితో ఉన్నప్పటికీ ఆంక్షలను ఏ మాత్రం సడలించినా కరోనా మళ్ళీ విజృంభించే అవకాశముందని భావిస్తున్నారు. పాక్షిక సడలింపులు వేటికి, ఏ ప్రాంతాల్లో ఇవ్వొచ్చనే దానిపై కూడా నిర్ణయాలుంటే అవకాశం ఉంది. రాష్ట్ర మంత్రుల్లోనూ లాక్‌డౌన్ పొడగింపు మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రజల ఆహార అవసరాలరకు తగినట్లు, మార్కెట్‌లో డిమాండ్ కలిగిన పంటలను సాగు చేసేందుకు రైతులను అవసరమైన సూచనలు, సలహాలపై కూడా మంత్రివర్గ సమావేశం అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోనున్నారు. గతంలో రైతులు పడిన అగచాట్లు భవిష్యత్తులో లేకుండా ఉండేలా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నట్లు తెలిసింది.